దేశవ్యాప్తంగా కరోనా సంక్రమణ హద్దులు దాటుతున్న వేళ కట్టడికి కేంద్రం మరోసారి రంగంలోకి దిగింది. శీతాకాలం ప్రారంభమై, కోవిడ్–19 పాజిటివ్ కేసుల్లో మళ్ళీ పెరుగుదల ఉన్న నేపథ్యంలో బుధవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు డిసెంబర్ 1 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా అమలులో ఉంటాయి.
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ఇప్పటికే ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో కఠినంగా అమలు అవుతున్న కొన్ని నిబంధనలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కచ్చితంగా పాటించాల్సిందేనని ఆదేశించింది. కరోనా సంక్రమణను ఆపేందుకు జన సమర్ధక ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నియంత్రించాలని, పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ పెంచాలని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ సూచించింది. కొన్ని ప్రాంతాలలో కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో కోవిడ్–19 సంక్రమణను తనిఖీ చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రాత్రిపూట కర్ఫ్యూ వంటి ఆంక్షలను స్థానికంగా విధించుకోవచ్చని తెలిపింది. అయితే కంటైన్మెంట్ జోన్ బయట లాక్డౌన్ విధించే ముందు మాత్రం రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదించాలని స్పష్టం చేసింది. మార్గదర్శకాల్లో నిర్దేశించిన నియంత్రణ చర్యలను ప్రజలు కచ్చితంగా పాటించేలా స్థానిక జిల్లా, పోలీసు, మునిసిపల్ అధికారులు బాధ్యత వహించాలని కేంద్రం ఆదేశించింది.
► మాస్క్‌లు, భౌతికదూరం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించనివారికి తగిన జరిమానా విధించాలని మార్గదర్శకాల్లో స్పష్టంగా ఆదేశించింది. వైరస్ సంక్రమణ కట్టడికి కార్యాలయాల్లోనూ మాస్క్‌లు ధరించని వ్యక్తులకు జరిమానాలు విధించాలని తెలిపింది. ఆరోగ్య సేతు యాప్‌ను విధిగా అందరూ వినియోగించాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల 50 శాతం కెపాసిటీతో సినిమా థియేటర్ల కార్యకలాపాలకు అనుమతి ఇచ్చిన కేంద్రం, స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతిని క్రీడాకారుల శిక్షణ నిమిత్తం మాత్రమే ఇచ్చింది. ఆధ్యాత్మిక, సామాజిక, క్రీడ, వినోద, విద్య , సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్య , వారు హాజరైన వేదిక సామర్థ్యంలో 50 శాతానికి మించకూడదని తెలిపింది.మార్కెట్లు, వారాంతపు సంతలకు నియమాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరలో జారీ చేయనుంది.
► పాజిటివ్ కేసును గుర్తించిన తర్వాత వారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారి వివరాలను సేకరించటంతో పాటు, వారిని గుర్తించటం, క్వారంటైన్ చేయటం వంటి పనులన్నింటినీ 72 గంటల్లో కనీసం 80శాతం పూర్తి చేయాలని సూచించింది. అంతేగాక కోవిడ్–19 రోగులకు వెంటనే హోం ఐసోలేషన్ నిబంధనలను పాటిస్తూ చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సూక్ష్మ స్థాయిలో, జిల్లా అధికారులు కంటైన్‌మెంట్ జోన్‌ల గుర్తింపులో అప్రమత్తంగా ఉండాలని, కంటైన్‌మెంట్ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని పేర్కొన్నారు.
► కోవిడ్–19 సంక్రమణ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన మరింత పెంచాలని సూచించారు. వీక్లీ కేస్ పాజిటివిటీ రేటు 10 శాతానికి మించితే, ఒకేసారి కార్యాలయానికి హాజరయ్యే ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు, సామాజిక దూరం పాటించేందుకు వీలుగా కార్యాలయ సమయాలను మార్చాలని రాష్ట్రాలకు, యూటీలను కేంద్రం ఆదేశించింది.
92 లక్షలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 92 లక్షలు దాటింది. 24 గంటల్లో 44,376 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. మంగళవారం వెలుగుచూసిన కేసుల కంటే బుధవారం 6,079 కేసులు ఎక్కువగా ఉండటం గమనార్హం. బుధవారం బయట పడిన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 92,22,216కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 481 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,34,699కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య బుధవారానికి 86,42,771కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 93.72 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,44,746గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 4.82 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.46గా ఉంది.
రాత్రిపూట కర్ఫ్యూ విధించొచ్చు
Published Thu, Nov 26 2020 3:59 AM | Last Updated on Thu, Nov 26 2020 9:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment