సాక్షి, న్యూఢిల్లీ : ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగితే వచ్చే ఏడాది జనవరి నాటికి భారత్‌లో సమర్ధవంతమైన కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా వెల్లడించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందనేది స్పష్టంగా చెప్పడం కష్టసాధ్యమేనని, మానవ పరీక్షల దశ దాటుకుని, ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కొనే సామర్థ్యం వ్యాక్సిన్‌కు ఉందని నిరూపణ కావడం వంటి పలు అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని అన్నారు. ముందుగా అనుకున్న ప్రకారం అంతా సవ్యంగా సాగితే వచ్చే ఏడాది ఆరంభంలోనే (జనవరి నాటికి) కోవిడ్-19 వ్యాక్సిన్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటుందని చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్ తొలి సరఫరాలు దేశంలో జనాభా అంతటికి సరిపడే డోసులు ప్రాథమికంగా అందుబాటులో ఉండవని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సిన్ సిద్ధం కాగానే, జనాభాకు అనుగుణంగా తయారీ, పెద్ద ఎత్తున పంపిణీ చేపట్టడం ప్రధాన సవాళ్లుగా ముందుకొస్తాయని అన్నారు.
భారత్‌లో వ్యాక్సిన్ పంపిణీపై ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభమయ్యాయని, వ్యాక్సిన్‌ను ప్రాథాన్యతా క్రమంలో ప్రజలకు అందించడం జరుగుతుందని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా చెప్పారు. కరోనా వైరస్ సోకే ముప్పు అధికంగా ఉన్నవారికి ముందుగా వ్యాక్సినేషన్ జరుగుతుందని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలతో పాటు వైరస్‌పై ముందుండి పోరాడే ఇతర కరోనా యోధులకు వ్యాక్సిన్ పంపిణీలో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. వైరస్ బారినపడి మరణించే అవకాశం అధికంగా ఉన్న గ్రూపులకు కూడా తొలుత వ్యాక్సిన్ ఇస్తారని చెప్పారు. ప్రాధాన్యతా జాబితాను రూపొందించి దానికి అనుగుణంగా వ్యవహరిస్తే వ్యాక్సిన్ పంపిణీ సమంగా సాగుతుందని అన్నారు. ప్రాధాన్యతా జాబితాను అనుసరించని పక్షంలో అది మరిన్ని మరణాలకు దారితీయడంతో పాటు వైరస్ వ్యాప్తి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా మాస్క్‌లు ధరించి భౌతిక దూరాన్ని పాటించడం వంటి కోవిడ్-19 నిబంధనలను పాటించి వ్యాధి వ్యాప్తిని తగ్గించేందుకు సహకరించాలని కోరారు. చదవండి : ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ కష్టం
Comments
Please login to add a commentAdd a comment