![Cow Vigilante Monu Manesar Wanted For Double Murder Arested - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/12/monu-manesar.jpg.webp?itok=UzsXA1_h)
వివాదాస్పద గోసంరక్షుడు, బజరంగ్‌దళ్ సభ్యుడు మోను మనేసర్‌ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని భివానీలో ఇద్దరు వ్యక్తుల హత్య, నూహ్‌లో అల్లర్లను ప్రేరేపించిన కేసులో మోను మనేసర్‌ను మంగళవారం సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనేసర్‌ను హర్యానా పోలీసులు రాజస్ధాన్ పోలీసులకు అప్పగించనున్నారు. కాగా గత ఫిబ్రవరిలో హర్యానాలో ఇద్దరు ముస్లింలను సజీవ దహనం చేసిన కేసులో మోనుపై కేసు నమోదైంది.
శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీపీ మమతా సింగ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా అభ్యంతరకరమైన పోస్టుపై మోనును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్ట్‌పై మోనూ వాంటెడ్‌గా ఉన్న ఇతర రాష్ట్రాల్లోని పోలీసులకు కూడా సమాచారం అందించామని పేర్కొన్నారు. రాజస్థాన్ పోలీసులు మోను మనేసర్‌ను కోర్టు ద్వారా కస్టడీలో తీసుకోవచ్చని తెలిపారు.
అసలెవరీ మోను మనేసర్
మోను మనేసర్ అలియాస్ మోహిత్ యాదవ్ బజరంగ్‌దళ్ సభ్యుడు. అంతేగాక గో సంరక్షుడు కూడా. ఇతరు గురుగ్రామ్‌లోని మనేసర్ ప్రాంతానికి చెందినవాడు. ముస్లిం వర్గానికి చెందిన ఇద్దరిని కారుతో సహా సజీవ దహనం చేసిన కేసులో మోను కీలక నిందితుడిగా ఉన్నాడు.
అదే విధంగా హర్యానాలోని నూహ్‌లో కొన్ని రోజులపాటు మతపరమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హిందువులు తలపెట్టిన ర్యాలీపై మరో వర్గం వారు రాళ్లు రువ్వడంతో రాష్ట్రంలో చెలరేగిన హింసలో ఓ కానిస్టేబుల్‌తో సహా ఆరుగురు చనిపోయారు.. అయితే ఈ యాత్రలో మానేసర్ పాల్గొన్నాడనే సమాచారంతోనే కొందరు దాడికి తెగబడ్డారు. వాహనాలను దగ్ధం చేశారు.
కాగా రాజస్థాన్ భరత్‌పూర్ జిల్లాలోని ఘట్మీకా గ్రామానికి చెందిన నసీర్, జునైద్‌లను ఫిబ్రవరి 15న గోసంరక్షకులు అపహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. మరుసటి రోజే హర్యానాలోని లోహారులో ఓ కారులో కాలిపోయిన స్థితిలో వారి మృతదేహాలు గుర్తించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. రాజస్థాన్ పోలీసులు ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసి మోను మనేసర్‌ను నిందితుడిగా చేర్చారు.
చదవండి: ‘భారత్ మండపం’ పరిస్థితి ఏమిటి? ఎవరైనా బుక్ చేసుకోవచ్చా?
Comments
Please login to add a commentAdd a comment