ఢిల్లీ: మహోగ్ర రూపంతో దూసుకొచ్చిన బిపర్‌జాయ్ తుపాన్ కోట్ లఖ్‌పత్ సమీపంలో గుజరాత్ తీరాన్ని తాకింది. ఈ ప్రభావంతో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో కూడిన భీకరమైన గాలులు, మరోవైపు కుండపోత వర్షంతో కురుస్తోంది. తీరం దాటే సమయానికి వాయు వేగం ఇంకా పెరగనుంది. గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి.
అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో బిపర్‌జోయ్ పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటాక తీవ్ర తుపానుగా.. ఆపై వాయుగుండంగా బలహీనపడుతుంది. ఆ సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే ఛాన్స్ ఉంది. గుజరాత్‌లోని సముద్ర తీరం వెంట ఉన్న 8 జిల్లాల అధికార యంత్రాంగం ఇప్పటికే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.
తుపాను తీరానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దూసుకొచ్చే ఈ తుపాను తీరాన్ని పూర్తిగా దాటడానికి ఆరు గంటల సమయం పడుతుంది అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మహోపాత్ర వివరించారు.
🌀 సౌరాష్ట్ర, కచ్ తీరాన్ని దాటుకుని జఖౌ పోర్ట్ వద్ద మాండ్వీ, కరాచీ(పాకిస్థాన్) వైపుగా మళ్లీ అక్కడ తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది.
🌀 తుపాను కేటగిరీ-3 ప్రకారం.. ఇది అత్యంత తీవ్రమైన తుపానుగా పరిగణించనున్నారు.
🌀 కచ్‌తో పాటు దేవ్‌భూమి ద్వారకా, జామ్నానగర్ జిల్లాల్లో ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. అంచనాకు తగ్గట్లే ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కచ్ జిల్లాలో 120 గ్రామాల ప్రజలను(తీరానికి పది కిలోమీటర్ల రేంజ్‌లో..) ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
🌀 తుపాన్‌పై గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌లో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. మొత్తం గుజరాత్ అరేబియా సముద్ర తీరం వెంట ఉన్న ఎనిమిది జిల్లాల నుంచి లక్ష మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
🌀 కేంద్రం నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ తరపున ఎనిమిది బృందాలు, రాష్ట్రం తరపున ఎస్టీఆర్‌ఎఫ్ బృందాలు 12, రోడ్లు భవనాల విభాగం నుంచి 115 బృందాలు, విద్యుత్ విభాగం నుంచి 397 బృందాలను తీరం వెంబడి జిల్లాల్లో మోహరింపజేశారు.
🌀 ఇక కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సైతం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటన చేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డు సిద్ధంగా ఉన్నాయి.
🌀 సరిగ్గా రెండేళ్ల తర్వాత గుజరాత్‌ను తాకబోయే తుపాను ఇది.
#CycloneBiparjoy
— TIMES NOW (@TimesNow) June 15, 2023
As the landfall process of Cyclone #Biparjoy commences, the shed of a petrol pump starts crumbling- WATCH.@rrakesh_pandey briefs about the destruction that has taken place on the ground. pic.twitter.com/pyS3nmXCy4
Video Credits: TIMES NOW
Comments
Please login to add a commentAdd a comment