సాక్షి, ఢిల్లీ: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురయింది. పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో స్టే ఇవ్వడానికి తగిన కారణాలు కనిపించలేదని హైకోర్టు పేర్కొంది.
"దొంగలందరి ఇంటిపేరు మోదీయే" అంటూ వ్యాఖ్యానించిన కేసులో తనకు శిక్ష నిలుపుదల చేయాలని రాహుల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష విధించగా, ఈ తీర్పును రాహుల్.. హైకోర్టులో సవాలు చేశారు. మే 2న విచారణ పూర్తి చేసిన గుజరాత్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది.
ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగానే ఉందన్న జడ్జి.. రాహుల్ పిటిషన్‌ను కొట్టేశారు. సావర్కర్‌ను కించపరిచారని ఆయన మనవడు వేసిన పిటిషన్‌ను ప్రస్తావించిన న్యాయస్థానం.. రాహుల్‌పై 10 పరువు నష్టం కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేసింది.
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ.. ‘దొంగలందరి ఇంటిపేరు మోదీయే’ ఎందుకంటూ.. ప్రశ్నించారు.
చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో రెండోసారి కూడా కాంగ్రెస్సేనా?.. ఆ సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది?
రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతం వ్యక్తం చేసిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం దావావేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ తన వాదనను వినిపించారు. విచారణ అనంతరం కోర్టు.. ఈ ఏడాది మార్చి 23న ఆయనను దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment