ఘటన ఎలా జరిగి ఉంటుందో వైద్యుల సమక్షంలో అంచనా వేస్తున్న అధికారి
ఢిల్లీ: సుల్తాన్‌పురి హిట్ అండ్ రన్ కేసు ఊహించని మలుపులు తీసుకుంటోంది. పోలీసుల దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెల్లడి అవుతోంది. ఘటన జరిగిన సమయంలో కారు ఉంది ఐదుగురు కాదని, కేవలం నలుగురే ఉన్నారని తాజాగా పోలీసులు ప్రకటించడం ఈ కేసును మలుపు తిప్పింది. అంతేకాదు.. ఈ కేసులో కారు నడిపింది దీపక్ ఖన్నా కాదని గురువారమే సంచలన ప్రకటన చేశారు పోలీసులు.
ఘటన జరిగిన సమయంలో కారు నడిపింది తనేనని దీపక్ ఖన్నా అనే వ్యక్తి పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో దీపక్‌తో పాటు కారులో ఉన్నారని చెబుతూ ముందుకొచ్చిన మనోజ్ మిట్టల్, అమిత్ ఖన్నా, కృషన్, మిథున్‌లను పోలీసులు నిందితులుగా చేర్చారు. అయితే.. దర్యాప్తులో వీళ్లను తప్పించేందుకు మరో ఇద్దరు యత్నించారని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించి.. వాళ్లను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. వాళ్లే కారు ఓనర్ అశుతోష్, మరో నిందితుడు అంకుశ్ ఖన్నా. అయితే..
అంకుశ్ ఖన్నా.. అమిత్ ఖన్నా సోదరుడు. ఘటన జరిగిన సమయంలో డ్రైవింగ్ సీట్‌లో ఉంది అమిత్ ఖన్నా. ఈ విషయాన్ని సోదరుడికి చెప్పాడు అమిత్. అమిత్ ఖన్నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. దీంతో సోదరుడికి ఏం జరగకూడదనే ఉద్దేశంతో కార్ ఓనర్ అశుతోష్‌ను కలిసి ఈ ప్రమాద ఘటన గురించి చర్చించాడు అంకుశ్. ఆపై ఎలాగోలా నేరం తనపైనే వేసుకునేలా దీపక్‌ను ఒప్పించారు.
కారు నడిపింది అమిత్ ఖన్నా అని, ఘటన జరిగిన సమయంలో అసలు దీపక్ కారులోనే లేడని, ఇంట్లో ఉన్నాడని పోలీసులు తాజాగా వెల్లడించారు. డబ్బు ఆశ చూపించడం వల్లనో, స్నేహితుడనే కారణంతోనో ఆ నేరం తనపై వేసుకునేందుకు దీపక్ ముందుకు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అశుతోష్‌ను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు అంకుశ్ ఖన్నా కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో స్కూటీపై వస్తున్న అంజలి సింగ్, నిధిలను కారుతో ఢీ కొట్టారు ఈ నిందితులు. నిధి పక్కకు పడిపోగా.. అంజలి కాలు కారు కింది భాగంలో ఇరుక్కుపోయింది. సాయం కోసం ఆమె అరుస్తుండగానే.. అదేం పట్టనట్లు ముందుకు వెళ్లిపోయారు కారులో ఉన్న వాళ్లు. అది చూసి భయంతో నిధి అక్కడి నుంచి జారుకుంది. అయితే కొద్ది దూరం వెళ్లాక అంజలి మోచేయి భాగం కనిపించిందని, అయినా మద్యం మత్తులో పట్టించుకోకుండా వాళ్లు ముందుకు వెళ్లిపోయారని తెలుస్తోంది. అలా గంట.. రెండు గంటల మధ్య సుల్తాన్‌పురి నుంచి 13 కిలోమీటర్ల పాటు ప్రయాణించి.. దారిలో యూటర్న్‌లు కొడుతూ.. కంఝావాలా వద్ద ఆమె మృతదేహాన్ని వదిలేసి వెళ్లిపోయారు. చివరికి కారును అశుతోష్‌కు అప్పగించి.. ఓ ఆటోలో కారులోని నలుగురు పారిపోయారు.
అంజలిని అలా ఈడ్చుకెళ్లే క్రమంలో ఆమె దుస్తులు చినిగిపోవడంతోపాటు తీవ్ర గాయాలై మరణించింది. శరీరంపై 40 గాయాలు అయ్యాయి. చర్మం ఒలుచుకుపోయి ఉంది. పక్కటెముకలు బయటకు పొడుచుకువచ్చాయి. తల పలిగి పుర్రె భాగం బయటకు వచ్చింది. సగం మెదడు ఎక్కడో పడిపోయింది అని శవ పరీక్షలో తేలింది. తల పగిలి, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడం, అవయవాలు దెబ్బ తినడంతో రక్తస్రావం జరిగి ఆమె మృతి చెందని పోస్ట్‌మార్టం నివేదికలో నిర్ధారణ అయ్యింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు అత్యాచారం జరగలేదని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment