
భారీ వర్షం లేకుండానే నాలుగు రోజులపాటు వరద గుప్పిట..
సాక్షి, ఢిల్లీ: నాలుగు రోజుల తర్వాత ఢిల్లీలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మొదలైన వర్షం.. గట్టిగానే దంచి కొడుతోంది. దీంతో.. ఇప్పడిప్పుడే బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న జనం మళ్లీ ఇంటి వైపు పరుగులు పెడుతున్నారు. ఈ పరిస్థితితో ఇప్పటికే వరద గుప్పిట ఉన్న ఢిల్లీ కోలుకునేందుకు ఇంకాస్త సమయం పట్టేదిగా కనిపిస్తోంది.
ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు.. పైగా యమునా నదీకి ఎగువ నుంచి వచ్చి చేరిన వరదతో దేశ రాజధాని ప్రాంతం నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓవైపు వర్షం ఆగిపోయినప్పటికీ.. అప్పటికే పోటెత్తిన వరద యమునా నదిని డేంజర్ జోన్‌కి నెట్టేసింది. దీంతో నదీ తీర ప్రాంతం నుంచి జనాల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది ఢిల్లీ ప్రభుత్వం. ఈలోపు నగరం కూడా నీట మునిగి.. మొత్తం జనజీవనంపై ప్రభావం పడింది. మునుపెన్నడూ చూడని దృశ్యాలకు హస్తిన వేదికైంది.
ఇక సహాయక చర్యల్లో భాగంగా రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ నడుం లోతు వరద నీటి నుంచి జనాలను, మూగ జీవాల్ని తరలిస్తూ వస్తోంది. ఈలోపు వరద క్రమంగా తగ్గుముఖం పడుతుండడం.. యమునా నదీ ఐదు సెంటీమీటర్ల ప్రవాహం తగ్గడంతో పరిస్థితి సాధారణం వైపు వెళ్తోందని అంతా ఆశించారు. కానీ, తాజాగా మళ్లీ వర్షం కురుస్తుండడంతో మళ్లీ నగర వాసుల్లో ఆందోళన పెరిగిపోతోంది. చాలావరకు వీధుల్లో ఇప్పటికీ నీరు అలాగే నిలిచి ఉండడం గమనార్హం. ఇంకోవైపు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది.
#WATCH | Rain lashes parts of national capital. Visuals from Raj Ghat. pic.twitter.com/aVDmlTlw39
— ANI (@ANI) July 15, 2023