సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో ఎల్లో మీడియాకు బిగ్ షాక్ తగిలింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ప్రసారం చేసిన కథనాలను వెంటనే తొలగించాలని తొమ్మిది మీడియా సంస్థల(ఈటీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ-5, మహాన్యూస్, ఆర్ టీవీ సహా మరో నాలుగు ఛానెల్స్)ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఎల్లో మీడియాపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా, ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పరువుకు భంగం కలిగించినందుకు రూ.10 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని విజయసాయిరెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
ఇక, విచారణ సందర్బంగా.. ఎంపీ విజయసాయిరెడ్డి పరువుకు భంగం కలిగించే విధంగా తొమ్మిది మీడియా సంస్థలు(ఈటీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ-5, మహాన్యూస్, ఆర్ టీవీ సహా మరో నాలుగు ఛానెల్స్) వ్యవహరించాయి. వదంతుల ఆధారంగా తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. ఆయన ప్రతిష్టకు, రాజకీయ భవిష్యత్‌కు భంగం కలిగే విధంగా మీడియాలో తప్పుడు ప్రసారాలు అందించారు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా ప్రసారం చేసిన కథనాలను, వీడియోలను వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న కథనాలన్నింటినీ వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు కథనాలను ప్రజలకు అందించవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment