న్యూఢిల్లీ: కరోనా పేషెంట్ల చికిత్స కోసం ఢిల్లీకి ప్రతీరోజు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయాలన్న ఆదేశాలను బేఖాతరు చేయడంపై ఢిల్లీ హైకోర్టు కేంద్రంపై మండిపడింది. కేంద్రం తీరును ఎందుకు కోర్టు ధిక్కరణగా భావించకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘ఉష్ట్రపక్షిలా మీరు ఇసుకలో తలదూర్చగలరేమో కానీ మేమలా చేయలేమ’ని వ్యాఖ్యానించింది. ‘ఢిల్లీకి ప్రతీరోజు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించింది. మేం కూడా ఆదేశించాం. మీరు కూడా ఇక్కడే ఉంటున్నారు. పరిస్థితిని చూస్తున్నారు. అయినా స్పందన లేదు’ అని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖల ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీకి 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం లేదన్న కేంద్రం వాదనను తోసిపుచ్చింది. ‘రోగులకు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లభించడం లేదు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది’అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ‘ మేం ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడాన్ని ఎందుకు కోర్టు ధిక్కరణగా భావించకూడదో వివరణ ఇవ్వాలి’అని పేర్కొంది. మా నోటీసులకు జవాబును బుధవారం స్వయంగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి సుమిత దావ్రా ఇవ్వాలని స్పష్టం చేసింది.
చదవండి: పాజిటివ్ రాకున్నా, లక్షణాలుంటే ఆసుపత్రుల్లో చేర్చాలి
Comments
Please login to add a commentAdd a comment