సాక్షి, ఢిల్లీ: లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మళ్లీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో మరో ఆప్ కీలక నేత ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ స్కామ్‌కు సంబంధించి పలువురు అప్రూవర్‌లుగా మారారనే కథనాల నడుమ.. తాజా సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఎన్నికల్లో ఆప్ కోసం లిక్కర్ స్కామ్ డబ్బుల్నే ఉపయోగించారన్న అభియోగాలపై ఈడీ ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
ఆప్ ఎంపీ(రాజ్యసభ) సంజయ్ సింగ్‌కు చెందిన నార్త్ అవెన్యూ నివాసంలో బుధవారం ఉదయం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొదటి నుంచి ఈయన ఈడీ నజర్‌లో ఉన్నప్పటికీ.. ఇప్పుడు నేరుగా నివాసాల్లో తనిఖీల దాకా వెళ్లడం గమనార్హం. ఆయన ఇంట్లో కీలక పత్రాల కోసం ఈడీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ కేసులో ఢిల్లీ వ్యాపారవేత్త దినేష్ అరోరా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. దినేష్‌ను సంజయ్ సింగ్ దగ్గరుండి మాజీ మంత్రి మనీశ్‌సిసోడియాకు కలిపించాడని ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది. అంతేకాదు.. లిక్కర్ డిపార్ట్‌మెంట్‌తో దినేష్ అరోరాకు ఉన్న దీర్ఘకాలిక సమస్యను ఎంపీ సంజయ్ సింగ్ పరిష్కరించారని కూడా ఆరోపించింది. అయితే లిక్కర్ స్కామ్ కేసులో.. సంజయ్ సింగ్ పేరును మాత్రం నిందితుల జాబితాలో ఈడీ చేర్చలేదు. అయితే ఛార్జిషీట్‌లో పేరు చేర్చినప్పటికీ.. ఇప్పటిదాకా సమన్లు జారీ చేయడం గానీ, ఆయన స్టేట్‌మెంట్‌నుగానీ రికార్డు చేయలేదు.
మనీశ్ సిసోడియా తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థ.. మరో ఆప్ నేత సంజయ్ సింగ్‌పై ఫోకస్ సారించింది. ఇదిలా ఉంటే.. మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌సిసోడియాను ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణకు పిలిచి.. అటు నుంచి అటే అరెస్ట్ చేసింది సీఐబీ. అంతేకాదు ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను తొమ్మిది గంటలపాటు ప్రశ్నించింది కేంద్ర దర్యాప్తు సంస్థ.
Comments
Please login to add a commentAdd a comment