సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తాజాగా.. కేసీఆర్ తనయ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సమన్లు జారీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ).
విచారణకై ఢిల్లీకి రావాలంటూ ఈడీ, ఎమ్మెల్సీ కవితకు పంపిన నోటీసుల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. మంగళవారం హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాను కవితకు బినామీనంటూ పిళ్లై ఒప్పుకున్నారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో పిళ్లై రిమాండ్ రిపోర్ట్‌లోనూ కవిత పేరును ఈడీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో.. ఆమెను ప్రశ్నించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న పిళ్లైతో కలిపి ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది. లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ కూడా డిసెంబర్‌లో.. ఆమె ఇంటికి వెళ్లి దాదాపు ఏడు గంటలు ప్రశ్నించిన విషయం తెలిసిందే. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటివరకు పదకొండు మంది అరెస్ట్ అయ్యారు.
మంగళవారం పిళ్ళైను వారం ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. ఈ నెల 13వ తేదీ వరకు పిళ్లై, ఈడీ కస్టడీలోనే ఉండనున్నాడు. అలాగే.. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుతో కలిపి పిళ్ళై ను విచారిస్తామని కోర్టుకు తెలిపింది ఈడీ. సౌత్ గ్రూప్ - ఆప్ కు మధ్య లింక్ గురించి ఈ ఇద్దరితో పాటు కల్వకుంట్ల కవితను కలిపి ఒకేసారి విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు ఆప్ కు చేరవేయడంలో అరుణ్ రామచంద్ర పిళ్లై కీలక పాత్ర పోషించాడని, ఆయన కవితకు బినామీ అని ఈడీ చెబుతోంది. ఈ మేరకు నిందితుల స్టేట్‌మెంట్లు బలం చేకూరుస్తున్నాయని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసిన ఈడీ. అంతేకాదు.. ఈ సంబధం ద్వారా వ్యాపారాన్ని మరిన్ని రాష్ట్రాలకు విస్తరిద్దామని కవిత ప్రతిపాదించారని కూడా దర్యాప్తు ఏజెన్సీ చెబుతోంది.
మరోవైపు ఈ నెల 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద.. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం జాగృతి ఆధ్వర్యంలో దీక్ష చేపట్టాలని కవిత ఏర్పాట్లు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment