సాక్షి, న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ భవనం మరోసారి రణరంగాన్ని తలపించింది. మంగళవారం మేయర్ పదవి కోసం ఎన్నిక జరగాల్సి ఉండగా.. బీజేపీ-ఆప్ కౌన్సిలర్లు మరోసారి రచ్చ చేశారు. పోటాపోటీగా నినాదాలు చేయడంతో హౌజ్ గందరగోళంగా మారింది. ఈ తరుణంలో హౌజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ ప్రకటించారు.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. ఫలితాలు వెలువడి నెల గడుస్తున్నా ఇంకా మేయర్‌ను ఎన్నుకోలేదు. జనవరి 6వ తేదీన మేయర్ ఎన్నిక జరగాల్సి ఉండగా.. ఆ టైంలో ‘ఎన్నికల్లో ఓడినా కూడా తమ అభ్యర్థుల్ని ప్రలోభ పెట్టి మేయర్ పదవి దక్కించుకోవాలని బీజేపీ చూస్తోంద’’ని ఆప్ ఆరోపించింది. ఈ మేరకు ఆప్-బీజేపీ పోటాపోటీ నినాదాలు, తోపులాటతో గందరగోళనం నెలకొని అప్పుడు ఎన్నిక వాయిదా పడింది.
అయితే.. మంగళవారం ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేశారు. మరోసారి అలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఎంసీడీ భవనం వద్ద భారీ భద్రతను, హౌజ్‌లో మార్షల్స్‌ను ఏర్పాటు చేశారు. తొలుత లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన కౌన్సిలర్లతో హడావిడిగా ప్రమాణం చేయించారు ప్రిసైడింగ్ ఆఫీసర్. ఆపై పదిహేను నిమిషాలు హౌజ్‌ను వాయిదా చేశారు. తిరిగి ప్రారంభమైన సమయంలో.. ‘మోదీ.. మోదీ’అంటూ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు వ్యతిరేక నినాదాలతో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు బీజేపీ కౌన్సిలర్లు. ఆపై నేరుగా ఆప్ కౌన్సిలర్ల దగ్గరికి వెళ్లి.. బిగ్గరగా నినాదాలు చేస్తూనే హౌజ్‌ను వాయిదా వేయాలంటూ ప్రిసైడింగ్ ఆఫీసర్‌ను కోరారు. ఈ తరుణంలో..
ప్రతిగా ‘‘షేమ్.. షేమ్’’ నినాదాలతో హోరెత్తించారు ఆప్ కౌన్సిలర్లు. గెలుపు కోసం నామినేటెడ్ కౌన్సిలర్లను ఓటింగ్‌లో పాల్గొనేలా చూస్తున్నారంటూ బీజేపీని ఎద్దేశా చేశారు. అదే సమయంలో నామినేటెడ్ మెంబర్లు ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేశారు. ఒకానొక తరుణంలో ఇరు పార్టీల కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో హౌజ్‌ను నడపడం కష్టమంటూ వాయిదా వేశారు ప్రిసైడింగ్ అధికారి సత్య శర్మ.
#DelhiMayoralPolls | Presiding officer Satya Sharma said house proceedings cannot be conducted amid sloganeering from both AAP and BJP councillors#DelhiMayorElection pic.twitter.com/qmR2wVSbXV
— Hindustan Times (@htTweets) January 24, 2023
ఢిల్లీ మేయర్‌ను ఎన్నికల్లో నెగ్గిన మున్సిపల్ కౌన్సిలర్లు, ఎల్జీ నామినేట్ చేసే కౌన్సిలర్లతో పాటు ఢిల్లీ పరిధిలోని ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, వీళ్లతో పాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేసే 14 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. తొలి దఫాలో.. ఏ పార్టీ అయినా సరే మహిళా అభ్యర్థికే ఢిల్లీకి మేయర్ పీఠం కట్టబెడుతారు.
పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. 250 స్థానాలు ఉన్న ఎంసీడీలో.. 134 ఆప్, బీజేపీ 104 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ 9 స్థానాలు మాత్రమే సరిపెట్టుకుంది. తొలుత ఓటమి కారణంతో మేయర్ పదవికి పోటీ చేయమని బీజేపీ ప్రకటించింది. తదనంతర పరిణామాలతో ఎందుకనో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ పోటీలోకి దిగుతున్నట్లు అభ్యర్థిని నిలిపింది.
ఢిల్లీ మేయర్ పదవి.. ఐదేళ్లలో ఏడాది చొప్పున మారుతుంటుంది. మొదటి ఏడాది మహిళలకు రిజర్వ్ చేశారు. రెండో ఏడాది ఓపెన్ కేటగిరీ కింద అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మూడో ఏడాదిలో రిజర్వ్డ్ కేటగిరీ కింద, ఆ తర్వాత రెండేళ్లకు ఓపెన్ కేటగిరీ కింద మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment