న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా దేశ రాజధానిలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. బెడ్ల కొరతతో ప్రజుల తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీవ్రంగా కృషి చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరో శుభవార్త చెప్పారు. నేడు ఢిల్లీలో అత్యంత తక్కువ కరోనా మరణాలు నమోదయినట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కరోనా విజృంభణ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఢిల్లీలో నమోదైన అతి తక్కువ మరణాల సంఖ్య ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ‘ఈ రోజు ఢిల్లీలో అత్యల్పంగా ఎనిమిది కరోనా మరణాలే నమోదయ్యాయి. చాలా రోజుల తర్వాత నేడు 10 కన్నా తక్కువ కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా మరణాల సంఖ్యను తగ్గించడం కోసం మేం చాలా చర్యలు చేపట్టాం. ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాకుండా చేయాలనేది మా లక్ష్యం. ప్రతి ప్రాణం, మనిషి మాకు విలువైనదే’ అంటూ ట్వీట్ చేశారు కేజ్రీవాల్. (కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం)
ఢిల్లీ ప్రభుత్వ హెల్త్ బులిటెన్ ప్రకారం రెండు నెలల్లో కరోనా మరణాల సంఖ్య 10 కన్నా తక్కువ నమోదు కావడం ఇదే మొదటిసారి అని తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 1257 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,47,391కి చేరింది. వీరిలో 1,32,384 మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగతా వారిలో 5523 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment