
సాక్షి, న్యూఢిల్లీ: రాజధానిలో కరోనా పరిస్థితులు మెరుగుపడ్డాయనే పూర్తి నమ్మకం వచ్చేంతవరకు పాఠశాలలను తిరిగి తెరిచేది లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ సచివాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరంగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఛత్రసల్ స్టేడియంలో జరగాల్సిన ఆగస్ట్ 15 వేడుకలను కరోనా కారణంగా సచివాలయంలో జరపాల్సి వచ్చిందని చెప్పారు. రెండు నెలల క్రితంతో పోలీస్తే ప్రస్తుతం రాజధానిలో మహమ్మారి తీవ్రత తగ్గిందన్నారు. కరోనాపై పోరాడేందుకు అత్యవసర విభాగంలో పనిచేసిన కరోనా యోధులకు(పోలీసులు, డాక్టర్లు, ఇతరులు) ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: కరోనా: భారత్‌లో 48 వేలు దాటిన మరణాలు)
అలాగే ఈ మహమ్మారి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయన్న నమ్మకం కలిగిన తర్వాతే పాఠశాలలను పున:ప్రారంభించేందుకు అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే తమ ప్రభుత్వానికి పిల్లల ఆరోగ్యం చాలా ముఖ్యమన్నారు. అదే విధంగా పాఠశాలలను తిరిగి తెరవొద్దని కోరుతూ ప్రజల నుండి తనకు సందేశాలు కూడా వస్తున్నాయని చెప్పారు. హోం ఐసోలేషన్, ప్లాస్మా థెరపీతో కరోనాపై ఎలా పోరాడాలో ఇతర రాష్ట్రాలకు ఢిల్లీ స్ఫూర్తి నిలిచిందన్నారు. అదే విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా తిరగి గాడిలో పెట్టే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment