సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలోకి కార్యకర్తలెవ్వరూ ప్రవేశించరాదని ఎడపాడి పళనిస్వామి మద్దతుదారులు ఆదివారం ఆకస్మిక ఉత్తర్వులు జారీ చేశారు. కార్యాలయ ప్రవేశంపై కోర్టు విధించిన గడువు శనివారం ముగియడంతో ఈ మేరకు తమ పట్టు నిలుపుకునేందుకు అప్రమత్తం అయ్యారు.
గతనెల 11వ తేదీన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం జరగడం, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి ఎంపిక కావడంతో రెచ్చిపోయిన పన్నీర్‌సెల్వం వర్గీయులు పార్టీ ప్రధాన కార్యాలయం ప్రధాన ద్వారం తలుపు బద్దలు కొట్టి మరీ ప్రవేశించారని ఎడపాడి వర్గం ఆరోపిస్తోంది. పైగా లోపలున్న ఫర్నీచర్, ఫైళ్లు, డాక్యుమెంట్లు, కంప్యూటర్లు ధ్వంసం చేశారని చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్యాలయానికి సీలు వేయగా, సీలు తొలగించి పార్టీ కార్యాలయం తాళాలను ఎడపాడికి అప్పగించాలని కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. అయితే, పార్టీ శ్రేణులెవ్వరూ ఆగస్టు 20వ తేదీ వరకు కార్యాలయంలోకి ప్రవేశించరాదని కోర్టు అదేరోజు ఆదేశించింది.
ఇదిలా ఉండగా, ఎడపాడి నిర్వహించిన సర్వసభ్య సమావేశం చెల్లదని, అంతకు ముందున్న పరిస్థితులు కొనసాగాలని ఇటీవల కోర్టు తీర్పు చెప్పడంతో పార్టీలో పన్నీర్‌సెల్వానిదే పైచేయిగా మారింది. పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ హోదా మళ్లీ తన చేతికి వచ్చినా, కార్యాలయ తాళాలు మాత్రం ఇంకా ఎడపాడి చేతుల్లోనే ఉన్నాయి. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం కార్యకర్తల కార్యాలయ ప్రవేశ నిషేధం ఈనెల 20వ తేదీతో ముగిసింది.
అయితే, కోర్టు తాజా తీర్పుతో పన్నీర్‌సెల్వం వర్గం మళ్లీ పార్టీ కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశిస్తే గతనెల 11వ తేదీన జరిగిన దుస్సంఘటనకు సంబంధించిన ఆనవాళ్లు రూపుమాపే అవకాశం ఉంటుందని ఎడపాడి వర్గం అనుమానిస్తోంది. దీంతో కార్యాలయంలోకి పార్టీ శ్రేణులు ఎవ్వరూ వెళ్లరాదని ఎడపాడి వర్గం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఈ ఆదేశాలను పన్నీర్ వర్గం ఖాతరు చేస్తుందా..? అనే కొత్త అనుమానాలు తలెత్తాయి. కోర్టు విధించిన నిషేధం గడువు ముగిసిపోయిన దశలో అదనపు పోలీసు బందోబస్తు మధ్య కార్యాలయం బోసిపోయి దర్శనమిస్తుండడం గమనార్హం.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో ఊహించని షాక్.. నడిరోడ్డుమీదే తన్నుకున్న నేతలు
Comments
Please login to add a commentAdd a comment