ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు, డిప్యూటీ సీఎం పదవి చేపట్టటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్. పదవి అనేది రాజకీయ సామర్థ్యాన్ని నిర్ధారించదని పేర్కొన్నారు. శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పినప్పుటికీ అధికారం ఫడ్నవీస్ చేతిలోనే ఉందనే వాదనలు వినిపిస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేయటం మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. మరోవైపు.. ఆయన చేతిలోనే ఆరు పోర్ట్‌ఫోలియోలు ఉండటమూ గమనార్హం. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టకపోవటంపై మాట్లాడారు.
ప్రస్తుత ప్రభుత్వంలో పలు పోర్ట్ఫోలియోలు నిర్వహించటంపై ప్రశ్నించగా.. గతంలో ముఖ్యమంత్రిగా ఆ బాధ్యతలు నిర్వర్తించినట్లు గుర్తు చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. ‘మంత్రివర్గ విస్తరణ పెండింగ్‌లో ఉన్నందున ఆ శాఖలు నా అధీనంలోనే ఉన్నాయి. విస్తరణ తర్వాత అందులో కొన్ని ఇతరుల చేతికి వెళ్తాయి. తమ ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలు ఎవరికైనా ఇవ్వొచ్చు. వారిని ఆ బాధ్యతల్లో విజయవంతం చేయటమే మా బాధ్యతగా విశ్వసిస్తాం. పోర్ట్‌ఫోలియో ఏదనేది పట్టింపులు లేవు.. సుపరిపాలన అందించటమనేదానిపైనే సమష్టి కృషి ఉంటుంది. రాజకీయంలో పోస్టును బట్టి శక్తిసామర్థ్యాలు నిర్ణయం కావు, నీవు ఎవరనేదే ముఖ్యం. నేను రాజకీయంగా బలపడ్డానా లేదా నష్టపోయానా? అనే అంశాన్ని మహారాష్ట్రలోని ఎవరినైనా అడగవచ్చు.’ అని పేర్కొన్నారు దేవేంద్ర ఫడ్నవీస్.
థాక్రే వెన్నుపోటుకు ప్రతీకారం..
మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయి.. బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపైనా స్పందించారు దేవేంద్ర ఫడ్నవీస్. శివసేన నేత ఉద్ధవ్ థాక్రే బీజేపీకి వెన్నుపోటు పొడిచారని, అందుకే కాషాయ పార్టీ ప్రతీకారం తీర్చుకోవాలనుకుందని అసలు విషయం వెల్లడించారు. ముందుగా ప్రభుత్వంలో ప్రాతినిథ్యం వహించకూడదని నిర్ణయించుకున్నానని, అయితే, వెలుపల ఉండి ప్రభుత్వాన్ని నడిపించలేమని, నా అనుభవం అవసరమని పార్టీ నేతలు ఒప్పించినట్లు చెప్పారు. వారి కోరిక మేరకే ప్రభుత్వంలో భాగమయ్యాయని వెల్లడించారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉండాలని బీజేపీ సూచించినప్పుడు షాక్‌కి గురయ్యానని, అయితే, తనను ఎప్పుడూ డిప్యూటీ అనే ఆలోచన రాకుండా షిండే చూసుకుంటున్నారని ప్రశంసించారు.
ఇదీ చదవండి: ఢిల్లీలో డీజిల్ కార్లపై నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.20వేల జరిమానా
Comments
Please login to add a commentAdd a comment