న్యూఢిల్లీ: రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై వ్యతిరేకత, పౌరసత్వ సవరణ చట్టం, వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓట్లు తెస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, కేరళను మినహాయిస్తే మిగతా రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతోంది. పశ్చిమబెంగాల్‌లో కొత్తగా ఏర్పడిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌తో కాంగ్రెస్– వామపక్షాల కూటమి సీట్ల పంపకాల చర్చలు కొనసాగుతున్నాయి. అస్సాంలోనూ బద్రుద్దీన్ అజ్మల్‌కు చెందిన ఏఐడీయూఎఫ్‌తో కాంగ్రెస్‌కు ఇంకా ఒప్పందం కుదరలేదు. తమిళనాడులో ప్రధాన పక్షం డీఎంకేపైనే కాంగ్రెస్ ఆధారపడి ఉంది. 50 స్థానాలు కావాలని కాంగ్రెస్ డీఎంకేను డిమాండ్ చేస్తోంది. అయితే, అందుకు డీఎంకే సిద్ధంగా లేదు. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలను, 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరును డీఎంకే గుర్తు చేస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి.
2016లో 41 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ 8 చోట్లే గెలుపొందింది. పుదుచ్చేరిలో తాజా సంక్షోభం కారణంగా కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడింది. ప్రస్తుత ఎన్నికల్లో కనీసం ఒక్క రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ గెలుపొందడం అవసరమని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జమ్మూలో శనివారం సమావేశమైన అసమ్మతి నేతలు పార్టీ బలహీన పడుతోందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, కేరళ, తమిళనాడుల్లో మిత్రపక్షాలతో కలిసి గెలిచే అవకాశముందని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అస్సాంలోనూ గెలుపునకు అవకాశాలున్నాయని, అయితే, తరుణ్ గొగోయి వంటి సీనియర్ నేత లేకపోవడం లోటుగా మారిందని భావిస్తున్నారు. బెంగాల్‌లో ప్రధానంగా టీఎంసీ, బీజేపీ మధ్యనే పోరు ఉంటుందని విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్– లెఫ్ట్ కూటమికి ఆశలు లేవని విశ్లేషిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ కూటమి కేవలం 15% ఓట్లు సాధించింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రారంభించగా, నేటి నుంచి ఆయన సోదరి ప్రియాంక ప్రచారంలో పాలుపంచుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment