బెంగళూరు : తెలంగాణ,మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఈ విషయమై ఆయన మాట్లాడారు. తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో గెలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్టులకు తరలించే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరూ కొనలేరని వారంతా పార్టీకి విధేయులని తెలిపారు.
సాధారణంగా ఎగ్జిట్ పోల్స్‌ను తాను నమ్మనని, తాను సొంత పోస్ట్ పోల్ సర్వేలు చేయిస్తానని డీకే చెప్పారు. తన సొంత సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌కు పెద్ద వేవ్ ఉందన్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పవర్‌లోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలకు టచ్‌లోకి వచ్చారని చెప్పారు. అయితే కాంగ్రెస్ నేతలను కేసీఆర్ లాక్కోవడం ఈసారి కుదరదని తేల్చిచెప్పారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి డీకే శివకుమార్ ముఖ్య కారణమన్న విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ హై కమాండ్ డీకేకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను కూడా పరోక్షంగా అప్పగించింది. దీంతో ఆయన ఇటీవలే ముగిసిన తెలంగాణ ఎన్నికలపై ఎక్కువే ఫోకస్ చేశారు. తెలంగాణకు వచ్చి చాలా చోట్ల ప్రచారం కూడా చేశారు. తెలంగాణలో గెలిచే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు బెంగళూరు తరలిస్తారన్న ప్రచారం ఇప్పటికే జోరందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment