![Doctor Operates on MP Woman to Remove Tumour From Brain It Turns White Fungus - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2021/06/17/surgery.jpg.webp?itok=aOq44wLY)
ప్రతీకాత్మక చిత్రం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ విభిన్నమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ మెదడులో కణితి ఉందని భావించిన వైద్యులు ఆపరేషన్ తీసి దాన్ని తొలగించారు. తీరా చూస్తే అది కాస్త వైట్ ఫంగస్‌గా తేలింది. దాంతో వైద్యులు ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన కలా బాయ్ కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమెకు తన శరీరం కుడి భాగం విపరీతంగా లాగడం ప్రారంభించింది. దాంతో మరోసారి ఆస్పత్రికి వెళ్లింది.
వైద్యులు ఆమెకు ఎంఆర్‌ఐ స్కాన్ చేసి.. మెదడులో కణితి ఏర్పడినట్లు గుర్తించారు. ప్రాణాంతక కణితిని వెంటనే తొలగించాలని సూచించారు. వెంటనే ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత కణితికి బయాప్సి నిర్వహించగా షాకింగ్ విషయం తెలిసింది. వైద్యులు భావించినట్లు అది కణితి కాదు.. వైట్ ఫంగస్ అని తేలింది.
ఈ సందర్భంగా కలా బాయ్‌కు ఆపరేషన్ చేసిన వైద్యులు మాట్లాడుతూ.. ‘‘ఎంఆర్‌ఐ స్కాన్‌లో ఫంగస్ కణితిలానే కనిపించింది. పైగా కణితి ఏర్పడినప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో కలా బాయ్‌లో అవే లక్షణాలు కనిపించాయి. ఆమె అదృష్టం బాగుండి ఫంగస్ మిగతా భాగాలకు చేరేలోపే దాన్ని తొలగించగలిగాము. ప్రస్తుతం ఆమె కోలుకుంటుంది. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తాం’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment