కశ్మీర్: ఉమ్మడి ఉగ్రవాద నిరోధక చర్యల సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లో ఓ ఉగ్రవాది.. భద్రతా దళాల ముందు లొంగిపోయినట్లు ఆర్మీ శుక్రవారం తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింది. సరెండర్ సందర్భంగా అధికారులు అతని నుంచి ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోలో ఒక సైనికుడు, పోరాట భద్రతా సామగ్రిని ధరించి, చేతిలో రైఫిల్ పట్టుకుని ఉన్నాడు. ఇక లొంగిపోయిన వ్యక్తిని జహంగీర్ భట్‌గా గుర్తించారు. ఈ సంఘటన ఓ తోటలో జరిగింది. కేవలం ప్యాంట్ మాత్రమే ధరించిన ఉగ్రవాది చేతులు పైకి లేపి, సైనికుడిని సమీపించడం వీడియోలో చూడవచ్చు. ఈ సందర్భంగా సైనికుడు అతడికి ఎటువంటి హాని జరగదని భరోసా ఇస్తాడు. "కోయి గోలి నహీ చలేగా" (ఎవరూ కాల్పులు జరపవద్దు) అని అతను తన సహచరులకు చెప్పడం వీడియోలో చూడవచ్చు. అనంతరం ఉగ్రవాదిని ఉద్దేశించి ‘కుమారా నీకు ఏమీ జరగదు’ అని చెప్తాడు. అంతేకాక అతడికి మంచినీళ్లు ఇవ్వండి అని మరో సైనికుడిని ఆదేశిస్తాడు. (చదవండి: బీజేపీ సర్పంచ్‌ను కాల్చి చంపారు)
ఆర్మీ విడుదల చేసిన మరో వీడియో క్లిప్‌లో.. ఉగ్రవాది తండ్రి తన కొడుకును కాపాడినందుకు భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలపడం చూడవచ్చు. ఆ సమయంలో సిబ్బంది "అతన్ని మళ్ళీ ఉగ్రవాదులతో వెళ్లనివ్వవద్దు" అని జహంగీర్ తండ్రికి సూచిస్తారు. ఈ సందర్భంగా జీఓసీ 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు మాట్లాడుతూ.. భద్రతా సిబ్బంది అతడిని సజీవంగా తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది అని అన్నారు. "అక్టోబర్ 13 న, ఒక ఎస్‌పీఓ (స్పెషల్ పోలీస్ ఆఫీసర్) మరణించారు. అతడి వద్ద ఉన్న రెండు ఏకే -47 (రైఫిల్స్) తో కనిపించకుండా పోయాయి. అదే రోజు, చాదూరాకు చెందిన జహంగీర్ భట్ తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు అతడి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం జరిపిన ఉమ్మడి ఆపరేషన్‌లో అతడిని గుర్తించాము. ప్రోటోకాల్ ప్రకారం, భారత సైన్యం వ్యక్తిని లొంగిపోయేలా ఒప్పించే ప్రయత్నాలు చేసింది. జహంగీర్ లొంగిపోయాడు" అని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: పాక్ ఉగ్రవాదులపై దొరబాబు వీరత్వం)
"జహంగీర్‌ని కార్నర్ చేసినప్పుడు అతని తండ్రి అక్కడే ఉన్నాడు. భద్రతా దళాలు, అతడి తండ్రి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అతడిని ప్రమాదం నుంచి కాపాడాము. భారత సైన్యం ఉగ్రవాద నియామకాలను నిరోధించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. యువత ఉగ్రవాదంలో చేరినట్లయితే, వారు తిరిగి రావడానికి అవకాశం కల్పిస్తున్నాం’ అని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment