సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఊహాగానాలకు ఎన్నికల కమిషన్ తెరదించింది. ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగిసేలోగానే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. నవంబర్ 29లోగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా శుక్రవారం ఓ జాతీయ వార్తాఛానెల్‌తో మాట్లాడుతూ పేర్కొన్నారు. అదే సమయంలో ఓ లోక్‌సభ స్ధానంతో పాటు 64 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.ఈ ఏడాది ఆరంభంలో జరగాల్సిన ఉప ఎన్నికలు కోవిడ్-19 వ్యాప్తితో వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని అదనంగా ఈవీఎంలు, వీవీప్యాట్‌లు బిహార్‌కు తరలిస్తామని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర, జిల్లా స్ధాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని సీఈసీ అరోరా తెలిపారు. ఓటర్ల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల ప్రక్రియకు మార్గదర్శకాలకు అనుగుణంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల నిర్వహణ కోసం గత నెలలో ఈసీ నిర్ధష్ట మార్గదర్శక సూత్రాలను (ఎస్‌ఓపీ) జారీ చేసిన సంగతి తెలిసిందే. ఓటర్లు, ఎన్నికల సిబ్బంది ఫేస్ మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటించాలని ఈసీ పేర్కొంది. క్వారంటైన్‌లో ఉన్న కోవిడ్-19 రోగులను పోలింగ్ ముగిసే చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతిస్తామని ఈసీ ఈ మార్గదర్శకాల్లో వెల్లడించింది. చదవండి : బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం!
Comments
Please login to add a commentAdd a comment