ముంబై: మహారాష్ట్రలోని గుజరాత్, రాజస్థాన్ ప్రజలను ఉద్ధేశిస్తూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలు రాజకీయపరంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. గవర్నర్‌పై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సహా ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ మాటలు మరాఠీలను అవమానపరచేలా, హిందువులను విభజించేలా ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు.
కోశ్యారీ వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ఆయన మాటలతో ఏకీభవించమని షిండే స్పష్టం చేశారు. ‘కోశ్యారీ వ్యాఖ్యలతో ఏకీభవించం. అది అతని వ్యక్తిగత అభిప్రాయం. అతను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. ఇతరులను అవమానపరిచేలా మాట్లాడకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ముంబైవాసులను మేము ఎప్పుడూ మర్చిపోము. ముంబై అభివృద్ధి కోసం మరాఠీ ప్రజలు ఎంతో కృషి చేశారు. ముంబై ఎంతో ప్రాముఖ్యత కలిగిన ముఖ్యమైన నగరం. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రజలు ముంబైని సొంత ఇంటిగా భావిస్తున్నప్పటికీ మరాఠీ ప్రజలు తమ గుర్తింపు, గౌరవాన్ని కాపాడుకున్నారు. వారిని అవమానించకూడదు’ అని అన్నారు.
చదవండి: హిందువులను విభజించాలని చూస్తున్నారు: ఉద్ధవ్ థాక్రే
ఇదిలా ఉండగా శుక్రవారం మహారాష్ట్ర గవర్నర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను పంపిస్తే ముఖ్యంగా పుణె, ముంబై వంటి ప్రాంతాల్లో డబ్బే ఉండదనిని వ్యాఖ్యానించారు. దేశానికి ముంబై ఆర్థిక రాజధానిగా కొనసాగలేదని అన్నారు. ఇక గవర్నర్ వ్యాఖ్యలపై శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే సైతం స్పందిస్తూ.. మరాఠీ బిడ్డలను అవమానించేలా భగత్ సింగ్ కోశ్యారి మాట్లాడారని మండిపడ్డారు. ఆయనను ఇంటికి పంపుతారో లేక జైలుకు పంపుతారో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment