జూన్‌ 25 సంవిధాన్‌ హత్యా దివస్‌.. కేంద్రం సంచలన ప్రకటన | Emergency Day June 25 To Be Observed As Samvidhaan Hatya Diwas, More Details Inside | Sakshi
Sakshi News home page

జూన్‌ 25 సంవిధాన్‌ హత్యా దివస్‌.. కేంద్రం సంచలన ప్రకటన

Published Fri, Jul 12 2024 4:46 PM | Last Updated on Fri, Jul 12 2024 7:14 PM

Emergency Day June 25 To Be Observed As Samvidhaan Hatya Diwas

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి ఏడాది జూన్‌ 25వ తేదీని సంవిధాన్‌ హత్యా దివస్‌(రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజు)గా జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తన ఎక్స్‌ ద్వారా ప్రకటన చేశారు.

1975లో ఆ తేదీన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా  ఎమర్జెన్సీ విధించారు. ఆ రోజులకు నిరసనగా ఇక నుంచి సంవిధాన్‌ హత్యా దివస్‌ నిర్వహించాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్రం నిర్ణయించింది. రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా ప్రజల్ని వేధించినందుకు ఈ పేరుతో దినోత్సవం జరుపుతామని అమిత్‌ షా తెలిపారు. ఎమర్జెన్సీలో కష్టాల పాలైన వారిని స్మరించుకునే విధంగా సంవిధాన్ హత్య దివస్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

‘‘1975 జూన్‌ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ పాలనతో దేశంలో అత్యయిక స్థితి విధించి ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు. ఎలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైల్లో పెట్టారు. మీడియా గళాన్ని అణగదొక్కారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్‌ 25ను ‘సంవిధాన్‌ హత్య దివస్‌’గా నిర్వహించాలని నిర్ణయించాం. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తుచేసుకుందాం’’ అని ఎక్స్‌ ఖాతాలో సందేశం ఉంచారాయన. 

సంవిధాన్‌ హత్యా దివస్‌పై మోదీ స్పందన

ఎమర్జెన్సీ నిరసన దినోత్సవ ప్రకటనపై  ప్రధాని మోదీ స్పందించారు. ‘‘నాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్‌ హత్య దివస్‌ మనకు గుర్తుచేస్తుంది. దేశ చరిత్రలో కాంగ్రెస్‌ రాసిన చీకటి దశ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ స్మరించుకునే రోజు అది’’ అని ప్రధాని పేర్కొన్నారు. 

విమర్శలకు తావిచ్చిన చీకటి రోజులు 
రాష్ట్రపతి దేశవ్యాప్త ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు 1975 జూన్‌ 25వ తేదీ అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీంకోర్టు వెలువరించిన కాసేపటికే ఇందిర ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అది సంచలనాత్మకం కావడంతోపాటు రాజకీయంగా ఇప్పటికీ తీవ్ర విమర్శలకు తావిస్తున్న విషయం తెలిసిందే. పత్రికాస్వేచ్ఛపై కోత సహా అనేక రకాలుగా ఆంక్షలకు కారణమైన ఎమర్జెన్సీని ముగిస్తూ.. ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు 1977 జనవరి 18న ఇందిర ప్రకటించారు. ఆ ఏడాది మార్చి 16 నుంచి 20 వరకు ఎన్నికలు నిర్వహించి, 21న ఎమర్జెన్సీని ఎత్తివేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement