బెంగళూరు : కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ముడా (muda scam) స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో (cm siddaramaiah) పాటు ఇతరులకు చెందిన రూ.300 కోట్ల విలువైన 140 స్థిరాస్థుల్ని అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) ప్రకటించింది.
మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై మనీలాండరింగ్ విచారణలో భాగంగా స్థిరాస్థుల్ని ఈడీ అటాచ్ చేసుకుంది. అటాచ్ చేసిన ఆస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లుగా పనిచేస్తున్న వివిధ వ్యక్తుల పేరిట రిజిస్టరయినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది.
ఈ సందర్భంగా.. ముడా భూకుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య సతీమణికి భారీ లబ్ధి కలిగిన విషయాన్ని కూడా ఈడీ స్పష్టం చేసింది. సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి నుంచి ముడా 3 ఎకరాల 16 గుంటల భూమిని మొదట రూ.3,24,700కు సేకరించిందని తెలిపింది. ఆ తర్వాత ఖరీదైన ప్రాంతంలో 14 స్థలాలను పరిహారంగా ఇచ్చిందని, వీటి విలువ రూ.56 కోట్లు ఉంటుందని వెల్లడించింది.
బినామీల పేరుతో
బీఎం పార్వతికి అక్రమంగా ముడా భూముల్ని కేటాయించడంలో నాటి ముడా మాజీ కమిషనర్ డిబి నటేష్ కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ వెల్లడించింది.బీఎం పార్వతితో పాటు పలువురు రియల్ ఎస్టేట్‌వ్యాపారులకు స్థలాల్ని కేటాయించినట్లు తేల్చింది. ఫలితంగా ఆ స్థలాల్ని భారీ మొత్తానికి అమ్మేలా ఒప్పందం జరిగినట్లుగా ఆధారాల్ని స్వాధీనం చేసుకుంది. ముడా ప్లాట్ల కేటాయింపు ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల బినామీలతో పాటు డమ్మీ వ్యక్తుల పేరు మీద జరిగినట్లు ఈడీ ఆరోపించింది.
సోదాల్లో తమకు ప్లాట్లు కేటాయించినందుకు ప్రతిఫలంగా పలువురు అప్పటి ముడా చైర్మన్, ముడా కమీషనర్‌కు భారీ మొత్తంలో స్థిరాస్తుల్ని కట్టబెట్టినట్లుగా తమకు పలు ఆధారాలు లభించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
కాగా, గతంలో ముడా కమిషనర్‌గా పనిచేసిన జీటీ దినేష్‌కుమార్ బంధువుల పేరిట ఆస్తులు, లగ్జరీ వాహనాలు ఇతర కొనుగోళ్లకు సంబంధించి సహకార సంఘం ద్వారా డబ్బు మళ్లించినట్లు తేలిందని ఈడీ ఆరోపించింది.
ఏమిటీ ముడా వివాదం?
సిద్ధరామయ్య మెడకు చుట్టుకున్న మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపు వివాదానిది మూడు దశాబ్దాల పై చిలుకు నేపథ్యం. మైసూరు జిల్లా కెసెరె గ్రామంలో సీఎం భార్య పార్వతికి 3 ఎకరాల 16 గంటల భూమి ఉంది. దేవనార్ 3ఫేజ్ లేఔట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. పరిహారంగా 50:50 నిష్పత్తి పథకం కింద 2021లో మైసూర్‌లోని ఖరీదైన విజయనగర ప్రాంతంలో ఏకంగా 14 ఖాళీ ప్లాట్లను కేటాయించింది.
‘‘పార్వతి నుంచి తీసుకున్న భూమి కంటే వీటి విలువ ఏకంగా రూ.45 కోట్లు ఎక్కువ. 50: 50 పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను సొంతం చేసుకుంది’’ అంటూ అబ్రహాం అనే ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు చేశాడు. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి బహుమతిగా ఇచ్చారని సిద్ధరామయ్య చెప్పగా ఇతరుల భూమిని అక్రమంగా లాక్కున్నట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో పార్వతి పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు సిద్ధరామయ్యే సీఎం. ఆమెకు ప్లాట్లు కేటాయించాలని 2017లో ముడా నిర్ణయించింది.
ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమేనని విపక్షాలంటున్నాయి. సిద్ధరామయ్య మాత్రం, ‘‘నేను సీఎంగా ఉన్నంతకాలం పరిహారమివ్వడం కష్టమని అధికారులు చెప్పారు. 2021లో బీజేపీ హయాంలో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ప్లాట్లు కేటాయించారు’’ అని వాదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment