గ్రెటా థన్‌బర్గ్.. కొద్ది రోజులుగా ఈ పేరు భారత్‌లో మారుమోగుతోందీ. కారణం ఆమె ఢిల్లీలో ఉద్యమించిన రైతులకు మద్దతు తెలపడమే కాదు. ఎప్పుడెప్పుడు ఏయే ఉద్యమాలు చేయాలో రాసి ఉన్న టూల్‌కిట్ రిలీజ్ చేసి వివాదానికి తెర లేపడమే! దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఈ టూల్‌కిట్‌తో సంబంధం ఉన్నవాళ్ల గురించి పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలో గ్రెటా ఫొటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. డొక్క ఎండుకుపోయి ఉన్న పేద పిల్లల కళ్లెదురుగా గ్రెటా థన్‌బర్గ్ సుష్ఠుగా భోజనం చేస్తోంది. వారు ఆత్రంగా ఆమె వైపు, అక్కడ ఉన్న ఆహార పదార్థాల వైపు దీనంగా చూస్తున్నట్లుందీ ఫొటో.
గ్రెటాకు, ఆ పేద పిల్లలకు మధ్య ఓ అద్దపు కిటికీ అడ్డుగా ఉంది. ఈ ఫొటో చూసిన చాలామంది ఇదే నిజమనుకుని నోరెళ్లబెట్టారు. అంతేకాదు, పైకి నీతులు చెప్పే ఆమె అసలు అవతరాం ఇదీ అని ఎగతాళి చేశారు. ఆమెను నానారకాలుగా తిట్టిపోశారు. కానీ ఇది ఫేక్ ఫొటో. రెండు వేర్వేరు ఫొటోలను ఒకే దగ్గర చేర్చి అందరినీ బురిడీ కొట్టించారు. 2007లో ఆఫ్రికాలో తీసిన బక్కచిక్కిన పేద పిల్లల ఫొటో ఒకటి కాగా, గతేడాది డెన్మార్క్‌లో గ్రెటా మధ్యాహ్న భోజనం చేస్తుండగా దిగిన ఫొటో మరొకటి. ఈ రెండింటినీ కలిపేసి ఫేక్ ఫొటో సృష్టించి కావాలని దాన్ని వైరల్ చేస్తున్నారు. కాబట్టి ఒక్కోసారి కంటికి కనిపించేదంతా నిజం కాదు.
కాగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని అన్నదాతలు కొన్ని రోజులుగా రోడ్లమీదకొచ్చి నిరసనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఈ ఆందోళనల సెగ ప్రపంచానికి తాకింది. దీంతో ఎందరో విదేశీ సెలబ్రిటీలు రైతులకు తమ మద్దతు తెలుపుతూ పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి, 18 ఏళ్ల గ్రెటా థన్‌బర్గ్ కూడా వారికి సంఘీభావం తెలుపుతూ ట్వీట్ చేసింది. అయితే మతం, జాతి, భాష, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివిధ గ్రూప్‌ల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారన్న కారణంతోపాటు విదేశాల నుంచి కుట్రలు సాగిస్తున్న ఆరోపణలతో ఆమెపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయినప్పటికీ వెనక్కు తగ్గని గ్రెటా ఇప్పటికీ రైతులకు మద్దతు ప్రకటిస్తున్నానని పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment