న్యూఢిల్లీ: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సహా 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉండే అన్ని రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ల ఛార్జీలను 25 శాతం మేర తగ్గించనున్నట్లు రైల్వే బోర్డు శనివారం తెలిపింది. అనుభూతి, విస్తాడోమ్ కోచ్‌లు సహా ఏసీ సౌకర్యం ఉండే అన్ని రైళ్లకు ఇది వర్తిస్తుందని వివరించింది. ఇతర వాహన ప్రయాణ ఛార్జీలను బట్టి కూడా రాయితీని నిర్ణయిస్తామని పేర్కొంది.
వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా ఏసీ కోచ్‌ల్లో ప్రయాణాలపై డిస్కౌంట్ పథకాలను ప్రకటించే అధికారాన్ని జోనల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు అప్పగించాలని రైల్వేశాఖ నిర్ణయించిందని కూడా వివరించింది. ‘ప్రాథమిక ఛార్జీపై గరిష్టంగా 25 శాతం వరకు రాయితీ ఉంటుంది. రిజర్వేషన్ ఛార్జ్, సూపర్ ఫాస్ట్ సర్‌చార్జ్, జీఎస్‌టీ మొదలైన తదితర ఛార్జీలు అదనం. ఆక్యుపెన్సీ ఆధారంగా ఏదైనా లేదా అన్ని తరగతులలో డిస్కౌంట్ అందించవచ్చు’అని రైల్వే బోర్డు పేర్కొంది.
‘గత 30 రోజుల్లో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న కొన్ని సెక్షన్లలోని రైళ్లలో విభాగాల వారీగా రాయితీ ఉంటుంది. డిస్కౌంట్ పథకం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులకు చార్జీల వాపస్ ఉండదు’అని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండే, కొన్ని తరగతులకు ఫ్లెక్సీ ఫేర్ అమల్లో ఉన్న కొన్ని రైళ్లకు ఈ రాయితీ పథకం వర్తించదు. పండగలు, సెలవు రోజుల్లో ప్రత్యేకంగా నడిపే రైళ్లల్లో రాయితీ ఉండదు. రాయితీ స్కీమ్ వందేభారత్ రైళ్లకు కూడా వర్తిస్తుందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
ఇదీ చదవండి: టేకాఫ్ కష్టమని దింపారు
Comments
Please login to add a commentAdd a comment