![Farooq Abdullah Says Like China Need Talk To Pakistan Border Issues - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/19/farooq-abdullah.gif.webp?itok=zikAHZ67)
న్యూఢిల్లీ: నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా దౌత్య విధానానికి సంబంధించి లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవాధీన రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాతో చర్చలు జరుపుతున్నట్లుగానే, దాయాది దేశం పాకిస్తాన్‌తోనూ ఇదే తరహా సంప్రదింపులు జరపాలని ప్రభుత్వానికి సూచించారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఎంతో మంది ప్రజలు మరణిస్తున్నారని, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించి శాంతి నెలకొనేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం లోక్‌సభలో ప్రసంగించిన ఫరూక్ అబ్దుల్లా.. ‘‘బలగాల ఉపసంహరణ విషయంలో నేడు ఇండియా చైనాతో చర్చలు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అలాగే పెండింగ్‌లో ఉన్న వివాదాల గురించి పాకిస్తాన్‌తోనూ చర్చలు ప్రారంభించాలి. బార్డర్‌లో ప్రజలు చనిపోతున్నారు. చర్చల ద్వారానే ఇందుకు పరిష్కారం దొరుకుతుంది. లఢఖ్ సరిహద్దులో చైనాతో వ్యవహరిస్తున్న తీరుగానే, మన పొరుగు దేశంతోనే మాట్లాడి ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోయేలా చూడాలి’’ అని విజ్ఞప్తి చేశారు. (చదవండి: మన గస్తీని ఏ శక్తీ అడ్డుకోలేదు)
అదే విధంగా.. షోపియాన్ ఎన్‌కౌంటర్‌లో తమ తప్పిదం కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారని ఆర్మీ అధికారులు చెప్పడం తనకు సంతోషంగా ఉందంటూ జూలై నాటి ఘటనను ఫరూక్ అబ్దుల్లా సభలో ప్రస్తావించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం భారీగా నష్టపరిహారం చెల్లిస్తుందని ఆశిస్తున్నారన్నారు. కాగా గతేడాది ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాతో పాటు పలువురు కశ్మీరీ నేతలకు ప్రభుత్వం గృహ నిర్బంధం విధించిన విషయం తెలిసిందే.(చదవండి: చైనాకు చెక్ పెట్టేందుకు ఆ 4 దేశాలు..)
ఈ క్రమంలో ఇటీవలే ఆయనకు విముక్తి లభించింది. వర్షాకాల పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో లోక్‌సభలో ప్రసంగించిన ఫరూక్ అబ్దుల్లా డిటెన్షన్ కాలంలో తనకు మద్దతుగా నిలిచిన ఎంపీలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ ఎలాంటి పురోగతి సాధించలేదన్నారు. కాగా ఫరూక్ అబ్దుల్లా ప్రస్తుతం శ్రీనగర్ ఎంపీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment