
ముందువెళ్తున్న బస్సుడ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం.. వెనుక వస్తున్న కారు బస్సును ఢీకొనడం.. ఆ వెంటనే వాటిపైకి లారీ దూసుకురావడం.. క్షణాల్లో ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం.. అచ్చం సినిమాను తలపిస్తున్న ఈ ఘటన మంగళవారం తిరుచ్చి– చెన్నై హైవేపై చోటు చేసుకుంది. ఈఘటన విధిరాతను విధాత అయినా తప్పించలేడనే సామెతను అక్షరాల నిజం చేసిందని కొందరు ఆవేదన వ్యక్తం చేయగా.. దయలేని దేవుడు నా అనే వారే లేకుండా ఓ కుటుంబాన్ని చిదిమేశాడంటూ మరికొందరు వాపోయారు. ఇరుగుపొరుగు వారే అంతిమ సంస్కారాలు చేయాలేమో అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
సాక్షి, చెన్నై: దైవ దర్శనానికి వెళ్లొస్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురై అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ హృదయ విదారక ఘటనలో ఒకే కుటుంబంలోని మొత్తం అయిదుగురూ మరణించడం చూపరులను కంటతడి పెట్టించింది. వివరాలు..చెన్నై శివారులోని కాంచీపురం జిల్లా నంగనల్లూరుకు చెందిన విజయ వీర రాఘవన్(41) ఐటీ ఉద్యోగి. ఆయనకు భార్య వత్సల (37), కుమారులు విష్ణు(12), అదిర్థ్(8) ఉన్నారు. భార్య పిల్లలు, తల్లి వసంతలక్షి్మ (58)తో కలిసి కారులో నూతన సంవత్సరం సందర్భంగా కేరళలోని ఆలయాల సందర్శనకు రెండు రోజుల క్రితం వెళ్లారు. కారును విజయ వీర రాఘవన్ నడిపాడు. దైవ దర్శనాన్ని ముగించుకుని సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు.
వరుసగా వాహనాల ఢీ..
తిరుచ్చి – చెన్నై హైవేలోని కడలూరు జిల్లా వేపూరు అయ్యనార్ పాళయం వద్దకు మంగళవారం వేకువ జామున 2.45 గంటలకు ఘోరం జరిగింది. ఈ ప్రాంతంలో వంతెన నిర్మాణ పనులు జరుగుతుండడంతో వాహనాలను సరీ్వసు రోడ్డుకు అధికారులు మరల్చా రు. అక్కడ ముందు వెళ్తున్న ప్రైవేటు ఆమ్నీ బస్సు డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న కారును విజయ వీరరాఘవన్ ఒక్కసారిగా ఆపే ప్రయ త్నం చేశాడు. అప్పటికే వెనుక వస్తున్న లారీలు ఒక దానికి మరొకటి కారును వేగంగా ఢీకొట్టాయి.
దీంతో లారీ – బస్సు మధ్య చిక్కుకున్న కారు నామరూపాల్లేకుండా పోయింది. అందులో ఉన్న వారందరూ ఘటనా స్థలంలోనే శరీరాలు ఛిద్రమై విగత జీవులయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు అతికష్టం మీద కారులో నుంచి మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు. కుటుంబం అంతా ఈ ప్రమాదంలో మరణించడంతో నంగనల్లూరులోని ఇరుగు పొరుగువారు విల్లుపురం ముండియంబాక్కం ఆస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. కాగా విచారణలో వీర రాఘవన్ సోదరి వసుధారాణి మదురైలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు సమాచారం అందించారు. ఆమె వచ్చాక అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment