
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. ఈ నేపధ్యంలో మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికే బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించారు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, అటానమస్ బాడీలు, ప్రభుత్వ పరిధిలోని సొసైటీలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, పాఠశాలలను మూసివేశారు.
మరోవైపు మణిపూర్ విద్యాశాఖ డైరెక్టరేట్ రాష్ట్రంలో వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా జూలై 3, 4 తేదీల్లో అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మణిపూర్‌లోని పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, కాంగ్‌పోక్పి, సేనాపతి, తౌబాల్, బిష్ణుపూర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి.
మణిపూర్‌లోని ప్రధాన నదుల నీటి మట్టాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బలహీనమైన కట్టడాల్లో నివాసం ఉండరాదని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment