సిమ్లా, డెహ్రాడూన్: క్లౌడ్ బరస్ట్‌లు మరోసారి బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఒడిశాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టిస్తున్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఉత్తరాఖండ్‌లో నదులు పొంగిపొరలుతున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు
ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. మండి, కంగ్రా, చంబా జిల్లాల్లోని ముంచెత్తిన వరదల్లో 22 మంది మరణించారు. మరో అయిదుగురు గల్లంతయ్యారు. భారీ వర్షాలకు శనివారం ఉదయం పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లను కలుపుతూ పఠాన్‌కోటలోని చక్కి నది మీద నిర్మించిన 800 మీటర్ల పొడవైన రైల్వే వంతెన కుప్పకూలిపోయింది. జోగిందర్ నగర్, పఠాన్‌కోట్ మధ్య ఈ వంతెనను బ్రిటిష్ హయాంలో 1928లో నిర్మించారు.
incident of flood (Beas River) found at Village Kheri , Sub division Sujanpur, District Hamirpur. 10-12 houses on the verge of drowning 15-20 people are trapped inside them, including some small children. Till now no damage to life. Rescue teams are on the spot @DcHamirpur pic.twitter.com/dq3dpZxM6k
— HIMACHAL PRADESH STATE DISASTER RESPONSE FORCE (@HP_SDRF) August 20, 2022
వంతెన బీటలు వారడంతో గత నెల రోజులుగా ఈ వంతెనపై రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు. చంబా జిల్లాలో కొండచరియలు ఇళ్ల మీద విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మండిలో వరదలకు ఒకే కుటుంబంలోని అయిదుగురు కొట్టుకుపోయారు. హమీర్‌పూర్ జిల్లాను కూడా వరదలు ముంచెత్తాయి. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు అందిస్తున్నట్టుగా తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో వరుస క్లౌడ్ బరస్ట్‌లు
ఉత్తరాఖండ్‌లో వరుస క్లౌడ్ బరస్ట్‌లతో నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వంతెనలు వరద ఉధృతికి కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాలకు తెహ్రి జిల్లాలో ఇళ్లు కూలిపోయి నలుగురు మరణించగా, మరో 10 మంది గల్లంతయ్యారు. రిషికేష్ గంగా నది ఉప్పొంగుతోంది. టాన్స్ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో తపకేశ్వర్ గుహలను వరద నీరు ముంచెత్తింది.
రాయపూర్‌లోని సార్కేత్ గ్రామంలో క్లౌడ్ బరస్ట్‌తో థానో ప్రాంతంలోని సాంగ్ నదిపై వంతెన కూలిపోయింది. ముస్సోరి సమీపంలో పర్యాటకప్రాంతమైన కెంప్టీ జలపాతం ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వరద ప్రాంతాల్లో పర్యటించారు. సహాయ చర్యల్ని పర్యవేక్షించారు. అవసరమైతే ఆర్మీ సాయం కోరతామని వెల్లడించారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
చదవండి: లిక్కర్ కుంభకోణంలో సూత్రధారి కేజ్రీవాల్: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
జార్ఖండ్, ఒడిశాలో భారీ వానలు అటు జార్ఖండ్, ఒడిశాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జార్ఖండ్‌లో భారీ ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోతున్నాయి. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు మహానది ఉప్పొంది ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 2 లక్షల మందికిపైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మయూర్ భంజ్, కియోంజార్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి గోడలు కూలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఏమిటీ క్లౌడ్‌బరస్ట్
అతి తక్కువ వ్యవధిలో, పరిమిత ప్రాంతంలో కుంభవృష్టి కురిస్తే దానిని క్లౌడ్ బరస్ట్ అంటారు. భారత వాతారణ శాఖ ప్రకారం 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక గంటలో 10 సెంటీమీటర్లకి మించి వర్షం కురిస్తే దానిని క్లౌడ్ బరస్ట్ అని పిలుస్తారు. మైదాన ప్రాంతాల కంటే కొండ ప్రాంతాల్లోనే క్లౌడ్ బరస్ట్‌లు ఎక్కువగా సంభవిస్తాయి. పర్వత ప్రాంతాల్లో మేఘాలు అధిక తేమను కలిగి సంతృప్త స్థాయికి చేరుకుంటాయి. కానీ వాతావరణం వేడిగా ఉండడం వల్ల వర్షించడం సాధ్యమవదు. ఫలితంగా కొంత సమయం గడిచాక మేఘాల్లో సాంద్రత ఎక్కువైపోయి ఒక్కసారిగా కుండపోతలా నీటిధార కురుస్తుంది.
వాన చినుకుల పరిమాణం చాలా పెద్దదిగా ఉంటుంది. ఒక్కోసారి ఉరుములు, మెరుపులు, పిడుగులతో కుంభవృష్టి కురుస్తుంది. వీటి గురించి ముందుగా అంచనా వేయడం కష్టం. కేవలం డాప్లర్ రాడార్ల ద్వారా వీటిని గుర్తించే అవకాశం కొంతవరకు ఉంది. ప్రస్తుతం మన దేశంలో ఈ రాడార్లు 34 ఉన్నాయి. అయినప్పటికీ కచ్చితంగా ఫలానా ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరుగుతుందని ముందస్తుగా అంచనా వేయడం దాదాపుగా అసాధ్యమని భారత వాతావరణ శాఖ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment