లక్నో: గాయపడిన ఓ కొంగను కాపాడిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంద్ఖా గ్రామంలో ఆరిఫ్ ఖాన్ గుర్జార్‌కు గతంలో ఓ సారస్ కొంగ గాయంతో తన పోలంలో కనిపించింది. వెంటనే చికిత్స చేసి కొన్నాళ్లు పాటు ఆ కొంగను కాపాడుతూ వచ్చాడు ఆరిఫ్. ఆ పక్షి కొలుకున్న తర్వాత తనను కాపాడిన వ్యక్తితోనే ఉండిపోయింది. అయితే ఇటీవల ఈ విషయం అటవీ అధికారులకు తెలియడంతో ఆ కొంగను స్వాధీనం చేసుకున్నారు.
ఈ పక్షి తన సహజ వాతావరణంలో జీవించేందుకు వీలుగా రాయ్‌బరేలీలోని సమస్పూర్ అభయారణ్యంలోకి మార్చినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆరిఫ్ ఖాన్ గుర్జార్‌కు నోటీసు జారీ చేసి అతని స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి ఏప్రిల్ 4న గౌరీగంజ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కార్యాలయంలో హాజరు కావాలని కోరారు. అసిస్టెంట్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (గౌరీగంజ్) రణవీర్ సింగ్ జారీ చేసిన నోటీసు ప్రకారం, వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ పక్షిని తీసుకెళ్లిన ఒక రోజు తర్వాత, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ చర్యను ఖండించారు. అంతేకాకుండా ప్రధాని నివాసంలో ఉన్న నెమళ్లను తీసుకెళ్లే ధైర్యం ఎవరికైనా ఉందా అని పరోక్షంగా అధికారులను ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఆరీఫ్ ఖాన్ గుర్జార్ మాజీ ముఖ్యమంత్రితో కలిసి వేదికపై కూర్చున్నారు కానీ మాట్లాడలేదు. ఇదిలా ఉండగా.. ఆరిఫ్ సమ్మతితోనే కొంగను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ పక్షులు ఎప్పుడూ జంటగా జీవిస్తాయని, అది ఒంటరిగా నివసిస్తున్న నేపథ్యంలో దాని మేలుకే సంరక్షణ కేంద్రానికి తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment