సాక్షి, న్యూఢిల్లీ: రామోజీ ఫిల్మ్‌సిటీలో రాజవంశీకులకు చెందిన భూములతోపాటు అసైన్డ్, రహదారి భూములున్నాయని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో భూఆక్రమణలపై మీడియాతో ఆయన మాట్లాడారు. రామోజీ ఫిల్మ్‌సిటీకి చెందిన 3 వేల ఎకరాల్లో 1,700 ఎకరాలు గాలిబ్ జంగ్‌కు చెందిన భూములున్నాయని... ప్రజారహదారులు, హరిజనుల భూములు, భూదాన్ భూములను సైతం కబ్జా చేశారని చెప్పా రు. కార్మికుల చట్టాలను కూడా ఉల్లంఘిచారని, గతంలో ఈనాడులో పనిచేసిన వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు.
అనాజ్‌పూర్–ఇబ్రహీంపట్నం రహదారిని మూసేసి, కబ్జా చేశారని... దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గోనె పేర్కొన్నారు. దివంగత వై.ఎస్.రాజ శేఖరరెడ్డి హయాంలో 682 మందికి 200 గజాల చొప్పున పట్టాలు ఇవ్వగా లబ్దిదారులను వారి స్థలాల్లోకి రానివ్వట్లేదని గోనె ప్రకాశ్‌రావు ఆరోపించారు. ఈ ఆస్తులను ప్రభుత్వం వెంటనే అ«దీనంలోకి తీసుకొని రామోజీరావుకు నోటీసులు జారీ చేయాలన్నారు. ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’చట్టం ప్రకారం నోటీసులపై రామోజీరావు కోర్టుకు వెళ్లడానికి వీల్లేదని... ఇది చాలా పటిష్టమైన చట్టమని చెప్పారు.
న్యాయ పోరాటం క్లైమాక్స్‌కు...
బ్రిటిష్ పాలకులు ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’అనే చట్టం తీసుకొచ్చారని, అందులో దేశవ్యాప్తంగా వివిధ రాజవంశాలకు చెందిన 560 మందిని చేర్చారని గోనె ప్రకాశ్‌రావు తెలిపారు. నిజాం స్టేట్‌లో మార్వాడీ, ముస్లింలు తదితర 8 కుటుంబాలు ఉన్నాయన్నారు. అయితే ఈ రాజవంశీకులకు చెందిన రూ. లక్షల కోట్ల విలువైన ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని.. ఈ విషయంలో తాను చేస్తున్న పోరాటం క్లైమాక్స్‌కు వచ్చిందన్నారు. ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’చట్టం ప్రకారం రాజవంశీకుల మరణానంతరం వారి వారసులు మైనర్లయితే పరిశ్రమలు, ఆస్తులు, భూములను ప్రభుత్వం అదీనంలోకి తీసుకుంటుందని... వారసులు మేజర్లు అయ్యాక ఆ ఆస్తులను వారికి తిరిగి అప్పగిస్తుందని ఆయన చెప్పారు.
అయితే తెలంగాణలో ఆ ఆస్తులు, భూములు అన్యాక్రాంతమయ్యాయని, రూ. లక్షల కోట్ల విలువైన ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’కిందకు వచ్చే ఆస్తులు ఒక పత్రికాధిపతి (రామోజీరావు), తెలుగు రాష్ట్రాల్లోనే నంబర్ వన్ బిల్డర్‌గా ఉన్న రామేశ్వరరావు అధీనంలో ఉన్నాయని గోనె ఆరోపించారు. వాటిలో పెద్దపెద్ద భవనాలు కట్టారని తెలిపారు. రాష్ట్రంతోపాటు అమెరికాలో పెద్ద పారిశ్రామికవేత్త, ఎయిర్‌పోర్టులు నిర్మించిన ఆయనకు స్టార్ హోటళ్లు కూడా ఉన్నాయని వాటిని తాజ్ గ్రూప్‌నకు ఇచ్చారని, అవి కూడా ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’భూములే అన్నారు.
రెండు రాష్ట్రాల సీఎంలు విచారణ చేపట్టాలి
రాజవంశానికి చెందిన వారందరినీ కలుపుకొని న్యాయం కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాం«దీలను కలిసి ఆధారాలు అందిస్తానని గోనె ప్రకాశ్‌రావు తెలిపారు. ఈ తరహా వ్యవహారాలు కర్ణాటకలోనూ ఉన్నందున చర్యలు తీసుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఒక కమిటీ వేసి విచారణ జరిపించాలని కోరారు. సంబంధిత పత్రాలు, సమాచారం కోసం హైదరాబాద్‌లోని రాజ్యాభిలేఖ కార్యాలయానికి దరఖాస్తు చేశానన్నారు. 2008లో పాయిగా వంశానికి చెందిన 140 ఎకరాలు (రూ. 20 వేల కోట్ల విలువైన) రిలీజ్ అయ్యాయని తెలిపారు. దీనిపై రాయచూర్‌లోని ఆ కుటుంబంతో మాట్లాడానని తెలిపారు.
కోర్టు ఆదేశాల మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు హామీలిచ్చిన పథకాల అమలుకు ఆ ఆస్తులను వాడాలని కోరతామని చెప్పారు. లక్ష నాగళ్లతో (రామోజీ ఫిల్మ్‌సిటీని) దున్నిస్తానని చెప్పిన కేసీఆర్... సీఎం అయ్యాక కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని త్వరలో కలిసి ఈ వ్యవహారాన్ని వివరిస్తానని చెప్పారు. ఆర్థిక చిక్కుల్లో నుంచి రాష్ట్రం బయటపడేందుకు తాను చెబుతున్న విషయం ఒక ఫార్ములా అని అన్నారు. ఈ సందర్భంగా గతంలో రామోజీరావు ఆక్రమణలపై 2010లో ‘ఇండియా టుడే’ ప్రచురించిన కథనాలను, పత్రాలను గోనె ప్రకాశ్‌రావు మీడియాకు చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment