సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): మానవసహిత అంతరిక్ష ప్రయోగాల దిశగా అడుగులు వేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) ఆ ప్రయత్నంలో తొలి విజయం సాధించింది. విజయసోపానాల్లో తొలిమెట్టుగా భావిస్తున్న గగన్‌యాన్ ప్రాజెక్టు సన్నాహకాల్లో భాగంగా ఇస్రో చేపట్టిన మానవరహిత క్రూ ఎస్కేప్ సిస్టమ్(సీఈఎస్) పరీక్ష విజయవంతమైంది. సతీష్ దవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక ఇందుకు వేదికైంది.
ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 10 గంటలకు గగన్‌యాన్ టెస్ట్ వెహికల్ (టీవీ–డీ1) వాహకనౌకను విజయవంతంగా పరీక్షించారు. దాదాపు 16.9 కి.మీ.ల ఎత్తులో అందులోంచి క్రూ ఎస్కేప్ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్‌లు విడిపోయి వేర్వేరు పథాల్లో ప్రయాణించి బంగళాఖాతంలో సురక్షితంగా పడ్డాయి. క్రూ ఎస్కేప్ మాడ్యూల్‌ను డ్రోగ్ పారాచూట్‌లు సురక్షితంగా సముద్రజలాలపై ల్యాండ్ అయ్యేలా చేశాయి. మానవసహిత ప్రయోగాలు చేపట్టినపుడు అందులోని వ్యోమగాములను క్రూ మాడ్యూల్ ఎలా సురక్షితంగా బయటపడేయగలదన్న అంశాన్ని పరీక్షించేందుకే ఈ ఎస్కేప్ మాడ్యూల్ పరీక్ష చేశారు.
17 కిలోమీటర్ల ఎత్తుకెళ్లి తిరిగి సముద్రంలోకి ..
టెస్టు వెహికల్ (టీవీ–డీ1) ప్రయోగాన్ని 10.10 నిమిషాల వ్యవధిలో పూర్తి చేశారు. ఇందులో భాగంగా సింగిల్ స్టేజీ ద్రవ ఇంధర రాకెట్(టీవీ–డీ1)పై క్రూ ఎస్కేప్ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్‌లను అమర్చారు. రాకెట్‌ను ప్రయోగించాక అత్యవసర స్థితి(అబార్ట్)ను సిములేట్ చేశారు. దీంతో రాకెట్ 11.7 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక క్రూ ఎస్కేప్ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్‌లు వేరువడటం ప్రారంభమైంది.
రాకెట్ 16.6 కిలోమీటర్ల ఎత్తులోకి చేరుకున్నాక క్రూ ఎస్కేప్ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్‌లు రాకెట్ నుంచి విడివడి వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తూ బంగాళాఖాతంలో పడ్డాయి. అయితే క్రూ ఎస్కేప్ మాడ్యూల్‌ను సేకరించే ఉద్దేశంతో అది సురక్షితంగా సముద్రంలో పడేలా తొలుత రెండు డ్రోగ్ పారాచూట్లు విచ్చుకుని నెమ్మదిగా కిందకు దిగేందుకు సాయపడ్డాయి.
తర్వాత మరో పెద్ద పారాచూట్ విచ్చుకుని ల్యాండింగ్‌ను దిగి్వజయం చేసింది. సమీప సముద్ర జలాల్లో ప్రత్యేక లాంచీలో వేచి ఉన్న కోస్టల్ నేవీ బలగాలు ఆ మాడ్యూల్‌ను సురక్షితంగా శ్రీహరికోటకు చేర్చారు. అయితే మానవ సహిత గగన్‌యాన్ ప్రయోగాలు భవిషత్తులో చేయడానికి ఇలాంటి ప్రయోగాలు మరో మూడు చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
నాలుగోసారి క్రూ మాడ్యూల్‌లో వ్యోమగాములను పోలిన బొమ్మలను అమర్చి క్రూ ఎస్కేప్ మాడ్యూల్‌ను పరీక్షిస్తారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత 2024 చివర్లో లేదా 2025 ప్రథమార్ధంలో మానవ సహిత ప్రయోగాలు చేయనున్నారు. గగన్‌యాన్ టీవీ–డీ1 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆనందం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మిషన్ డైరెక్టర్ శివకుమార్, డైరెక్టర్ సునీల్, వీఎస్‌ఎస్‌సి డైరెక్టర్ ఉన్ని కృష్ణన్‌నాయక్, డైరెక్టర్ నారాయణ పాల్గొన్నారు.
గగన్‌యాన్ సాకారం దిశగా మరింత చేరువకు: ప్రధాని మోదీ
‘టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ (టీవీ–డీ1)’ పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించడంతో ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ‘ ప్రతిష్టాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టు సాకారం దిశగా ఈ ప్రయోగం మనల్ని మరింత చేరువ చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు’ అంటూ వారిని అభినందిస్తూ ప్రధాని మోదీ శనివారం ట్వీట్లు చేశారు.
మొదట తడబడినా..
మొదట శుక్రవారం రాత్రి ఏడింటికి మొదలైన 13 గంటల కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 8 గంటలకు ముగిశాక ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో శనివారం తెల్లవారుజామున వర్షం పడడంతో వాతావరణం అనుకూలించని కారణంగా కౌంట్‌డౌన్ సమయాన్ని మరో 30 నిమిషాలు పెంచారు. తర్వాత 15 నిమిషాల వ్యవధిలోనే అంటే 8.15 గంటలకు రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేసి 8.45గంటలకు కౌంట్‌డౌన్ మొదలు పెట్టారు. హఠాత్తుగా ఇంజన్‌ను మండించే ప్రక్రియలో లోపం తలెత్తింది.
దీంతో రాకెట్ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లకుండా ఆగిపోయింది. దీంతో ప్రయోగాన్ని ఆటో మేటిక్ లాంచ్ సీక్వెన్స్‌లోని ఆన్ బోర్డు కంప్యూటర్ ఆపేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రయోగం వాయిదా వేసినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. అయితే దీన్ని సవాల్‌గా తీసుకున్న ఇస్రో శాస్త్రవేత్తల టైగర్ సేఫ్టే బృందం వెంటనే లాంచ్ ప్యాడ్ వద్దకు వెళ్లి సాంకేతిక లోపాన్ని సరిచేసింది. దీంతో మళ్లీ 9.33 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఎట్టకేలకు 10.03 గంటలకు గగన్‌యాన్ టీవీ–డీ1 విజయవంతంగా ప్రయోగించారు. 10 నిమిషాల 10 సెకన్లలో మొత్తం ప్రయోగం విజయవంతంగా పూర్తయింది.
Comments
Please login to add a commentAdd a comment