రావత్ దంపతుల అంత్యక్రియల కార్యక్రమంలో కుమార్తెలు కృతికా, తరిణి
న్యూఢిల్లీ: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికకు పూర్తి సైనిక అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. రావత్ దంపతుల పార్థివ దేహాలకు ఢిల్లీలోని కంటోన్మెంట్ బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో శుక్రవారం సాయంత్రం వారి కుమార్తెలు కృతికా, తరిణి దహన సంస్కారాలు నిర్వహించారు. రావత్ దంపతుల పార్థివదేహాలను పక్కపక్కనే ఉంచి చితి పేర్చారు. మత గురువు సంస్కృత శ్లోకాలు పఠిస్తుండగా, కుమార్తెలిద్దరూ తల్లిదండ్రుల చితికి నిప్పంటించారు. ఈ సందర్భంగా ఉద్విగ్నభరితమైన వాతావరణం నెలకొంది. ప్రజలు భావోద్వేగానికి గురై కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. అంతకుముందు రావత్, మధులికకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేంద్ర మంత్రులు, ఫ్రాన్స్ రాయబారి ఇమ్మానుయేల్, బ్రిటష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్‌తోపాటు పలు దేశాల రక్షణశాఖ అధికారులు ఘనంగా నివాళులర్పించారు. రావత్‌కు సైనికులు 17 శతఘ్నులతో గన్ సెల్యూట్ సమర్పించారు.
రావత్ అమర్ రహే..
తొలుత శుక్రవారం ఉదయం రావత్, మధులిక భౌతికకాయాలకు వారి అధికారిక నివాసంలో అధికారులు, ప్రజలు కన్నీటి నివాళులర్పించారు. నివాసం ఎదుట భారీగా జనం గుమికూడారు. భారత్ మాతా కీ జై, జనరల్ రావత్ అమర్ రహే, ఉత్తరాఖండ్ కా హీరా అమర్ రహే అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, యూపీ సీఎం యోగి, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీ, హరియాణా సీఎం ఖట్టర్, రాజ్యసభ సభ్యుడుఖర్గే, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులు, మత గురువులు రావత్ దంపతుల పార్థివ దేహాల వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. మధ్యాహ్నం 2.20 గంటలకు అంతిమ యాత్ర మొదలైంది. వందలాది మంది యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో త్రివిధ దళాల నుంచి 800 మంది సీనియర్ సైనికులు పాల్గొన్నారు. జవాన్ల కవాతు మధ్య అంతిమ యాత్ర 10 కిలోమీటర్ల మేర కొనసాగి, శ్మశాన వాటికకు చేరుకుంది. ఈ యాత్ర పొడవునా జనం రావత్ దంపతుల భౌతిక కాయాలపై పూలు చల్లి నివాళులర్పించారు. అంత్యక్రియలను దేశవ్యాప్తంగా లక్షలాది మంది టీవీల్లో వీక్షించారు.
నేడు హరిద్వార్‌కు చితాభస్మం
రావత్ దంపతుల చితాభస్మాన్ని శనివారం ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌కు తీసుకెళ్లనున్నట్లు వారి కుమార్తె తరిణి చెప్పారు. చితాభస్మాన్ని హరిద్వార్‌లో గంగానదిలో నిమజ్జనం చేస్తామని అన్నారు.
నా భర్తను నవ్వుతూ సాగనంపాలి
బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిడ్డర్ భార్య గీతికా లిడ్డర్
న్యూఢిల్లీ: ‘‘నా భర్తకు ఘనమైన వీడ్కోలు పలకాలి. నవ్వుతూ సాగనంపాలి’’ అని బ్రిగేడియర్ లఖ్వీందర్‌సింగ్ లిడ్డర్ భార్య గీతికా లిడ్డర్ వ్యాఖ్యానించారు. హెలికాప్టర్ నేలకూలిన ఘటనలో జనరల్ రావత్ దంపతులతోపాటు మృతిచెందిన బ్రిగేడియర్ లిడ్డర్ అంత్యక్రియలను శుక్రవారం ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హరియాణా సీఎం ఖట్టర్‌తోపాటు సీనియర్ సైనికాధికారులు అంతకుముందు లిడ్డర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గీతికా లిడ్డర్ మాట్లాడుతూ.. విధులకు వెళ్లిన తన భర్త ఇలా నిర్జీవంగా తిరిగి వస్తారని ఊహించలేదని చెప్పారు. ఆయన మరణం తమ కుటుంబానికి పూడ్చలేని నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సైనికుడి భార్యనని, చెదరని నవ్వుతో తన భర్తకు వీడ్కోలు పలుకుతానన్నారు. తన తండ్రి ఒక హీరో, గొప్ప స్ఫూర్తి ప్రదాత అని లిడ్డర్ కుమార్తె ఆష్నా(17) చెప్పారు. తండ్రి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని అన్నారు.
17 గన్ సెల్యూట్ ఎవరికి?
రాష్ట్రపతి, అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల అంతిమ వీడ్కోలు సందర్భంగా 21 గన్ సెల్యూట్ సమర్పిస్తుంటారు. నేవీ చీఫ్, ఆర్మీ చీఫ్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మరణిస్తే 17 గన్ సెల్యూట్ సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. భారత తొలి డీసీఎస్ జనరల్ రావత్ ర్యాంక్.. ఆర్మీ చీఫ్, వాయుసేనాధిపతి, నావికా దళాధిపతిల ర్యాంక్‌లతో సమానం. అందుకే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లతో సమానంగా అంత్యక్రియల్లో 17 గన్ సెల్యూట్ సమర్పించారు. ‘2233 ఫీల్డ్ రెజిమెంట్’కు చెందిన 17 శతఘ్నులతో రావత్‌కు గన్ సెల్యూట్ చేయించారు. ఇతర దేశాల అధినేతలు, అతిథులు భారత్‌కు వచ్చినప్పుడు 19 గన్ సెల్యూట్‌తో గౌరవ వందనం సమర్పించడం ఆనవాయితీ.
హెలికాప్టర్ ప్రమాదంపై ఊహాగానాలు వద్దు
న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: 13 మందిని బలిగొన్న హెలికాప్టర్ దుర్ఘటనపై ఎలాంటి ఊహాగానాలు వద్దని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విజ్ఞప్తి చేసింది. కచ్చితమైన సమాచారం లేకుండా అవాస్తవాలను ప్రచారంలోకి తీసుకురావొద్దని శుక్రవారం ట్వీట్ చేసింది. ప్రమాదంపై ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రమాదంవెనుక కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమంటూ కొందరు నేతలు చెబుతున్న నేపథ్యంలో ఐఏఎఫ్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాఉండగా,హెలికాప్టర్ ప్రమాదంపై ఎలాంటి అనుమానాలకు తావులేదని తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు శుక్రవారం చెప్పారు. నీలగిరి ప్రాంతంలో ఎల్లప్పుడూ కట్టుదిట్టమైన బందోబస్తు ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment