న్యూఢిల్లీ: పార్లమెంటు సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల శంఖారావం చేశారు. ఈసారి కూడా ఘనవిజయం సాధించి ఖాయంగా హ్యాట్రిక్ కొడతామన్నారు. ‘‘సాధారణంగా నేను అంకెల జోలికి వెళ్లను. కానీ ఈసారి మాత్రం దేశం మనోగతాన్ని స్పష్టంగా అంచనా వేయగలను. ఎన్డీఏ కూటమికి ఏకంగా 400 పైచిలుకు స్థానాలొస్తాయి’’ అని జోస్యం చెప్పారు. బీజేపీ ఒంటరిగానే కనీసం 370 స్థానాలు సాధిస్తుందని ధీమా వెలిబుచ్చారు.
‘‘మళ్లీ అధికారంలోకి వచ్చేస్తున్నాం. వచ్చాక చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటాం. మూడో టర్మ్‌లో వెయ్యేళ్ల ప్రగతికి పటిష్ట పునాదులు వేస్తాం’’ అని ప్రకటించారు. విపక్షాలన్నీ అప్పుడే కాడి కింద పడేశాయంటూ ఎద్దేవా చేశారు. ‘‘కనీసం ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వాటికి ధైర్యం చాలడం లేదు. తమకు మరిన్ని సీట్లు తగ్గి మరోసారి విపక్ష పాత్ర ఖాయమన్న నిర్ణయానికి వచ్చేశాయి’’ అన్నారు.
కాంగ్రెస్ దుకాణం త్వరలో మూతపడుతుందని, దశాబ్దాల పాటు విపక్ష స్థానానికే పరిమితమవుతుందని ప్రధాని జోస్యం చెప్పారు. భారతీయుల సామర్థ్యంపై నెహ్రూకు, ఇందిరాగాం«దీకి ఎన్నడూ నమ్మకమే లేదంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలన కూడా అదే ఆత్మవిశ్వాస రాహిత్య ధోరణిలో సాగిందని విమర్శించారు. పదేళ్ల పాలనలో తాము సాధించిన ఘనతలను సాధించాలంటే కాంగ్రెస్‌కు కనీసం 100 ఏళ్లయినా పట్టి ఉండేదంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సోమ వారం లోక్‌సభలో బదులిస్తూ ప్రధాని పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయారు. ‘‘మహా అయితే 100 నుంచి 125 రోజులు! మేం వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం’’ అని స్పష్టం చేశారు. ‘అబ్ కీ బార్ (ఈసారి)’ అంటూ మోదీ పదేపదే నినదించగా, ‘400 పార్ (400 స్థానాలు దాటేస్తాం)’ అంటూ బీజేపీ సభ్యులంతా ప్రతిసారీ ముక్త కంఠంతో గొంతు కలిపారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ మాటే అంటున్నారని రాజ్యసభలో ఆయన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మోదీ చెప్పారు. తమ ప్రభుత్వ ఘనతలను వివరిస్తూ, విపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్‌ను, గాంధీ కుటుంబాన్ని ప్రధాని తూర్పారబట్టారు. వాటిపై విపక్షాల అభ్యంతరాలను, సభ్యుల నినాదాలను పట్టించుకోకుండా దాదాపు 100 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించారు. శతాబ్దాల ఎదురుచూపులు ఫలించి అయోధ్యలో మళ్లీ కొలువుదీరిన రాముడు దేశ ప్రగతి పయనానికి నూతన జవసత్వాలు అందిస్తాడన్నారు.
కూటమి సారథిగానూ కాంగ్రెస్ విఫలం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నిర్మాణాత్మక సలహాలిచ్చే అవకాశాన్ని విపక్షాలు చేజార్చుకున్నాయని మోదీ అన్నారు. ‘‘దాంతో వారిపై దేశ ప్రజలకు పూర్తిగా భ్రమలు తొలగాయి. విపక్షాలు తాము సుదీర్ఘకాలం పాటు విపక్షాలుగానే ఉంటామంటూ తీర్మానించుకున్నాయి. వారు మాట్లాడుతున్న ప్రతి మాటా అందుకు అద్దం పడుతోంది. వాటి నిర్ణయాన్ని అభినందిస్తున్నా’’ అంటూ చెణుకులు విసిరారు.
ఓటమి భయంతో చాలామంది విపక్ష నేతలు ఇప్పటికే స్థానాలు మారుతున్నారని, రాజ్యసభకు వెళ్లే ప్రయత్నాల్లోనూ పడ్డారని మోదీ ఎద్దేవా చేశారు. ‘‘విపక్షాలన్నీ కిందా మీదా పడి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి విచి్చన్నమైంది. ఇప్పుడా పారీ్టలన్నీ ఎక్ల చలో (ఒంటరిగా పోతాం) అంటున్నాయి’’ అని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయాన్ని ఉద్దేశించి బెంగాలీలో చమత్కరించారు. దేశంలో విపక్షాల ఈ దీన స్థితికి కాంగ్రెసే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.
తద్వారా కాంగ్రెస్ ఒక పారీ్టగానే గాక కూటమి సారథిగా కూడా విఫలమైందని చెప్పే ప్రయత్నం చేశారు. ‘‘కుటుంబ పాలనతో కాంగ్రెస్ ముందే పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. నిర్మాణాత్మక విపక్ష పాత్ర పోషించడంలోనూ గత పదేళ్లుగా పదేపదే విఫలమైంది. తద్వారా ప్రజల నమ్మకం చూరగొనే సువర్ణావకాశాన్ని చేజేతులా పోగొట్టుకుంది. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడిక దశాబ్దాల పాటు విపక్షంలోనే ఉండాలని గట్టిగా నిర్ణయించుకుంది! ప్రజలు కూడా ఆ పార్టీని అక్కడే ఉంచడం ద్వారా ఆశీర్వదిస్తారు!
అక్కడి నుంచి కాంగ్రెస్ మరిన్ని ఎత్తులకు చేరి త్వరలో లోక్‌సభ ప్రేక్షకుల గ్యాలరీల్లో దర్శనమిస్తుంది’’ అంటూ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఒకే ప్రోడక్టును పదేపదే లాంచ్ చేస్తోందని రాహుల్‌ను, ఆయన చేపట్టిన భారత్ జోడో, న్యాయ్ యాత్రలను ఉద్దేశించి మోదీ అన్నారు. ‘‘ఇది ఎన్నికల వేళ. కాస్త కష్టపడి ఏదన్నా కొత్తగా ప్రయతి్నంచాల్సింది. జనాలకు కొత్త సందేశమేదన్నా ఇవ్వాల్సింది. కానీ ఈ విషయంలోనూ కా>ంగ్రెస్ ఘోరంగా విఫలమైంది’’ అంటూ తూర్పారబట్టారు.
ఈ దెబ్బతో కాంగ్రెస్ దుకాణం బహుశా అతి త్వరలో మూతబడవచ్చని జోస్యం చెప్పారు. ‘‘దాంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితికి కాంగ్రెస్ దిగజారింది. రద్దు సంస్కృతిని అలవర్చుకుంది. కేవలం నాపై అక్కసుతో దేశం సాధించిన, సాధిస్తున్న ప్రతి ఘనతనూ రద్దు చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది’’ అంటూ మండిపడ్డారు. ‘‘దేశానికి కావాల్సింది ఆరోగ్యకరమైన విపక్షం. కానీ రాహుల్‌కు ఎక్కడ పోటీ వస్తారోనని కాంగ్రెస్‌లోని యువ నేతల గళాలను నాయకత్వమే అణచేస్తోంది. దానిది రాచకుటుంబాన్ని దాటి చూడలేనితనం’’ అంటూ దుయ్యబట్టారు.
అవినీతికి విపక్షాల అండ!
బీజేపీ సర్కారుపై విపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అవినీతికి, అందుకు పాల్పడుతున్న నేతలకు విపక్షాలే అడుగడుగునా కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. అవినీతి నేతలను కీర్తిస్తూ దేశానికి అవి ఏం సందేశమిస్తున్నాయని ప్రశ్నించారు. పైగా అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నందుకు తనపై, తన ప్రభుత్వంపై నిత్యం దుమ్మెత్తిపోస్తున్నాయని ఆక్షేపించారు. ‘‘నన్నెంత విమర్శించినా అవినీతిపై, అవినీతి నేతలపై కఠిన చర్యలు ఆగబోవు. దోచిందంతా కక్కాల్సిందే. దేశాన్ని దోచుకుంటున్న వారు మూల్యం చెల్లించాల్సిందే.
పవిత్ర సభ సాక్షిగా దేశానికి నా వాగ్దానమిది’’ అన్నారు. దర్యాప్తు సంస్థలు విపక్ష నేతలను లక్ష్యం చేసుకుంటున్నాయన్న ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘కాంగ్రెస్ హయాంలో అలాగే జరిగింది. అప్పట్లో దేశంలో ఎటు చూసినా అవినీతి తాండవమాడేది. పార్లమెంటులో చర్చంతా అవినీతి చుట్టే సాగేది. మా పాలనలో మాత్రం దర్యాప్తు రాజ్యాంగ నిర్దేశం మేరకు స్వతంత్రంగా పని చేస్తున్నాయి. వాటి పనితీరుపై తీర్పు చెప్పాల్సింది కోర్టులు మాత్రమే’’ అని చెప్పారు.కాంగ్రెష్ పాలనలో ఈడీ కేవలం రూ.5,000 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేయగా తమ హయాంలో అది ఏకంగా రూ.లక్ష కోట్లు దాటిందని చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో ఓబీసీలకు అన్యాయం
కాంగ్రెస్, ఆ పార్టీ సారథ్యంలోని యూపీఏ సర్కారు ఓబీసీలకు తీరని అన్యాయం చేశాయని, ఓబీసీ నేతలను ఘోరంగా అవమానించాయని మోదీ దుయ్యబట్టారు. ఎన్డీఏ సర్కారులో ఓబీసీల లెక్కలు తీసిన కాంగ్రెస్ నేతలు అతి పెద్ద ఓబీసీనైన తనను మాత్రం మర్చిపోయారన్నారు. వెనకబడ్డ వర్గాలకు చెందిన దివంగత బిహార్ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ఇచ్చి తాము గౌరవించుకున్నామన్నారు. ‘‘1970లో బిహార్లో ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరిచి సీఎం పదవి నుంచి దింపేందుకు ప్రయతి్నంచిన చరిత్ర కాంగ్రెస్‌ది. ఆయనను కనీసం విపక్షనేతగా కూడా ఓర్వలేకపోయింది’’ అంటూ మండిపడ్డారు. యూపీఏ హయాంలో తెరపైకి తెచి్చన జాతీయ సలహా మండలిని రాజ్యంగేతర శక్తిగా మోదీ అభివర్ణించారు. అందులో ఓబీసీలు ఎందరున్నారో చెప్పాలన్నారు.
దేశ సామర్థ్యంపై నెహ్రూకు నమ్మకం లేదు
భారతీయులు దద్దమ్మలు, బద్ధకస్తులని భావించేవారు
ఇందిరది కూడా ఫక్తు అదే ధోరణి: మోదీ
దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై మోదీ తన ప్రసంగంలో సునిశిత విమర్శలు చేశారు. దేశం చిరకాలం పాటు ఎదర్కొన్న ఇక్కట్లకు, కశీ్మరీల సమస్యలకు ఆయన ఘోర తప్పిదాలే మూల కారణమని ఆరోపించారు. ‘‘భారతీయుల శక్తి సామర్థ్యాలపై నెహ్రూకు ఎన్నడూ నమ్మకమే లేదు. వాళ్లు బద్ధకస్తులని, తెలివితక్కువ వాళ్లని భావించేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ఇదే విషయాన్ని నెహ్రూ స్పష్టంగా పేర్కొన్నారు.
యూరోపియన్లు, జపానీయులు, చైనీయులు, రష్యన్లు, అమెరికన్ల మాదరిగా భారతీయులకు కష్టపడే స్వభావం లేదన్నారు. మనలను న్యూనతపరిచేందుకు వాళ్లను పొగిడారు. నెహ్రూ కుమార్తె, మాజీ ప్రధాని ఇందిరాగాం«దీది కూడా అదే ధోరణి. ఏదన్నా మంచి పని పూర్తయ్యే దశలో బద్దకించడం భారతీయులకు అలవాటని, అడ్డంకి ఎదురవుతూనే ఆశలొదిలేసుకుంటామని, కొన్నిసార్లు మొత్తం దేశమే ఓటమిని ఒప్పుకున్నట్టుగా కనిపిస్తుందని తక్కువ చేసి మాట్లాడారామె.
భారతీయుల పట్ల ఆ రాచకుటుంబం భావన ఇదీ! తమను పాలకులుగా భావించుకుంటూ నిత్యం ప్రజలను కించపరిచిన చరిత్ర గాంధీ కుటుంబానిది. నెహ్రూ, ఇందిరల ఈ భావజాలమే కాంగ్రెస్‌కూ పాకింది. గాంధీ కుటుంబం చేతిలో బందీగా మారిన ఆ పార్టీ ప్రజల ఆకాంక్షలను, విజయాలను ఎప్పుడూ గుర్తించలేదు. గుర్తించజాలదు కూడా. భారతీయుల శక్తిసామర్థ్యాలను గుర్తించడంలో ఇందిర ఘోరంగా విఫలమయ్యారు గానీ నేటి కాంగ్రెస్ నేతలను మాత్రం అప్పట్లోనే ఆమె సరిగ్గా అంచనా వేశారనిపిస్తుంది!
ఎందుకంటే ఆమె వ్యాఖ్యలు వారికి అతికినట్టుగా సరిపోతాయి’’ అని మోదీ అన్నారు. భారత్, భారతీయుల శక్తి సామర్థ్యాలపై తనకు అపారమైన విశ్వాసముందని చెప్పారు. ప్రధానిగా తన మూడో టర్ములో భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ఇది తన హామీ అని మోదీ చెప్పారు. కాంగ్రెస్ మాత్రం అధికారంలో ఉండగా పెద్దగా ఆలోచించేందుకు కూడా జంకిందని ఎద్దేవా చేశారు. దాని తీరు చూస్తే జాలేస్తోందన్నారు.
‘‘కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు చేసిన తప్పులన్నింటినీ మా తొలి టర్ములో సరిదిద్దుతూ వచ్చాం. రెండంకెలకు చేరిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశాం. రెండో టర్ములో నూతన భారతానికి పటిష్టమైన పునాదులు వేశాం. ఇక మూడో టర్ములో వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా సాగుతాం’’ అంటూ భవిష్యద్దర్శనం చేశారు. జీఎస్టీ, డిజిటైజేషన్, పెండింగ్ పథకాల పూర్తి వంటి పలు ఘనతలు తమ సొంతమన్నారు. తమ కృషి వల్ల భారత్ నేడు అంతర్జాతీయంగా ఇన్నొవేషన్లకు, పరిశోధనలకు, తయారీ రంగానికి కేంద్రంగా రూపుదిద్దుకుందన్నారు. స్వచ్ఛ ఇంధనం, సెమీ కండక్టర్ల వంటి పలు రంగాల్లో స్వావలంబన సాధించాల్సి ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment