పట్టాలు తప్పిన మూడు కోచ్‌లు
9 మంది దుర్మరణం.. 41 మందికి గాయాలు
న్యూజల్పాయ్‌గురి/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న గూడ్స్ రైలు రెడ్ సిగ్నల్‌ను జంప్ చేసి అదే ట్రాక్‌పై నిలిచిఉన్న కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. త్రిపురలోని అగర్తలా నుంచి బెంగాల్‌లోని సీల్డాకు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఇందులో ఒక గార్డు కోచ్, రెండు పార్సల్ కోచ్‌లు ఉన్నాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికుల కోచ్‌లకు నష్టం వాటిల్లలేదు.
ఉత్తర బెంగాల్‌లో న్యూజల్పాయ్‌గురి రైల్వేస్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని రంగపాణి స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు. గూడ్సు రైలు లోకో పైలట్, ఎక్స్‌ప్రెస్ రైలు గార్డుతోపాటు ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. రైలు ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రైల్వేశాఖతోపాటు పశ్చిమ బెంగాల్ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. కోచ్‌ల్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
రెడ్ సిగ్నల్ పడినా..
గూడ్సు రైలు లోకో పైలట్ నిర్లక్ష్యం వల్లే రైలు ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో మానవ తప్పిదం ఉండొచ్చని, రెడ్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ లోకో పైలట్ ఆగకుండా ముందుకు దూసుకెళ్లడంతో ఎక్స్‌ప్రెస్ రైలును వెనుకనుంచి ఢీకొట్టినట్లు భావిస్తున్నామని రైల్వే బోర్డు చైర్‌పర్సన్ జయవర్మ సిన్హా చెప్పారు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు చోటుచేసుకున్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
ఒకే సింగిల్ ట్రాక్‌పై రెండు రైళ్లు అత్యంత సమీపంలోకి వచ్చేలా సిగ్నల్ ఎలా ఇచ్చారన్న దానిపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద తీవ్రతకు కాంచనజంగ్ ఎక్స్‌ప్రెస్ చివరి భాగంలోని మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. రెండు కోచ్‌లు పూర్తిగా పక్కకు ఒరిగిపోగా, మరో కోచ్ గాల్లోకి లేచి అలాగే వేలాడుతోంది. గూడ్సు రైలు ఇంజన్ దానికిందికి చొచ్చుకొచి్చంది. వేలాడుతున్న కోచ్‌ను అధికారులు తొలగించారు. మధ్యాహ్నం 12.40 గంటలకు మిగిలిన కోచ్‌లతో ఎక్స్‌ప్రెస్ రైలు ఘటనా స్థలం నుంచి కోల్‌కతా వైపు ప్రయాణం సాగించింది.
కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ దర్యాప్తు
ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించడానికి రైల్వేశాఖ మంత్రి వైష్ణవ్ రంగంలోకి దిగారు. లిఫ్ట్ అడిగి బైక్‌పై ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షల చొప్పున, స్వల్పగాయాలైన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి దిగ్భ్రాంతి
సాక్షి, న్యూఢిల్లీ: పశి్చమ బెంగాల్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేíÙయా, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
ఇదంతా మోదీ సర్కారు నిర్వాకం: కాంగ్రెస్
బెంగాల్ రైలు ప్రమాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం రైల్వేశాఖను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. మోదీ పదేళ్ల పాలనలో రైల్వేశాఖ తల్లిదండ్రులు లేని అనాథగా మారిందని సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. రైల్వే శాఖ గత వైభవాన్ని కోల్పోయిందన్నారు.
ఆ మార్గంలో ‘కవచ్’ లేదు
రైళ్లు పరస్పరం ఢీకొట్టకుండా కవచ్ వ్యవస్థను రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. అయితే, గౌహతి–ఢిల్లీ మార్గంలో ఈ వ్యవస్థను ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు. కాంచనజంగ ప్రమాదం జరిగిన ప్రాంతం ఇదే మార్గంలో ఉంది.
కొంపముంచిన టీఏ912 లెటర్!
కాంచనజంగ రైలు ఘటనలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం వెనుక గూడ్సు రైలు లోకో పైలట్ తప్పిదం లేదని తెలుస్తోంది. రాణిపాత్ర స్టేషన్, ఛత్తర్‌హట్ జంక్షన్ మధ్యలో కాంచనజంగ రైలును గూడ్సు రైలు ఢీకొట్టింది. అయితే, సోమవారం ఉదయం 5.50 గంటల నుంచి ఈ మార్గంలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో రెడ్‌సిగ్నల్ ఉన్నప్పటికీ ముందుకెళ్లాలని లోకో పైలట్‌కు సూచించినట్లు వెల్లడయ్యింది.
ఈ మేరకు రైల్వేశాఖ అంతర్గత నివేదిక ఒకటి వెలుగులోకి వచి్చంది. ఈ నివేదిక ప్రకారం.. రాణిపాత్ర స్టేషన్ మాస్టర్ టీఏ912 పేరిట లోకో పైలట్‌కు లిఖితపూర్వక ఆదేశాలిచ్చారు. రాణిపాత్ర స్టేషన్, ఛత్తర్‌హట్ జంక్షన్ మధ్యలో ఏ సిగ్నల్ పడినా దాటుకొని ముందుకెళ్లాలని పేర్కొన్నారు. అదే ట్రాక్‌పై మరో రైలు లేకపోతే సిగ్నల్‌తో సంబంధం లేకుండా ముందుకెళ్లడానికి టీఏ912 లెటర్ జారీ చేస్తుంటారని రైల్వేవర్గాలు వెల్లడించాయి.
ప్రమాదం జరిగిన ట్రాక్‌పై అంతకుముందే ఒక రైలు వెళ్లింది. మరో సెక్షన్‌లోకి ప్రవేశించింది. దాంతో ట్రాక్‌పై రైలు లేదన్న అంచనాతో స్టేషన్ మాస్టర్ టీఏ912 జారీ చేసినట్లు అనుమానిస్తున్నారు. కాంచనజంగ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 8.27 గంటలకు రంగపాణి స్టేషన్‌ను దాటేసింది. రాణిపాత్ర స్టేషన్, ఛత్తర్‌హట్ జంక్షన్ మధ్యలో ట్రాక్‌పై నిలిచిపోయింది. ఎందుకు నిలిచిందన్నది తెలియడంలేదు. గూడ్సు రైలు ఉదయం 8.42 గంటలకు రంగపాణి స్టేషన్‌ను దాటేసి సరిగ్గా 8.55 గంటలకు కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఏడాది క్రితం జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనను గుర్తుకుతెచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment