పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్‌కు ర్యాలీ
న్యూఢిల్లీ: ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో మాట్లాడనీయకుండా ప్రభుత్వం.. ప్రతిపక్షాల గొంతు నొక్కేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన అభివర్ణించారు. 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలనే డిమాండ్‌తో విపక్షపార్టీల నేతలు మంగళవారం ఢిల్లీలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం నుంచి విజయ్ చౌక్‌కు నడిచి వెళ్లారు. నిరసన ర్యాలీలో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తప్పుబడుతూ నినాదాలిచ్చారు.
‘సభ్యుల సస్పెన్షన్ అంశాన్ని ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రస్తావించనివ్వట్లేదు. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. ప్రతిపక్షాల గళం వినిపించక ప్రస్తుతం ఈ సమావేశాల్లో పార్లమెంట్ కేవలం ఒక కట్టడంలా, ఒక మ్యూజియంలా మిగిపోయింది. ప్రధాని మోదీ అసలు పార్లమెంట్‌కే రావడం మానేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపే విధానం ఇది కాదు’ అని రాహుల్ ఆగ్రహంగా మాట్లాడారు.
పార్లమెంట్‌లో ప్రభుత్వంపై విపక్షాల వ్యూహం కోసం విపక్ష పార్టీల నేతలతో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సమావేశమయ్యారు. ఢిల్లీలో సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీలో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, శివసేన నేత సంజయ్ రౌత్, డీఎంకే నేత టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున రాహుల్, ఖర్గే సైతం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment