
చెన్నై: గవర్నర్ల వ్యవహార శైలిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లకి మాట్లాడడానికి నోరు ఉందే తప్ప వినడానికి చెవుల్లేవని వ్యంగ్యస్త్రాలు విసిరారు. అందుకే గవర్నర్లందరూ ఎక్కువగా మాట్లాడుతూ తక్కువగా వింటున్నారని వ్యాఖ్యానించారు. ఆన్‌లైన్‌లో జూదం నిరోధక బిల్లుని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి వెనక్కి తిప్పి పంపిన నేపథ్యంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉంగలిల్ ఒరువన్ అనే కార్యక్రమంలో గురువారం పాల్గొన్న స్టాలిన్ ప్రజలు వేసే ప్రశ్నలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాధానాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకోకూడదని ఇటీవల సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలకు గవర్నర్లు కట్టుబడి ఉన్నారా? అని ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశ్నకు స్టాలిన్ స్పందిస్తూ కొందరు గవర్నర్ల వ్యవహార శైలి చూస్తుంటే వారికి నోరు ఉందే తప్ప చెవులు లేవని అనిపిస్తోందని అన్నారు.
ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీశ్ సిసోడియా అరెస్ట్‌ను ఆయన ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీలను బీజేపీ బహిరంగంగానే ఎలా హెచ్చరిస్తుందో సిసోడియా అరెస్ట్ నిలువెత్తు నిదర్శనమని అన్నారు. రాజకీయ కారణాల కోసం దర్యాప్తు సంస్థల్ని బీజేపీ వాడుకుంటోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై ఎన్నికల్లో గెలవడానికి బదులుగా, దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించి విజయం సాధించాలని చూడడమేంటని ప్రధాని మోదీకి లేఖ రాసినట్టుగా స్టాలిన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment