
న్యూఢిల్లీ: దేశ ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో సైనిక బలగాల పూర్తిస్థాయి యుద్ధసన్నద్ధతకు అవసరమైన ఆయుధ సామగ్రిని రూ.28వేల కోట్లతో కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తం రూ.28,732 కోట్లతో ఆర్మీకి స్వార్మ్ డ్రోన్లు, అత్యాధునిక కార్బైన్ తుపాకులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను సమకూర్చనున్నారు. ఈ ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) మంగళవారం ఆమోదం తెలిపింది. నాలుగు లక్షల క్లోజ్–క్వార్టర్ కార్బైన్ తుపాకులతో సంప్రదాయ, హైబ్రిడ్ యుద్ధతంత్రంతోపాటు సరిహద్దులోని తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు వీలవుతుందని రక్షణ శాఖ తెలిపింది.
ఆత్మనిర్భర్‌లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని చిన్న ఆయుధ ఉత్పత్తి పరిశ్రమకు ఊతం ఇచ్చినట్లవుతుందని పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి శత్రు స్నైపర్ల నుంచి మన బలగాలకు ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు, సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేత సమయాల్లో ఆర్మీకి అవసరమైన అత్యున్నత ప్రమాణాలతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కూడా కొనుగోలు చేస్తున్నట్లు వివరించింది. ఆధునిక యుద్ధతంత్రంలో సైన్యం సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు అత్యాధునిక డ్రోన్లను కూడా సమకూర్చుకోనున్నట్లు కేంద్రం పేర్కొంది. కోల్‌కతా క్లాస్ యుద్ధ నౌకల కోసం 1,250 కిలోవాట్ సామర్థ్యం కలిగిన మెరైన గ్యాస్ టర్బైన్ జనరేటర్‌ను, ఇంకా 14 ఫాస్ట్ పెట్రోల్ పడవలను కూడా దేశీయంగా సమకూర్చుకుంటామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment