bullet proof jackets
-
తొలిసారిగా మహిళా సైనికుల కోసం బుల్లెట్ ప్రూఫ్!
ఇంతవరకు పురుషులకే సాయుధ సూట్ ఉంది. దాన్నే మహిళలు వినియోగించేవారు. అదీగాక సాయుధ విభాగంలో మహిళల సంఖ్య తక్కువగానే ఉండటంతో వారికి ప్రత్యేకంగా ఎలాంటి సాయుధ సూట్లు లేవు. అయితే ప్రపంచదేశాల దృష్టిని ఒక్కసారిగా తిప్పుకున్న సంగ్రామమే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఈ యుద్ధం యావత్తు ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసేలా ఇరు దేశాల మధ్య మొదలైంది. ఎందరూ ఏవిధంగా చెప్పినా ఆంక్షలు విధించినా.. యుద్ధానికి సై అంటూ రష్యా అధ్యుకుడు వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్‌తో కయ్యానికి దిగాడు. చిన్న దేశంపై అంత ఆగ్రహం వలదన్నా.. అంగీకరించకపోగా..ఆ దేశంపై అణ్వాయుధ దాడికి దిగుతానని ప్రకోపించింది రష్యా. ఇంతటి విపత్కర స్థితిలో సైతం ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీకి మద్దతులగా ప్రజలు నిలిచారు. తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తామని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆయుధాలను చేతబూని యుద్ధం చేసేందుకు రెడీ అయ్యారు. ఆ దేశ ప్రజల ధైర్య సాహసాలు, గుండె నిబ్బరం ప్రపంచ దేశాల్నీ కదిలించాయి. అంతేగాదు తాము సైతం సాయం చేస్తామని ఉక్రెయిన్ కోసం ముందుకొచ్చాయి. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక విషయమై ఉక్రెయిన్ వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తూనే ఉంది. ఇప్పుడూ తాజాగా మహిళ సైనికుల కోసం బుల్లెట్ ప్రూఫ్( రక్షణ కవచం) ప్రవేశపెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది. ఉక్రెయిన్ యుద్ధంలో టీనేజ్ యువత తోపాటు మహిళలు కూడా మాతృదేశం కోసం తమ వంతుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. పురుషుల ఫిజిక్‌కి తగ్గట్టుగా ఉన్న రక్షణ కవచమే స్త్రీలు కూడా ధరించాల్సి వచ్చేది. వారికంటూ ప్రత్యేకంగా సాయుధ సూట్ లేదు. ఆ లోటును భర్తీ చేసింది ఉక్రెయిన్. వారు కూడా పురుషుల మాదిరిగా అనువుగా ఉండే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించేలా రూపొందించింది. దీన్ని వారు ఈజీగా తొలగించగలరు, ధరించగలిగేలా రూపొందించింది. అలాగే వారికెలాంటి ఇబ్బందిలేకుండా అనువుగా యుద్ధం చేసేలా ఉంటుందట. మహిళల మానవ శరీర నిర్మాణానికి అనుగుణంగా కవచం ఉండటమే గాక భూజం పట్టీలతో, సాయుధ లోడ్ బేరింగ్ బెల్ట్ కూడా ఉంటుంది. యుద్ధంలో పాల్గొనే మహిళ శరీర సైజులకు అనుగుణంగా ఈ సాయుధ సూట్లు అందుబాటులో ఉంచింది. ఒక యుద్ధం తెలియకుండానే కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. యుద్ధం నష్టాన్నే గాక కొంగొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు మూలంగా మారుతుంది కూడా. 'అవసరం' ఎంతకైనా తెగించేలా చేస్తుంది. పైగా అదే ఆలోచనకు, ఆవిష్కరణలకు నాంది పలుకుంతుంది అంటే ఇదే కాబోలు. Ukrainian women's armor For the first time in Ukraine, a female armored suit is produced. This armor cover is designed considering the anatomy and physiology of the female body and has a 500% increase in the level of protection against shrapnel, which significantly 1/2#war pic.twitter.com/MFmvCJqkdZ — maryam (@maryam321321) September 3, 2023 (చదవండి: "విమానాన్నే ఇల్లుగా మార్చేశాడు"..అందుకోసం ఏకంగా..) -
రూ.28 వేల కోట్ల ఆయుధ కొనుగోళ్లకు పచ్చజెండా
న్యూఢిల్లీ: దేశ ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో సైనిక బలగాల పూర్తిస్థాయి యుద్ధసన్నద్ధతకు అవసరమైన ఆయుధ సామగ్రిని రూ.28వేల కోట్లతో కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తం రూ.28,732 కోట్లతో ఆర్మీకి స్వార్మ్ డ్రోన్లు, అత్యాధునిక కార్బైన్ తుపాకులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను సమకూర్చనున్నారు. ఈ ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) మంగళవారం ఆమోదం తెలిపింది. నాలుగు లక్షల క్లోజ్–క్వార్టర్ కార్బైన్ తుపాకులతో సంప్రదాయ, హైబ్రిడ్ యుద్ధతంత్రంతోపాటు సరిహద్దులోని తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు వీలవుతుందని రక్షణ శాఖ తెలిపింది. ఆత్మనిర్భర్‌లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని చిన్న ఆయుధ ఉత్పత్తి పరిశ్రమకు ఊతం ఇచ్చినట్లవుతుందని పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి శత్రు స్నైపర్ల నుంచి మన బలగాలకు ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు, సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేత సమయాల్లో ఆర్మీకి అవసరమైన అత్యున్నత ప్రమాణాలతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కూడా కొనుగోలు చేస్తున్నట్లు వివరించింది. ఆధునిక యుద్ధతంత్రంలో సైన్యం సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు అత్యాధునిక డ్రోన్లను కూడా సమకూర్చుకోనున్నట్లు కేంద్రం పేర్కొంది. కోల్‌కతా క్లాస్ యుద్ధ నౌకల కోసం 1,250 కిలోవాట్ సామర్థ్యం కలిగిన మెరైన గ్యాస్ టర్బైన్ జనరేటర్‌ను, ఇంకా 14 ఫాస్ట్ పెట్రోల్ పడవలను కూడా దేశీయంగా సమకూర్చుకుంటామని తెలిపింది. -
ఉక్రెయిన్‌కు ఆ దేశం ఫుల్ సపోర్ట్.. రష్యా బలగాలకు ఊహించని ట్విస్ట్
టోక్యో: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు రెచ్చిపోయి దాడులు జరుపుతున్నాయి. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సామాన్య పౌరులు సైతం మృత్యువాతపడుతున్నారు. ఉక్రెయిన్ సైన్యం వెనక్కి తగ్గకపోవడంతో రష్యా సైనికులు వేల సంఖ్యలో మరణించినట్టు ఆ దేశం పేర్కొంది. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు పలు దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఇప్పటికే రొమేనియా.. ఉక్రెయిన్‌కు భారీ ఆర్థిక సాయంతో పాటుగా దాడుల్లో గాయపడిన వారికి వైద్య సాయం అందిస్తామని తెలిపింది. అలాగే తాగునీరు, బుల్లెట్‌ఫ్రూప్ జాకెట్లు, హెల్మెట్లు, చమురును అందిచనున్నట్టు పేర్కొంది. తాజాగా ఉక్రెయిన్‌కు సాయంగా రక్షణ సామగ్రి పంపుతూ జపాన్ అసాధారణ నిర్ణయం తీసుకుంది. సంక్షోభంలో ఉన్న దేశాలకు రక్షణ సామగ్రిని అందజేయొద్దన్న స్వీయ నియమాన్ని పక్కన పెట్టి మరీ బుల్లెట్‌ఫ్రూప్ జాకెట్లు, హెల్మెట్లు, టెంట్లు, జనరేటర్లు, ఆహారం, దుస్తులు, మందులు వంటివి పంపింది. మరోవైపు.. రాజధాని కీవ్, ఖర్కీవ్ నగరాలు రష్యా దాడులతో అట్టుడుకుతున్నాయి. శుక్రవారమంతా ఎడతెరిపి లేని బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. కీవ్‌లో అయితే కనీసం ప్రతి 10 నిమిషాలకు ఒక పేలుడు జరిగిందని సమాచారం. రాజధానిని ఆక్రమించేందుకు 15 వేలకు పైగా అదనపు బలగాలు తాజాగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. నగరానికి వాయవ్యంగా క్షిపణి దాడులు, యుద్ధ ట్యాంకుల బీభత్సం తీవ్రంగా ఉందని ఉక్రెయిన్ చెబుతోంది. రేవు పట్టణం మారిపోల్‌లోనూ, పలు ఇతర నగరాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. తిప్పికొడుతున్న ఉక్రెయిన్.. చెర్నిహివ్, మైకోలెయివ్ వంటి పలు నగరాల్లో రష్యా దాడిని ఉక్రెయిన్ సైన్యాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. అలాగే రేవు పట్టణం ఒడెసాలోనూ రష్యా సైన్యాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. నౌకలపై నుంచి నగరంపైకి రష్యా దాడులకు దిగుతోంది. రష్యా సైనికులకు ఆహారం, నిత్యావసరాలు అందకుండా చేస్తూ వారిని నీరసింపజేసే వ్యూహాన్ని ఉక్రెయిన్ ఎక్కడికక్కడ అమలు చేస్తోంది. -
తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత..
న్యూఢిల్లీ : సరిహద్దులో కాపలా కాసే సైనికుల కోసం భారత ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లను సైనికులకు అందించాలన్న ప్రభుత్వం ఆశ తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత నెరవేరబోతుంది. ఈ మేరకు ‘మేకిన్ ఇండియా’ లో భాగంగా ప్రభుత్వం ఎస్ఎంపీపీ అనే ఢిల్లీకి చెందిన ప్రైవేటు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆర్డర్ విలువ రూ.639 కోట్లు. మొత్తం బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను మూడు సంవత్సరాల్లో సైనికులకు అందేలా ఒప్పందం కుదిరిందని కంపెనీ తెలిపింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అన్ని రకాల బుల్లెట్లను తట్టుకునేలా తయారు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. బోరాన్ కార్బైడ్ సెరామిక్ మెటీరియల్‌తో బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ తయారు చేయడం వల్ల తేలికగా ఉంటుందని అలాగే బాలిస్టిక్ ప్రొటెక్షన్ కూడా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఒప్పందంలో భాగంగా 1.86 లక్షలకు పైగా బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను కంపెనీ ఆర్మీకి అందించనుంది. కొత్త బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లలో మాడ్యులర్ భాగాలు ఉంటాయని, దీని వల్ల మరింత భద్రత లభిస్తుందని, వివిధ పరిస్థితుల్లో సైనికులకు కూడా ధరించడానికి సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. లేటెస్ట్ హార్డ్ స్టీల్ కోర్ బుల్లెట్లను కూడా తట్టుకునేలా ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను రూపొందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. 2009లో 1.86 లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలన్న భారత ఆర్మీ ప్రతిపాదనకు అప్పటి ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ ఆర్మీ నిర్వహించిన ట్రయల్ టెస్టుల్లో బుల్లెట్ ఫ్రూప్ జాకెట్లు తయారు చేసే కంపెనీలు ఆ స్థితికి చేరుకోలేకపోయాయి. బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ల అందిస్తామని ముందుకు వచ్చిన నాలుగు కంపెనీల్లో ఒక్క కంపెనీ మాత్రమే మొదటి రౌండ్లో పాసైంది. ఆ కంపెనీ కూడా రెండో రౌండ్లో ఫెయిల్ కావడంతో ఆ విషయం అప్పటి నుంచి మరుగున పడిపోయింది. 2016, మార్చిలో ఆర్మీ సుమారు 50 వేల బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను కొనుగోలు చేసింది. ఇవి కూడా అనుకున్న స్టాండర్డ్స్‌ను అందుకోలేకపోయాయి. ప్రస్తుత భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా ఒప్పందంలో భాగంగా రానున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో భారత సైనికుల విశ్వాసం పెరగడంతో పాటు, భద్రతా దళాలకు నైతిక ప్రాబల్యాన్ని అందిస్తుందనడంతో సందేహం లేదు. -
నాణ్యతలేని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వెనక్కి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర పోలీసుల కోసం కొనుగోలుచేసిన 4,600 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లలో 1,430 తిరిగి కంపెనీకి పంపించారు. అందుకు ప్రధాన కారణం ఈ జాకెట్లకు అత్యాధునిక ఏ.కే .–47 రైఫిల్ బుల్లెట్లను తట్టుకునే సామర్థ్యం లేకపోవడంతో వాటిని పోలీసులు తిరిగి కంపెనీకి పంపించినట్లు అదనపు డీజీ వి.వి.లక్ష్మీనారాయణ వెల్లడించారు. 2008 నవంబరు 26వ తేదీన ముంబైలో ఉగ్రవాదులు దాడులుచేసి అనేక మంది అమాయకులను పొట్టన బెట్టుకున్నారు. ఇందులో కొందరు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు కూడా హతమయ్యారు. దీంతో పోలీసుల రక్షణ కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనుగోలు చేయాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిధులు కేటాయించి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కొనుగోలుకు మంజూరు చేశారు. దీంతో కాన్పూర్‌లోని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీ కంపెనీకి రూ.17 కోట్లు చెల్లించి 4,600 జాకెట్లను కొనుగోలు చేశారు. ఈ కంపెనీ కేంద్ర భద్రత దళానికి జాకెట్లు సరఫరా చేస్తుంది. కస్టం డ్యూటీ, ఇతర పన్నులు చెల్లించి మొత్తం 4,600 జాకెట్లను పోలీసు శాఖకు అందజేశారు. ఎట్టకేలకు తొమ్మిదేళ్ల తరువాత మహారాష్ట్ర పోలీసు శాఖకు ఆధునిక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందుబాటులోకి రానున్నాయి. కానీ వాటిని పోలీసులకు అందజేసే ముందు చంఢీగడ్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు. అందులో 3,170 జాకెట్లు ఏకే–47 బుల్లెట్లను అడ్డుకోవడంలో సఫలీకృతమయ్యాయి. మిగతా 1,430 జాకెట్లు ఆ బుల్లెట్లను అడ్డుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో అందులో నాణ్యత లోపం ఉందని స్పష్టం కావడంతో వాటిని తిరిగి కాన్పూర్‌కు పంపించారు. వాటికి బదులుగా నాణ్యమైన జాకెట్లు అందజేయాలని ఆ కంపెనికి సూచించినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. కాగా కొనుగోలు చేసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను గడ్చిరోలి, ఇతర నక్సలైట్ల ప్రాబల్యమున్న ప్రాంతంలో విధులు నిర్వహించే పోలీసులకు, ముంబై పోలీసు శాఖలో క్విక్ రెస్పాన్స్ టీం, ఫోర్స్ వన్ కమాండోలకు అందజేయనున్నారు. -
ఖాకీల చేతిలో ఆయుధం
♦ ‘సిమీ’ కీటకాలను కాలరాసేందుకు సిద్ధమవుతున్న సైన్యం ♦ నల్గొండ ఘటనతో అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం ♦ ఎస్సై స్థాయి నుంచి ప్రతి ఒక్కరికీ తుపాకీ తప్పనిసరి ♦ ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సాక్షి, విశాఖపట్నం : చేతిలో ఆయుధం లేకపోయినా ఉగ్ర మూకలకు ఎదురొడ్డి..పోరాడి ప్రాణాలు విడిచిన పోలీసు అమర వీరుల త్యాగం నిద్రాణంలో ఉన్న ఆ శాఖను మేల్కొలుపుతోంది. నష్టం జరిగిన తర్వాత ఎంతగా విచారించినా ఫలితం శూన్యం అని తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు తమ సత్తా ఏమిటో చూపిం చాలని నిర్ణయించారు. గుండె ధైర్యానికి ఆయుధాన్ని జోడిస్తున్నారు. మ్కుర మూ కల ఆట కట్టించేందేకు కదం తొక్కుతున్నారు. సిటీ పరిధిలో పోలీస్ కమిషనర్, ముగ్గురు డీసీపీలు, ముగ్గురు ఏడీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 17 స్టేషన్లు, ఒక్కో స్టేషన్‌కు ఇద్దరు ముగ్గురు ఎస్సైలు , వందలాది మంది కానిస్టేబుళ్లు నగరాన్ని నేరస్థుల నుంచి కాచుకుంటున్నారు. జిల్లా పరిధిలో ఎస్పీ,డీఎస్పీలు స్పెషన్ బ్రాంచ్, గ్రేహౌండ్స్ దళాలతో కలిసి నేరస్థులు, మావోయిస్టులను ఎదుర్కొంటున్నారు. అయినా జిల్లా,సిటీ పరిధిలో నేరాలు జరుగుతూనే ఉన్నాయి. నేరస్థులు దర్జాగా తమ పనులు చక్కబెడుతూనే ఉన్నారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ నేరాల స్వరూపం వేరుగా ఉంటుంది. హత్యలు, మానభంగాలు, రౌడీయిజం వంటివి నామమాత్రంగానే కనిపిస్తుంటాయి. కానీ వైట్ కాలర్ నేరాలు, రియల్ ఎస్టేట్ దందాలు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వర్ధిల్లుతున్నాయి. మామూళ్లకు కక్కుర్తి పడే కొందరు ఖాకీలు వారికి అండగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నా ఎవరూ పట్టించుకోరు. ఇదంతా కేవలం అంతర్గత సమస్య. కానీ సిమీ తీవ్రవాదుల వంటి ముష్కరులను ఎదుర్కోవడం సమిష్టి బాధ్యతగా పోలీసు శాఖ భావిస్తోంది. ఈ నెల 8న పార్లమెంటరీ మీడియా లా సదస్సుకు విశాఖ వేదిక కానుంది. అనేక దేశాల ప్రతినిధులకు నగరం ఆతిధ్యమివ్వనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ముఖ్య నేతలు, ఉన్నతాధికారులు వస్తున్నారు. ఈ నేపధ్యంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇలాంటి సమయంలో సిమీ తీవ్రవాదుల కదలికలు కనిపించడంతో అప్రమత్తమైన అధికారులు జిల్లా,సిటీ పరిధిలోని ఎస్సై స్థాయి నుంచి ఆ పైన అధికారులందరికీ తుపాకీలు తప్పనిసరి చేశారు. సోమవారం నుంచి వారికి ఆయుధాలు అందజేస్తున్నారు. మంగళవారం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వనున్నారు. తనిఖీల సమయంలో ఆయుధంతో పాటు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించాల్సిందేనని చెప్పారు. అంతే కాకుండా రాత్రి గస్తీలో ఇవి తప్పనిసరి చేస్తూ సీపీ అమిత్‌గార్గ్ ఆదేశాలిచ్చారు. నగరంలో ఇప్పటికే విజువల్ పోలీసింగ్ ప్రారంభించి అనుమానిత ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. ఇంటిలిజెన్స్, నిఘా బృందాలను రంగంలోకి దింపారు. అనుమానిత వ్యక్తులపై నిఘా ముమ్మరం చేశారు. అవసరమైతే ముందస్తు అరెస్టులకు సిద్ధమవుతున్నారు.