బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన మహారాష్ట్ర పోలీస్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర పోలీసుల కోసం కొనుగోలుచేసిన 4,600 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లలో 1,430 తిరిగి కంపెనీకి పంపించారు. అందుకు ప్రధాన కారణం ఈ జాకెట్లకు అత్యాధునిక ఏ.కే .–47 రైఫిల్ బుల్లెట్లను తట్టుకునే సామర్థ్యం లేకపోవడంతో వాటిని పోలీసులు తిరిగి కంపెనీకి పంపించినట్లు అదనపు డీజీ వి.వి.లక్ష్మీనారాయణ వెల్లడించారు.
2008 నవంబరు 26వ తేదీన ముంబైలో ఉగ్రవాదులు దాడులుచేసి అనేక మంది అమాయకులను పొట్టన బెట్టుకున్నారు. ఇందులో కొందరు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు కూడా హతమయ్యారు. దీంతో పోలీసుల రక్షణ కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనుగోలు చేయాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిధులు కేటాయించి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కొనుగోలుకు మంజూరు చేశారు. దీంతో కాన్పూర్‌లోని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీ కంపెనీకి రూ.17 కోట్లు చెల్లించి 4,600 జాకెట్లను కొనుగోలు చేశారు. ఈ కంపెనీ కేంద్ర భద్రత దళానికి జాకెట్లు సరఫరా చేస్తుంది. కస్టం డ్యూటీ, ఇతర పన్నులు చెల్లించి మొత్తం 4,600 జాకెట్లను పోలీసు శాఖకు అందజేశారు.
ఎట్టకేలకు తొమ్మిదేళ్ల తరువాత మహారాష్ట్ర పోలీసు శాఖకు ఆధునిక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందుబాటులోకి రానున్నాయి. కానీ వాటిని పోలీసులకు అందజేసే ముందు చంఢీగడ్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు. అందులో 3,170 జాకెట్లు ఏకే–47 బుల్లెట్లను అడ్డుకోవడంలో సఫలీకృతమయ్యాయి. మిగతా 1,430 జాకెట్లు ఆ బుల్లెట్లను అడ్డుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో అందులో నాణ్యత లోపం ఉందని స్పష్టం కావడంతో వాటిని తిరిగి కాన్పూర్‌కు పంపించారు. వాటికి బదులుగా నాణ్యమైన జాకెట్లు అందజేయాలని ఆ కంపెనికి సూచించినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. కాగా కొనుగోలు చేసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను గడ్చిరోలి, ఇతర నక్సలైట్ల ప్రాబల్యమున్న ప్రాంతంలో విధులు నిర్వహించే పోలీసులకు, ముంబై పోలీసు శాఖలో క్విక్ రెస్పాన్స్ టీం, ఫోర్స్ వన్ కమాండోలకు అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment