బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ నమూనా
న్యూఢిల్లీ : సరిహద్దులో కాపలా కాసే సైనికుల కోసం భారత ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లను సైనికులకు అందించాలన్న ప్రభుత్వం ఆశ తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత నెరవేరబోతుంది. ఈ మేరకు ‘మేకిన్ ఇండియా’ లో భాగంగా ప్రభుత్వం ఎస్‌ఎంపీపీ అనే ఢిల్లీకి చెందిన ప్రైవేటు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆర్డర్ విలువ రూ.639 కోట్లు. మొత్తం బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను మూడు సంవత్సరాల్లో సైనికులకు అందేలా ఒప్పందం కుదిరిందని కంపెనీ తెలిపింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అన్ని రకాల బుల్లెట్లను తట్టుకునేలా తయారు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
బోరాన్ కార్బైడ్ సెరామిక్ మెటీరియల్‌తో బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ తయారు చేయడం వల్ల తేలికగా ఉంటుందని అలాగే బాలిస్టిక్ ప్రొటెక‌్షన్ కూడా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఒప్పందంలో భాగంగా 1.86 లక్షలకు పైగా బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను కంపెనీ ఆర్మీకి అందించనుంది. కొత్త బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లలో మాడ్యులర్ భాగాలు ఉంటాయని, దీని వల్ల మరింత భద్రత లభిస్తుందని, వివిధ పరిస్థితుల్లో సైనికులకు కూడా ధరించడానికి సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. లేటెస్ట్ హార్డ్ స్టీల్ కోర్ బుల్లెట్లను కూడా తట్టుకునేలా ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను రూపొందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
2009లో 1.86 లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలన్న భారత ఆర్మీ ప్రతిపాదనకు అప్పటి ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ ఆర్మీ నిర్వహించిన ట్రయల్ టెస్టుల్లో బుల్లెట్ ఫ్రూప్ జాకెట్లు తయారు చేసే కంపెనీలు ఆ స్థితికి చేరుకోలేకపోయాయి. బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ల అందిస్తామని ముందుకు వచ్చిన నాలుగు కంపెనీల్లో ఒక్క కంపెనీ మాత్రమే మొదటి రౌండ్‌లో పాసైంది. ఆ కంపెనీ కూడా రెండో రౌండ్‌లో ఫెయిల్ కావడంతో ఆ విషయం అప్పటి నుంచి మరుగున పడిపోయింది.
2016, మార్చిలో ఆర్మీ సుమారు 50 వేల బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను కొనుగోలు చేసింది. ఇవి కూడా అనుకున్న స్టాండర్డ్స్‌ను అందుకోలేకపోయాయి. ప్రస్తుత భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా ఒప్పందంలో భాగంగా రానున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో భారత సైనికుల విశ్వాసం పెరగడంతో పాటు, భద్రతా దళాలకు నైతిక ప్రాబల్యాన్ని అందిస్తుందనడంతో సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment