- ముగిసిన టీచర్ల కాంట్రాక్టు
- ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు కంప్యూటర్ పాఠాలు దూరం
పామర్రు : ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ కంప్యూటర్ శిక్షణ అందించాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ లక్ష్యం నీరుగారుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌తో బోధకుల గడువు ముగియడంతో కంప్యూటర్ విద్య మిథ్యగా మారింది. పలు పాఠశాలల్లో కంప్యూటర్ల గదులకు తాళాలు పడ్డాయి. లక్షలాది రూపాయల విలువైన కంప్యూటర్లకు బూజు పడుతోంది. టీచర్లు లేక ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అటకెక్కింది. ప్రభుత్వం సమకూర్చిన కంప్యూటర్ సామగ్రి, జనరేటర్లు నిరుపయోగంగా మారాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో బోధకుల కాంట్రాక్ట్ ముగియడంతో విద్యార్థులకు శిక్షణకు దూరమయ్యారు.
కార్పొరేట్‌కు దీటుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులనూ తీర్చిదిద్దాలనే ఆశయంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కంప్యూటర్ విద్యావిధానాన్ని ప్రవేశ పెట్టారు. పాఠాలు చెప్పేందుకు ఐదు సంవత్సరాల పాటు కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు సంస్థకు నిర్వహణ బాధ్యతను అప్పజెప్పారు.
జిల్లాలోని 236 సక్సెస్ పాఠశాలల్లో 472 మంది కంప్యూటర్ టీచర్లు పని చేసేవారు. ప్రస్తుతం వారి కాలపరిమితి ముగిసింది. తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడం వల్ల రోడ్డన పడ్డారు. పామర్రు మండల పరిధిలోని ఐదు జెడ్పీ పాఠశాలలో కంప్యూటర్ విద్యను ప్రారంభించారు. ఒక్కో పాఠశాలకు 11 కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు, జనరేటర్లను ప్రభుత్వం సమకూర్చింది. ఇద్దరు టీచర్లు కంప్యూటర్ శిక్షణ ఇచ్చేవారు. లెక్కలు, తెలుగు, ఇంగ్లిష్, కెమిస్ట్రీ తదితర సబ్జెక్టులను ఆడియో వీడియోల ద్వారా విద్యార్థులకు బోధన చేసేవారు. నెల నెలా పరీక్షలు కూడా నిర్వహించేవారు.
వైఎస్ అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కంప్యూటర్ విద్యపై దృష్టి పెట్టలేదు. వేతనాలు సరిపోవడం లేదని టీచర్లు నాలుగు నెలలు సమ్మె కంప్యూటర్ శిక్షణ కుంటు పడింది. ఆ తర్వాత ఐదేళ్ల కాంట్రాక్టు గత సెప్టెంబర్‌తో ముగియడంతో ప్రైవేటు సంస్థ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.
కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయులతో కంప్యూటర్ తరగుతులు కొనసాగించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చి చేతులు దులుపుకున్నారు. ఉపాధ్యాయుల్లో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేక శిక్షణ మూలనపడింది. పైగా ఇప్పటికే చాలా పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంది. కంప్యూటర్ విద్యకు సంబంధించిన ప్రత్యేక టీచర్లు ఉంటేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. కొత్త ప్రభుత్వం వెంటనే స్పందించి బోధకులను నియమించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.