♦ ‘సిమీ’ కీటకాలను కాలరాసేందుకు సిద్ధమవుతున్న సైన్యం
♦ నల్గొండ ఘటనతో అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం
♦ ఎస్సై స్థాయి నుంచి ప్రతి ఒక్కరికీ తుపాకీ తప్పనిసరి
♦ ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు
సాక్షి, విశాఖపట్నం : చేతిలో ఆయుధం లేకపోయినా ఉగ్ర మూకలకు ఎదురొడ్డి..పోరాడి ప్రాణాలు విడిచిన పోలీసు అమర వీరుల త్యాగం నిద్రాణంలో ఉన్న ఆ శాఖను మేల్కొలుపుతోంది. నష్టం జరిగిన తర్వాత ఎంతగా విచారించినా ఫలితం శూన్యం అని తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు తమ సత్తా ఏమిటో చూపిం చాలని నిర్ణయించారు. గుండె ధైర్యానికి ఆయుధాన్ని జోడిస్తున్నారు. మ్కుర మూ కల ఆట కట్టించేందేకు కదం తొక్కుతున్నారు. సిటీ పరిధిలో పోలీస్ కమిషనర్, ముగ్గురు డీసీపీలు, ముగ్గురు ఏడీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 17 స్టేషన్లు, ఒక్కో స్టేషన్‌కు ఇద్దరు ముగ్గురు ఎస్సైలు , వందలాది మంది కానిస్టేబుళ్లు నగరాన్ని నేరస్థుల నుంచి కాచుకుంటున్నారు.
జిల్లా పరిధిలో ఎస్పీ,డీఎస్పీలు స్పెషన్ బ్రాంచ్, గ్రేహౌండ్స్ దళాలతో కలిసి నేరస్థులు, మావోయిస్టులను ఎదుర్కొంటున్నారు. అయినా జిల్లా,సిటీ పరిధిలో నేరాలు జరుగుతూనే ఉన్నాయి. నేరస్థులు దర్జాగా తమ పనులు చక్కబెడుతూనే ఉన్నారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ నేరాల స్వరూపం వేరుగా ఉంటుంది. హత్యలు, మానభంగాలు, రౌడీయిజం వంటివి నామమాత్రంగానే కనిపిస్తుంటాయి. కానీ వైట్ కాలర్ నేరాలు, రియల్ ఎస్టేట్ దందాలు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వర్ధిల్లుతున్నాయి.
మామూళ్లకు కక్కుర్తి పడే కొందరు ఖాకీలు వారికి అండగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నా ఎవరూ పట్టించుకోరు. ఇదంతా కేవలం అంతర్గత సమస్య. కానీ సిమీ తీవ్రవాదుల వంటి ముష్కరులను ఎదుర్కోవడం సమిష్టి బాధ్యతగా పోలీసు శాఖ భావిస్తోంది. ఈ నెల 8న పార్లమెంటరీ మీడియా లా సదస్సుకు విశాఖ వేదిక కానుంది. అనేక దేశాల ప్రతినిధులకు నగరం ఆతిధ్యమివ్వనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ముఖ్య నేతలు, ఉన్నతాధికారులు వస్తున్నారు. ఈ నేపధ్యంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంది.
ఇలాంటి సమయంలో సిమీ తీవ్రవాదుల కదలికలు కనిపించడంతో అప్రమత్తమైన అధికారులు జిల్లా,సిటీ పరిధిలోని ఎస్సై స్థాయి నుంచి ఆ పైన అధికారులందరికీ తుపాకీలు తప్పనిసరి చేశారు. సోమవారం నుంచి వారికి ఆయుధాలు అందజేస్తున్నారు. మంగళవారం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వనున్నారు. తనిఖీల సమయంలో ఆయుధంతో పాటు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించాల్సిందేనని చెప్పారు. అంతే కాకుండా రాత్రి గస్తీలో ఇవి తప్పనిసరి చేస్తూ సీపీ అమిత్‌గార్గ్ ఆదేశాలిచ్చారు. నగరంలో ఇప్పటికే విజువల్ పోలీసింగ్ ప్రారంభించి అనుమానిత ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. ఇంటిలిజెన్స్, నిఘా బృందాలను రంగంలోకి దింపారు. అనుమానిత వ్యక్తులపై నిఘా ముమ్మరం చేశారు. అవసరమైతే ముందస్తు అరెస్టులకు సిద్ధమవుతున్నారు.
ఖాకీల చేతిలో ఆయుధం
Published Tue, Apr 7 2015 2:19 AM | Last Updated on Tue, Aug 21 2018 6:08 PM
Advertisement
Advertisement