లక్నో: హథ్రాస్ బాధితురాలి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన అత్యాచారం, హత్యకేసులో సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం బాధితురాలి కుటుంబానికి మూడంచెల భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో హథ్రాస్‌లోని భూల్గరీ గ్రామంలోని వారి ఇంటి ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసినట్లు హథ్రాస్ జాయింట్ కలెక్టర్ ప్రేమ్ ప్రకాశ్ మీనా తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల అంగీకారం లభించిన తర్వాతే ఈ మేరకు కెమెరాలు బిగించామని, అంతేగాక ఒక్కొక్కరికి ఇద్దరు కానిస్టేబుళ్లతో భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు.(చదవండి: బాధితురాలిపై కుటుంబ సభ్యులే దాడి చేశారు)
అదే విధంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న ప్రతీ ఒక్కరిని తనిఖీ చేసేందుకు మెటల్ డిటెక్టర్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక హథ్రాస్ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా, అక్టోబరు 8 నాటికి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు నివేదించాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం యూపీ సర్కారును ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగి ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేయడం గమనార్హం. (చదవండి: మెడకు దుపట్టా బిగించి లాక్కెళ్లారు..)
కాగా సెప్టెంబరు 14న హథ్రాస్‌కు చెందిన 19 ఏళ్ల దళిత యువతిపై ఆధిపత్య వర్గానికి చెందిన నలుగురు మృగాళ్లు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి, తీవ్రంగా గాయపరచగా, ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిన విషయం విదితమే. అనంతరం స్వస్థలానికి ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చిన పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడం పలు అనుమానాలకు తావిచ్చింది. (హథ్రాస్ : ‘సిట్’కు గడువు పొడిగింపు)
ఇక బాధితురాలిపై సామూహిక లైంగిక దాడి జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, ఫోరెన్సిక్ నివేదిక ఇందుకు భిన్నంగా ఉందని పోలీసులు చెప్పడం పట్ల దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆ గ్రామ పెద్ద అయితే ఏకంగా ప్రధాన నిందితుడితో బాధితురాలి ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు దారితీసిందని, ఆమె కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని వ్యాఖ్యానించడం పట్ల సర్వత్రా ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఆధిపత్య వర్గానికి చెందిన నిందితులను కాపాడేందుకు బాధితురాలి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని, సాక్ష్యాధారాలు మాయం చేసేందుకే హడావుడిగా అంత్యక్రియలు చేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.
భయంగా ఉంది.. ఎందుకు బతకాలి?
‘‘మాకు భయంగా ఉంది. అసలు ఎందుకు బతకాలో అర్థం కావడం లేదు. ఎక్కడైనా దూరంగా వెళ్లి బతుకుతాం. కష్టపడి పనిచేయడమే మాకు తెలుసు. కాబట్టి ఎక్కడైనా బతకగలం. అనుమానపు చూపులు, నిందలను భరించలేకపోతున్నాం. మా గురించి, మా కూతురు గురించి ప్రచారమవుతున్న వదంతులు బాధిస్తున్నాయి. అంతేగాకుండా మమ్మల్ని చంపేస్తామనే బెదిరింపులు కూడా వస్తున్నాయి’’అంటూ బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డకి జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరుకూడదని, ఈ ఘటన తరువాత తమ కుటుంబానికి సాయం చేసేందుకు గ్రామంలోని ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం కుంగదీసిందంటూ మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment