ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
అహ్మదాబాద్: తాగునీరు కలుషితమవడంతో ఆ నీరు తాగిన వారిలో నలుగురు మృతి చెందగా 72 మంది ఆస్పత్రిపాలయ్యారు. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని సూరత్ సమీపంలోని కఠోర్ గ్రామంలో చోటుచేసుకుంది. దీనిపై సూరత్ మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టారు. డ్రైనేజీ నీరు తాగునీటి పైప్‌లైన్‌లో కలవడంతో ఆ నీరు తాగిన వారి ప్రాణం మీదకు వచ్చిందని తేలింది. దీనిపై గుజరాత్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కఠోర్ గ్రామంలో ఆదివారం ప్రజలు పెద్ద ఎత్తున అస్వస్థతకు గురయ్యారు. వాంతులు.. విరేచనాలు చేసుకోవడంతో వారంతా ఆస్పత్రి బాట పట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిన్నాపెద్దా అందరూ ఆస్పత్రుల్లో చేరారు. చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమించి నలుగురు కన్నుమూశారు. మృతిచెందిన వారు గెమల్ వాసవ (45), హరీశ్ రాథోడ్ (42), మోహన్ రాథోడ్ (70) విజయ్ సోలంకి (38). చిన్నారులు అకస్మాత్తుగా నీరసంతో కిందపడిపోయారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారితో పాటు ఆ గ్రామంలోని ప్రజలందరికీ ఓఆర్‌ఎస్ పాకెట్లు పంపించారు. వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టారు. 250 నివాస ప్రాంతాలకు ఈ కలుషిత నీరు సరఫరా అయ్యిందని అధికారులు గుర్తించారు. డ్రైనేజీ నీటి పైపును తొలగించి స్వచ్ఛమైన తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు.
Comments
Please login to add a commentAdd a comment