driking water
-
నీరు కలుషితం: నలుగురు మృతి, 72 మంది ఆస్పత్రిపాలు
అహ్మదాబాద్: తాగునీరు కలుషితమవడంతో ఆ నీరు తాగిన వారిలో నలుగురు మృతి చెందగా 72 మంది ఆస్పత్రిపాలయ్యారు. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని సూరత్ సమీపంలోని కఠోర్ గ్రామంలో చోటుచేసుకుంది. దీనిపై సూరత్ మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టారు. డ్రైనేజీ నీరు తాగునీటి పైప్‌లైన్‌లో కలవడంతో ఆ నీరు తాగిన వారి ప్రాణం మీదకు వచ్చిందని తేలింది. దీనిపై గుజరాత్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కఠోర్ గ్రామంలో ఆదివారం ప్రజలు పెద్ద ఎత్తున అస్వస్థతకు గురయ్యారు. వాంతులు.. విరేచనాలు చేసుకోవడంతో వారంతా ఆస్పత్రి బాట పట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిన్నాపెద్దా అందరూ ఆస్పత్రుల్లో చేరారు. చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమించి నలుగురు కన్నుమూశారు. మృతిచెందిన వారు గెమల్ వాసవ (45), హరీశ్ రాథోడ్ (42), మోహన్ రాథోడ్ (70) విజయ్ సోలంకి (38). చిన్నారులు అకస్మాత్తుగా నీరసంతో కిందపడిపోయారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారితో పాటు ఆ గ్రామంలోని ప్రజలందరికీ ఓఆర్ఎస్ పాకెట్లు పంపించారు. వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టారు. 250 నివాస ప్రాంతాలకు ఈ కలుషిత నీరు సరఫరా అయ్యిందని అధికారులు గుర్తించారు. డ్రైనేజీ నీటి పైపును తొలగించి స్వచ్ఛమైన తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. -
‘ఆ టెండర్లు అన్నీ రద్దు చేస్తాం’
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం డ్రికింగ్ వాటర్ కార్పొరేషన్‌తో నిధులు తెచ్చి వాటిని పసుపు కుంకుమ పథకానికి మళ్లించారని పంచాయతీ రాజ్, గ్రామిణాభివృద్ధి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో తాగు నీరు కోసం కార్పొరేషన్ పెట్టి రూ.17,730 కోట్లకు టెండర్లు పిలిచారన్నారు. ఎన్నికల ముందు ఆగమేఘాల మీద ఏడు కన్సెల్టెన్సీలకు ఇచ్చారని ఆరోపించారు. ఇదంతా కమీషన్ల కోసమే చేశారన్నారు. గతంలో పిలిచిన టెండర్లను రద్దు చేసి తిరిగి కొత్తగా డీపీఆర్‌లను సిద్ధం చేసి ముందకెళ్తామని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా డీపీఆర్‌లను తయారు చేసి అన్ని గ్రామాలకు దశల వారిగా నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. -
35 గ్రామాలకు ఉప్పునీరే దిక్కు ..
సాక్షి, వాకాడు: పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వెరసి మండలంలోని 35 తీర ప్రాంత గ్రామాల్లో గత ఐదేళ్లుగా ఉప్పు జలగండం పట్టి పీడిస్తోంది. నాగరికత కొత్త పుంతలు తొక్కుతున్నా.. తీరప్రాంత వాసులకు గుక్కెడు మంచినీళ్లు దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండలంలో 68 గ్రామాల్లో 10.5 వేల కుటుంబాలు, 38 వేల మంది జనాభా నివసిస్తున్నారు. అందులో 204 చేతి పంపులు ఉండగా, వాటిలో 164 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. నిడిగుర్తి, రెడ్డిపాళెం, బాలాజీ నగర్, నిమ్మవానితిప్ప, వేణుగోపాల్‌పురం, నిడిగుర్తి గొల్లపాళెం, శ్రీహరిపురం, కొండూరుపాళెం, శ్రీనివాసపురం, దుగ్గరాజపట్నం, కొత్తూరు, అంజలాపురం, కాకివాకం, పంబలి, నిడిగుర్తి, శ్రీపురం, తీపలపూడి, మూలపడవ, రాజ్యలక్ష్మీపురం, మొనపాళెం, వైట్‌కుప్పం, నలగామల, పున్నమానితిప్ప, నిడిగుర్తి గొల్లపాళెం, రెడ్డిపాళెం, మాధవాపురం, ముట్టెంబాక, కల్లూరు, దుర్గవరం, పల్లెపాళెం ఇలా 35 గ్రామాల్లో వేసవి వస్తే సరి త్రాగునీరు ఉప్పునీరుగా మారిపోయి ప్రజలు అల్లాడుతుంటారు. ఐతే వీరి గురించి అధికార పక్షం నాయకులు గానీ, అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. వీరికి సురక్షిత మంచినీరు అందించేందుకు వాకాడు స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో స్వర్ణముఖి నదిలో ఏర్పాటు చేసిన పాత పైలెట్ ప్రాజెక్టు పట్ల పాలకులు, కాంట్రాక్టుల నిర్లక్ష్యం కారణంగా తాగునీరు సక్రమంగా అందడంలేదు. అక్కడక్కడ పైపు లైన్లు పగిలిపోయి మరమ్మత్తులకు గురైనప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా తీర గ్రామాల ప్రజలు దాహార్తితో అల్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి ట్యాంకర్లు ద్వారా నీటిని తెచ్చుకుని గొంతు తడుపుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో స్థానికులు, దాతల చందాలతో మంచినీరు దొరికే ప్రాంతాల్లో గ్రామస్తులే బోరు పాయింట్లు నిర్మించుకుని తాగునీరు తెచ్చుకుంటున్నారు. తీరప్రాంత గ్రామాల్లో భవన నిర్మాణాలు చేపట్టేందుకు ఉప్పునీరు పనికిరాదు. మండలంలో శాశ్వత తాగునీటి పరిష్కారం కొరకు వాకాడు స్వర్ణముఖి వద్ద మరో మంచినీటి ప్రాజెక్టు నిర్మించాలని మండల ప్రజలు కోరుచున్నారు. తాగేందుకు ఉప్పునీరే గతి స్నానాలు చేయాలన్నా.. వంట చేసుకోవాలన్నా ఉప్పునీరు కావడంతో చాలా ఇబ్బందిగా ఉంది. మంచినీళ్లు తాగి సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎప్పుడైనా పట్టణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మా త్రమే మంచినీళ్లు తాగుతున్నాం. మిగిలిన సమయంలో ఉప్పునీరే తాగుతున్నాం.– నల్లపురెడ్డి మునస్వామిరెడ్డి, వేణుగోపాలపురం ఇళ్లు కట్టుకోలేకపోతున్నాం గ్రామాల్లో లభిస్తున్న ఉప్పునీరు కారణంగా ఇళ్లు కట్టుకోలేకపోతున్నాం. సిమెంటులో ఉప్పునీరు కలిపితే నిర్మాణాలు దెబ్బతింటున్నాయి. మండలంలోని 35 గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. గత ఐదేళ్లుగా తాగునీటి సమస్య వెంటాడుతోంది. – మునస్వామి, ఓడపాళె ఆందోళన చేసినా పట్టించుకోలేదు గ్రామంలో తాగునీరు ఉప్పునీరుగా మారి ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతున్నాం. దీనిపై అనేక సార్లు ఆందోళన చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఉప్పునీరు తాగే బతుకుతున్నాం.– పోలయ్య మత్స్యకార కాపు, కొండూరుపాళెం -
పంద్రాగస్టుకు ఊళ్లకు.. దీపావళికి ఇళ్లకు..
సాక్షి, హైదరాబాద్ : మిషన్ భగీరథ పథకం ద్వారా దీపావళి(నవంబర్ 6) నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన రక్షిత నీటిని అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి అన్ని ఊళ్లకు భగీరథ నీటిని తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంద్రాగస్టు నుంచే ఇంటింటికీ ‘భగీరథ’ద్వారా నీటి సరఫరా చేస్తామని గతంలో ప్రకటించినా.. పనులు పూర్తి కాకపోవడంతో ముహూర్తాన్ని దీపావళికి మార్చారు. భగీరథ పనులపై మంగళవారం ప్రగతి భవన్లో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే చాలావరకు పనులు పూర్తయ్యాయని, మిగిలిన కొద్ది పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశిం చారు. ఇప్పటి వరకు నిర్మించిన ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఓహెచ్ఎస్ఆర్, ఓహెచ్‌బీఆర్, డిస్ట్రిబ్యూటరీ పైపులైన్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు అన్నింటినీ మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పనుల్లో అనుకున్నంత వేగం లేని ప్రాంతాల్లో భగీరథ వైస్ చైర్మన్, సెక్రటరీ, ఈఎన్సీ స్వయంగా పర్యటించాలని ఆదేశించారు. పలు ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతి, ఎదురవుతున్న ఇబ్బందులపై సీఎం నేరుగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వర్క్ ఏజెన్సీలతో మాట్లాడారు. పది జిల్లాల్లో పనులు వందకు వంద శాతం పూర్తవుతున్న నేపథ్యంలో కొద్దిరోజుల్లోనే ఆయా జిల్లాల్లో పథకాన్ని ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జె.సంతోశ్ కుమార్ అధికారులు శాంత కుమారి, స్మితా సభర్వాల్, కృపాకర్ రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, మిషన్ భగీరథ సలహాదారులు జ్ఞానేశ్వర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీరు కలుషితం
మల్కాపురం : యారాడ గ్రామంలోకి వచ్చే తాగునీటిని సేవించాలంటేనే గ్రామస్తులు ఆలోచించాల్సి వస్తోంది. పైపులైన్ ద్వారా వచ్చే నీటిని తాగితే ఎలాంటి రోగాలు దరిచేరుతాయోనన్న బెంగ వారిలో కనిపిస్తోంది. జీవీఎంసీ 45వ వార్డు యారాడ గ్రామ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులు ఐదేళ్ల క్రితం పలు చోట్ల పైపులైన్లు వేశారు. అయితే పీఎస్సార్ కాలనీ, స్థానిక జెడ్పీ పాఠశాల ప్రాంతాల్లో వేసి న పైపులైన్లు మాత్రం అక్కడున్న మురుగు కాలువలకు ఆనుకొని వేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో మురుగు నిలిచిపోతున్నప్పుడల్లా తాగు నీటిపై అనుమా నం వస్తోంది. ఆ మురుగు పైపులైన్ వాల్వ్‌ల వద్ద ఉన్న ప్లాంజ్ ద్వారా లోపలికి ప్రవేశించి నీటి సరఫరా జరిగే సమయంలో తాగునీటితో కలిసిపోతోంది. ఒక్కోసారి తాగునీరు మురుగు వాస న వస్తోందని గ్రామస్తులు చెబుతుండడమే ఇం దుకు ఉదాహారణ. మురుగుతో కలిసిపోయే నీటితే సేవించినందుకు గతంలో ఆయా ప్రాంత వాసులకు జ్వరాలు, వాంతులు వచ్చాయి. సమ స్య పరిష్కారం కోసం గ్రామస్తులు జీవీఎంసీ జోన్–4 జెడ్సీతో పాటు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు కూడా ఎన్నోమార్లు వివరించారు. అయినా స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు. మురుగునీరే వస్తోంది ఇక్కడకొచ్చే తాగునీరు మురుగునీటిలా వస్తోంది. ఆ నీరు తాగలేని పరిస్థితి ఉంది. గతేడాది వర్షాకాలంలో కాలువల్లో మురు గు అధికంగా నిల్వ ఉండిపోవడంతో వారం రోజుల పాటు ఆ నీటి నే పట్టాల్సి వచ్చింది. పిల్లలకు అనారోగ్యం వచ్చింది. -
నీటి ఎద్దడి భారత్.. జల సమృద్ధ ఇండియా..
సందర్భం భారత్ పట్టణీకరణకు గురవుతోంది. కానీ కొత్తగా ఏర్పడుతున్న నగరాలతో కాదు. ప్రస్తుతం ఉన్న నగరాల విస్తరణతో, పెరుగుతున్న జనసాంద్రతతో దేశంలో పట్టణీకరణ వ్యాప్తి చెందుతోంది. ఇది నగరాల నిర్వహణపై లోతైన ప్రశ్నలను సంధిస్తోంది. నిర్వహణ అంటే పౌర స్వయం పాలన అనేది అన్ని నగరాలకూ సమాన ప్రయోజనాలను అందివ్వడం అని అర్థం. స్వయం పాలన అంటేనే ప్రజాస్వామ్యం. ఈ కోణం లోంచి చూస్తే, మన నగరాలు ఒక సెక్షన్ పౌరుల జీవి తాలను మాత్రమే మెరుగుపరుస్తున్న స్థితిలో గ్రామాలు తమ వాటా ప్రయోజనాలను పొందకుండా మనం వాటిని కొల్లగొడుతున్నామా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఉదాహరణకు, మానవ మనుగడకు అతి ప్రధాన మైన వనరులలో తాగునీరు ఒకటి. మన నగరాలు మరింత వ్యవస్థీకృత పద్ధతిలో నీటిని పొందుతున్నారను కుందాం. అలాంటి పరిస్థితిలో కూడా ప్రతి ఒక్కరూ తమ వంతు వాటా పొందుతున్నట్లు చెప్పలేం. నగరాలలో నీటి సరఫరాలో వ్యత్యాసాలు ఉంటున్నాయి. తలసరి నీటి లభ్యత అనేది అత్యంత సగటు స్థితిలోనే అందుబాటులో ఉంటోందే తప్ప వాస్తవార్థంలో కాదు. నీటి తొట్టెల్లో స్నానం చేయగలిగిన వ్యక్తి మాత్రమే తలసరి పరిమాణం కంటే ఎక్కువ నీటిని పొందగలుగు తున్నట్లు లెక్క. కానీ పక్కనే పూరిగుడెసెల్లో ఉన్న వారుమాత్రం ఆ రోజుకు అవసరమైన తాగునీటికి సైతం ఎక్కడెక్కడికో పరుగులు తీయవలసిన పరిస్థితులు ఉంటున్నాయి. గణాంకాలు ఈ వివరాలను దాచిపెడు తుంటాయి. కానీ, ప్రత్యేకించి మహారాష్ట్ర వంటి ఒక పెద్ద రాష్ట్రానికి సంబంధించి నీటి సరఫరాలో స్థూల వ్యత్యా సాలను వివరించడానికి సాధారణంగా మనం గణాంకా లమీదే ఆధారపడాల్సి ఉంటుంది. మహారాష్ట్రలోని నగరాలు అక్కడి గ్రామాల కంటే 400 రెట్లు అధికంగా నీటిని పొందుతున్నాయని గణాంకాలు నివేదిస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా పట్టణీకరణకు గురయిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటున్నప్పటికీ మహారాష్ట్రలో గ్రామీణ-పట్టణ నిష్పత్తులు మాత్రం ఆ స్థాయి పరిమా ణంలో లేవు. నేటికీ మహారాష్ట్రలో 45 శాతం ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. పట్టణాల నీటి అవసరాల కోసం రిజర్వాయర్లు, సరస్సుల్లో నిల్వ చేసి ఉంచుతుంటారు కాని గ్రామీణ ప్రాంతాలకు మాత్రం అలాంటి సౌకర్యాలు ఏవీ లేవు. అంటే గ్రామాలు నేటికీ బావులు, గొట్టపుబావుల్లోని నీటిని మాత్రమే వాడుకుంటుంటారన్నది ఒక అంచనాపై ఆధారపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇదెలా ఉం టుందంటే రేషన్ షాపుల్లో నాసిరకం ధాన్యాలు మాత్రమే ఉంటున్నందున పేదలు వాటితోటే తమ కడుపు నింపు కుంటున్నారని చెబుతున్నట్లుగా ఉంటుంది. నా దృష్టిలో అలాంటి నీటివనరులపై ఆధారప డటం అంటే భరోసా ఉన్న రక్షిత నీటి సదుపాయం అని అర్థం కాదు. ఇది ఒక విధంగా తీవ్రమైన విధానపరమైన ఉపేక్షనే సూచిస్తుంది. అడుగంటుతున్న భూగర్భ జల వనరులను విచ్చలవిడిగా తోడేయకుండా క్రమబద్ధీకరిం చడానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ కూడా ఉంది. మరోవైపున ప్రజలు దానికి కట్టుబడాల్సి ఉంటుం దని భావిద్దాం. లభ్యమవుతున్న నీటి వనరులన్నింటినీ ఒక సెక్షన్ ప్రజలకే అందజేస్తూ, జనాభాలోని అతి పెద్ద విభాగం అవసరాలను తోసిపుచ్చడం ద్వారా ఇలాంటి వైరుధ్యాలను ఒక రాష్ట్రం ఎలా ఆమోదిస్తుందన్న విష యాన్ని ఇది వివరించడం లేదు. విషాదకరమైన విషయం ఏమిటంటే,నీటి ఎద్దడితో ఎండిపోయిన గ్రామాలనుంచి ముంబై వైపుగా భారీ నీటి గొట్టాలు సాగిపోతుంటాయి. గ్రామీణులు ఈ అన్యా యంపై అభ్యంతరం చెప్ప వచ్చు. కాని పట్టణ డిమాండ్ శక్తి ముందు వీరు మౌనం పాటిస్తుంటారు. ఇది మండ టానికి సిద్ధంగా ఉంటున్న వత్తుల పెట్టెలా మారవచ్చు. గ్రామీణ ప్రాంతం మొత్తంగా నీటికోసం అంగలా ర్చుతుండగా, ముంబై మెట్రో ప్రాంతం, పుణేతో కూడిన ఒక పరిమిత ప్రాంతం అత్యధికంగా నీటి సరఫరా పొందుతున్న స్థితిని పోల్చి చూస్తే ఈ వ్యత్యాసం స్థాయి ఏమిటో అర్థమవుతుంది. చివరకు ముంబై మెట్రోపాలి టన్ ప్రాంతం పరిధిలో కూడా తాగు నీరు తెచ్చుకోవడా నికి స్థానికులు దివా నుంచి కాల్వా ప్రాంతానికి లోకల్ రైలులో ప్రయాణిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చి చూస్తే 400 రెట్లు అధికంగా సరఫరా అవుతున్న నీటిలో సగంపైగా నీటిని ముంబై, పుణే మెట్రోపాలిటిన్ ప్రాంతాలు మాత్రమే తాగిపడేస్తున్నాయి. హైదరాబాద్‌లో చాలావరకు శివారు ప్రాంతాల్లో నీటి ట్యాంకులతో తాగునీటిని సరఫరా చేస్తుంటారు. కరువు కాలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వేళాపాళా లేకుండా వచ్చే నీటి ట్యాంకు కోసం ప్రజలు కళ్లలో వత్తులు వేసి మరీ చూస్తుంటారు. తమ వంతు తీసుకున్న తర్వాత బకెట్ నీళ్లు ఎప్పుడు దొరుకు తాయో అక్కడ ఎవరికీ అంతుపట్టని స్థితి. అయితే ప్రభుత్వాలు రక్షిత మంచి నీటిని గ్రామీణ ప్రాంతాలకు అందించే ప్రయత్నాలు చేయలేదని దీనర్థం కాదు. ఈ ప్రాజెక్టుల నిర్వహణ పేల వంగా ఉంటున్నందున వీటి ప్రయోజనం నెరవేరటం లేదు. ఇలాంటి సందర్భాల్లో గ్రామీణులు ఎప్పుడొ స్తుందో తెలీని నీటి ట్యాంకుల కోసం ఎదురు చూస్తూ ఉండటం తప్పనిసరి అవుతోంది. నీటి సరఫరాలోని వ్యత్యాసాలకు సంబంధించి మహారాష్ట్రలో గణాంకాలు సుస్పష్టంగా వెల్లడిస్తున్న ట్లుగా దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మధ్య కాస్త తేడా ఉండవచ్చు. ఈ సందర్భంగా శరద్‌జోషి వివరణను మళ్లీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇండియా ఉంటున్నట్లే అక్కడ భారత్ కూడా ఉంటోంది. వీటిలో ఏది మరొక దానితో సమవర్తన కలిగి ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు మరి. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు: మహేష్ విజాపుర్కార్ ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
నరకయాతన
నరకయాతన పుట్టూరు(పార్వతీపురం రూరల్), : వేసవి రాకముందే పుట్టూరు గ్రామస్తులు తాగునీటికి ఇబ్బంది పడుతున్నా రు. గ్రామంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం నుంచి అరకొర నీరు సరఫరా అవుతుండడంతో బిందెడు నీటికోసం గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. సంవత్సరం కిందట రూ.12 లక్షలతో గ్రామంలో రక్షిత మంచినీటి పథకం నిర్మించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ట్యాంకులోకి నీరు సక్రమంగా చేరడం లేదు. దీంతో కుళాయిల ద్వారా కూడా అరకొర నీరే సరఫరా అవుతోంది. గ్రామంలో సుమారు మూడు వేల మంది ప్రజలున్నారు. బోర్లు కూడా లేకపోవడం తో తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయ బోర్లపై ఆధారపడా ల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచి నీటి పథకాని కి మరమ్మతులు చేపట్టి సరిపడా తాగునీ రు సరఫరా చేయాలని పలుమార్లు అధికారులు, పాలకులను కోరినా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి మంచి నీటి పథకానికి మరమ్మతులు చేపట్టాల ని ప్రజలు కోరుతున్నారు. -
ఈ దాహం తీరనిది!
సాక్షి, నిజామాబాద్ : ‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా తయారైంది కామారెడ్డి అధికార పార్టీ నేతలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల తీరు. ఇక్కడ భారీ తాగునీటి పథకం నిర్మాణానికి సర్కారు 140 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. వీటిని పూర్తి స్థాయిలో ఖర్చు చేశారు. కానీ, ఈ పనులతో పర్సెంటేజీల రూపంలో అధికార పార్టీ నేతలు, ఇంజనీరింగ్ అధికారుల ‘దాహం’ తీరిందే తప్ప, కామారెడ్డి ప్రాంతవాసులకు మాత్రం ఐదేళ్లుగా చుక్క నీరు అందలేదు. ట్రయల్ రన్ పూర్తయిందని గొప్పలు పోతున్న అధికారులు, నేతలు ఇప్పుటి వరకు ఖర్చు చేసిన నిధులు సరిపోవడం లేదని, తాగునీరు ప్రజల చెంతకు చేరాలంటే ఇంకా అదనంగా నిధులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి సర్కారు నుంచి ఇప్పటి వరకు సమాధానం లేదు. అంటే రానున్న వేసవిలోగా కూడా ప్రజలకు ఈ పథకం ద్వారా తాగునీరు సరఫరా చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఇదీ పరిస్థితి కామారెడ్డి పట్టణంతోపాటు, మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, సదాశివనగర్, తాడ్వాయి మండలాల పరిధిలో ఉన్న 219 గ్రామాలలోని 3.34 లక్షల మంది తాగు నీటి అవసరాలను తీర్చేందుకు 2008లో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. సదాశివనగర్ మండలం మల్లన్న గుట్ట వద్ద నాలుగు ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు (ఓహెచ్‌బీఆర్) నిర్మించాలని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయం నుంచి 0.87 టీఎంసీల నీటిని ఇందులోకి తరలించాలని నిర్ణయించారు. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటరీల ద్వారా గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేయాలని, మధ్య మధ్యలో నాలుగు సంపులను నిర్మించాలనుకున్నారు. ఇప్పటి వరకు ఎస్ఆర్ఎస్పీ జలాశయం వద్ద ఇన్‌టెక్ వెల్, ఫుట్‌బ్రిడ్జి, రిటైనింగ్‌వాల్, నీటిని శుద్ధి చేసే ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు పూర్తయ్యాయి, మూడు ఓహెచ్‌బీఆర్‌లను, నాలుగు సంపులను నిర్మించారు. నీటిని తోడేందుకు పంపుసెట్లను బిగించి, టెస్టింగ్ కూడా పూర్తి చేశారు. పైప్లైన్ల జాయింట్లను బిగించి ట్రయల్న్ ్రకూడా విజయవంతంగా నిర్వహించారు. మల్లన్న గుట్ట వద్దకు నీరు విజయవంతంగా చేరుకుంది కానీ పథకం లక్ష్యం మాత్రం నెరవేరలేదు. కారణం అక్కడి నుంచి కామారెడ్డి పట్టణానికి పైపులైన్ల నిర్మాణం పూర్తి కాకపోవడమే. ఫలితంగా పనులు ప్రారంభమై ఐదేళ్లు గడుస్తున్నా ఆయా గ్రామాల గొంతు తడవడం లేదు. రూ.72.75 కోట్ల అదనపు నిధులకు ప్రతిపాదనలు ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు ఒక్క గ్రామానికి కూడా తాగునీటిని సరఫరా చేయని గ్రామీణ నీటి సరఫరా అధికారులు అదనంగా 45 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఫేజ్-2 కింద రూ.72.75 కోట్లతో సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. ఇందులో ప్రస్తుత కిరణ్ సర్కారు రూ. 20 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులకు సంబంధించి అధికారులు టెండరు ప్రక్రియ చేపట్టారు. వచ్చిన నిధుల మేరకు పనులు పూర్తి చేశామని, మిగతా నిధుల కోసం ఎదురు చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కొనసాగుతున్న పైప్‌లైన్ పనులు మల్లన్నగుట్ట ఓబీహెచ్‌ఆర్‌ల నుంచి కామారెడ్డి పట్టణానికి తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రజారోగ్యశాఖ అదనంగా చేపట్టిన పైప్‌లైన్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారు రెండు నెలల క్రితం ప్రారంభమైన ఈ పనులు నెలలోపు పూర్తి చేస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించారు. గడువు పూర్తి అయినా పను లు ఓ కొలిక్కి రాలేదు. దీంతో రానున్న వేసవిలోనూ కామారెడ్డి పట్టణవాసులకు తాగునీరందే అవకాశాలు కనిపించడం లేదు. -
‘గోదావరి’ గొంతు తడిపేనా?
గజ్వేల్, న్యూస్‌లైన్: తాగునీటి సమస్యతో అల్లాడుతున్న గజ్వేల్ నియోజకవర్గానికి గోదావరి సుజల స్రవంతి పథకమే శరణ్యమయ్యేలా ఉంది. హైదరాబాద్ నగరవాసుల దాహార్తి తీర్చడానికి రూపొందించిన ఈ పథకం పైప్‌లైన్, నియోజకవర్గంలోని గజ్వేల్, కొండపాక, జగదేవ్‌పూర్, వర్గల్, ములుగు మండలాల్లో సుమారు 60 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ పైప్‌లైన్‌కు ట్యాప్ చేసి 0.25 టీఎంసీల నీటిని అందించగలిగితే గజ్వేల్ నియోజకవర్గ దాహార్తి తీర్చవచ్చు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని ఈ పథకం పనులను నిర్వహణ బాధ్యతలను చేపట్టిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్‌కు ఇక్కడినుండి పదినెలల క్రితం ప్రతిపాదనలు వెళ్లాయి. ఆమోదం కోసం ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే నియోజకవర్గంలోని కొండపాక, జగదేవ్‌పూర్, ములుగు మండలాల్లో దాహార్తి తీరనుంది. జంటనగరాల్లోని కుత్భుల్లాపూర్, రాజేంద్రనగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కాప్రా, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గోదావరి సుజలస్రవంతి పథకాన్ని రూ.3,375 కోట్ల అంచనాల వ్యయంతో అంకురార్పణ చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి 10 టీఎంసీల నీటిని తరలించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 186 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ను విస్తరించడానికి పనులు వేగంగా సాగుతున్నాయి. కొన్నిచోట్ల పూర్తి కావస్తున్నాయి. 2013 డిసెంబర్‌లోగా పథకాన్నిపూర్తి చేయాలనే సంకల్పంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో రాజీవ్హ్రదారిని ఆనుకుని ఈ పనులు సాగుతున్నాయి. పైప్‌లైన్ విస్తరణ, భూసేకరణ పరంగా గజ్వేల్ నియోజకవర్గంలోనే ఎక్కువ నష్టం జరుగుతోంది. నియోజకవర్గంలోని కొండపాక, జగదేవ్‌పూర్, గజ్వేల్, వర్గల్, ములుగు మండలాల్లో సుమారు 60 కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన్ విస్తరించి ఉంది. అదేవిధంగా మొత్తం సేకరిస్తున్న 1,800 ఎకరాల భూమిలో ఈ నియోజకవర్గంలోనే 500 ఎకరాలకు పైగా ఉంది. అనుమతి లభించేనా? గజ్వేల్ నియోజకవర్గంలో మంచినీటి సమస్యను శాశ్వతంగా నిర్మూలించేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గోదావరి సుజల స్రవంతి పథకంపై దృష్టి సారించారు. ఇదే మండలం గుండా వెళ్తున్న ఈ పథకం పైప్‌లైన్‌ను ట్యాప్‌చేసి 0.25 టీఎంసీల నీటిని పొందగలిగితే కొండపాక మండలంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు జగదేవ్‌పూర్, ములుగు మండలాల్లో కూడా దాహార్తితో అల్లాడుతున్న మరికొన్ని గ్రామాలకు తాగునీటిని అందించవచ్చని భావించారు. ఇందులో భాగంగానే పదినెలల క్రితం ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు గోదావరి పథకం పనులను నిర్వహిస్తున్న హెచ్ఎండబ్ల్యూఎస్కు పంపించారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే ఆయా మండలాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. భారీ తాగునీటి పథకాల నుండి నీటి మళ్లింపు జరపడం కొత్త కాదని, గజ్వేల్ ప్రాంతం నుంచి వెళ్లిన ప్రతిపాదనలకు ఆమోదం లభించడం ఖాయమని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఈ పథకం పనులు వేగంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల పూర్తయ్యాయి. అయినా గజ్వేల్ ప్రతిపాదనలపై చడీచప్పుడు లేకపోవడం స్థానికులను ఆందోళన కలిగిస్తోంది. -
అడుగంటుతున్న ఆశలు
సాక్షి, తిరుపతి:జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రమవుతోంది. సగటున ఒకరికి రోజుకు 135 లీటర్ల నీరు అవసరం. అందులో తాగునీరు పది లీటర్లమేర అవసరం ఉంది. ఈలెక్కన జిల్లాలోని 22 లక్షల మంది జనాభాకు రోజుకు 2.97 కోట్ల లీటర్లు అవసరం. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుంగనూరు, పుత్తూరు, పలమనేరు, నగరి మున్సిపాలిటీలతో పాటు 36 మండలాల పరిధిలోని 432 గ్రామాలకు కలిపి 1.17 కోట్ల లీటర్ల నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. నగరాలు, పట్టణాలు మినహా గ్రామాలకు బోర్లను అద్దెకు తీసుకుని ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 21 మండలాల్లో తాగునీటి ఎద్దడి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో 18 మండలాల్లో ప్రమాదస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. జిల్లాలో 30వేలకు పైగా తాగునీటి బోర్లు ఉన్నాయి. వీటిలో ఆర్డబ్ల్యూఎస్ కింద 18వేల బోర్లు ఉన్నారుు. వీటిలో అనేక బోర్లలో నీటి చుక్క కనిపించడం లేదు. ఒక్క శాంతిపురం మండలంలో 204 బోర్లు ఉంటే, అందులో 114 బోర్లు ఎండిపోయూరుు. కొన్ని చోట్ల వ్యవసాయబోర్లు, ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. కొన్నిప్రాంతాల్లో రెండు, మూడు రోజులకోసారి సరఫరా చేస్తుంటే, మరి కొన్ని ప్రాంతాల్లో సరఫరా చేస్తున్న దాఖలాలే లేవు. రోజూ కిలో మీటర్ల దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. నగరాలు, పట్టణాల్లో నాలుగైదురోజులకొకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేచోట మహిళలు కొట్టుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. శాశ్వత నీటి వనరులేవీ... జిల్లాలో మంచినీటి సరఫరా కోసం శాశ్వత నీటి వనరులు లేకపోవడం గమనార్హం. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, ఎండిపోయాయి. మరో వైపు విచ్చలవిడిగా బోరుబావుల తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణాతో భూగర్భ జలాల మట్టం నానాటికీ పడిపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 36 మండలాల్లో సుమారు 3 లక్షలకుపైగా పవర్‌బోర్లు వేయడంతో ప్రభుత్వం డార్క్ ఏరియాగా ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం జిల్లాలో సగటున భూగర్భ జలమట్టం 12.68 మీటర్లు నమోదు కావాల్సి ఉండగా, 21 మండలాల్లో 20 మీటర్ల కంటే లోతుకు పడిపోయినట్లు తెలుస్తోంది. అందులో 18 మండలాలను డీప్లెవల్ ప్రాంతాలుగా పరిగణించారు. భూగర్భ జలాల అభివృద్ధికి జిల్లా నీటియాజమాన్య సంస్థ(డ్వామా) ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ పనులు నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. 35 మండలాల్లో రూ.237 కోట్లతో 47 మెగా వాటర్‌షెడ్స్ ప్రాజెక్టుల కింద అభివృద్ధి పనులు చేపడుతున్నారు. సా.. గుతున్న సేద్యం ఎన్నడూ లేని విధంగా సాగు విస్తీర్ణం పడిపోయింది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 64,060 హెక్టార్లైతే.. సాగైంది 53,628 హెక్టార్లే. గత ఏడాది 55,095 హెక్టార్లలో పంటలు సాగుచేశారు. ఏటా సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. నీటి కాలుష్యం కూడా సమస్యకు మరో కారణంగా చెప్పొచ్చు. నగరిలో బట్టలకు అద్దే రంగుల కారణంగా భూగర్భ జలాలు కలుషితమవుతుండడంతో సత్రవాడ, రామాపురం పరిధిలో బోర్లువేసి చాలీచాలని నీటిని సరఫరా చేస్తున్నారు. ఏర్పేడు మండల పరిధిలోని చెన్నంపల్లె, పెన్నగడ, కొత్తకాల్వ, పెనుమల్లం, గుడిమల్లం తదితర గ్రామాలతో పాటు రేణిగుంట మండల పరిధిలోని మరికొన్ని పల్లెల మీదుగా ప్రవహించే నక్కలవంక వాగులో నీరు కలుషితం అవుతోంది. గాజులమండ్యం పారిశ్రామికవాడ నుంచి వచ్చే వ్యర్థనీరు కలుస్తుండడంతో నీరు కలుషితమవుతోంది. ఏటా పడిపోతున్న భూగర్భ జల నీటిమట్టం సంవత్సరం నీటి మట్టం (మీటర్లు) 2005 6.58 2006 9.91 2007 9.90 2008 8.26 2009 11.45 2010 8.79 2011 10.11 2012 15.77 2013 17.88 (ఆగస్టు నాటికి)