గజ్వేల్, న్యూస్‌లైన్: తాగునీటి సమస్యతో అల్లాడుతున్న గజ్వేల్ నియోజకవర్గానికి గోదావరి సుజల స్రవంతి పథకమే శరణ్యమయ్యేలా ఉంది. హైదరాబాద్ నగరవాసుల దాహార్తి తీర్చడానికి రూపొందించిన ఈ పథకం పైప్‌లైన్, నియోజకవర్గంలోని గజ్వేల్, కొండపాక, జగదేవ్‌పూర్, వర్గల్, ములుగు మండలాల్లో సుమారు 60 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ పైప్‌లైన్‌కు ట్యాప్ చేసి 0.25 టీఎంసీల నీటిని అందించగలిగితే గజ్వేల్ నియోజకవర్గ దాహార్తి తీర్చవచ్చు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని ఈ పథకం పనులను నిర్వహణ బాధ్యతలను చేపట్టిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్‌కు ఇక్కడినుండి పదినెలల క్రితం ప్రతిపాదనలు వెళ్లాయి. ఆమోదం కోసం ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే నియోజకవర్గంలోని కొండపాక, జగదేవ్‌పూర్, ములుగు మండలాల్లో దాహార్తి తీరనుంది.
జంటనగరాల్లోని కుత్భుల్లాపూర్, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కాప్రా, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గోదావరి సుజలస్రవంతి పథకాన్ని రూ.3,375 కోట్ల అంచనాల వ్యయంతో అంకురార్పణ చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి 10 టీఎంసీల నీటిని తరలించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 186 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ను విస్తరించడానికి పనులు వేగంగా సాగుతున్నాయి. కొన్నిచోట్ల పూర్తి కావస్తున్నాయి. 2013 డిసెంబర్‌లోగా పథకాన్నిపూర్తి చేయాలనే సంకల్పంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో రాజీవ్హ్రదారిని ఆనుకుని ఈ పనులు సాగుతున్నాయి. పైప్‌లైన్ విస్తరణ, భూసేకరణ పరంగా గజ్వేల్ నియోజకవర్గంలోనే ఎక్కువ నష్టం జరుగుతోంది. నియోజకవర్గంలోని కొండపాక, జగదేవ్‌పూర్, గజ్వేల్, వర్గల్, ములుగు మండలాల్లో సుమారు 60 కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన్ విస్తరించి ఉంది. అదేవిధంగా మొత్తం సేకరిస్తున్న 1,800 ఎకరాల భూమిలో ఈ నియోజకవర్గంలోనే 500 ఎకరాలకు పైగా ఉంది.
అనుమతి లభించేనా?
గజ్వేల్ నియోజకవర్గంలో మంచినీటి సమస్యను శాశ్వతంగా నిర్మూలించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గోదావరి సుజల స్రవంతి పథకంపై దృష్టి సారించారు. ఇదే మండలం గుండా వెళ్తున్న ఈ పథకం పైప్‌లైన్‌ను ట్యాప్‌చేసి 0.25 టీఎంసీల నీటిని పొందగలిగితే కొండపాక మండలంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు జగదేవ్‌పూర్, ములుగు మండలాల్లో కూడా దాహార్తితో అల్లాడుతున్న మరికొన్ని గ్రామాలకు తాగునీటిని అందించవచ్చని భావించారు. ఇందులో భాగంగానే పదినెలల క్రితం ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు గోదావరి పథకం పనులను నిర్వహిస్తున్న హెచ్‌ఎండబ్ల్యూఎస్‌కు పంపించారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే ఆయా మండలాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. భారీ తాగునీటి పథకాల నుండి నీటి మళ్లింపు జరపడం కొత్త కాదని, గజ్వేల్ ప్రాంతం నుంచి వెళ్లిన ప్రతిపాదనలకు ఆమోదం లభించడం ఖాయమని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఈ పథకం పనులు వేగంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల పూర్తయ్యాయి. అయినా గజ్వేల్ ప్రతిపాదనలపై చడీచప్పుడు లేకపోవడం స్థానికులను ఆందోళన కలిగిస్తోంది.
‘గోదావరి’ గొంతు తడిపేనా?
Published Sun, Oct 13 2013 12:01 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement