కూకట్‌పల్లి ఐడియల్ రోడ్డు సమీపంలో స్తంభించిన ట్రాఫిక్
సాక్షి, హైదరాబాద్ : కూకట్‌పల్లి రహదారిలో వాహనదారులు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే ఇరుకైన రహదారి, దీనికితోడు వాటర్‌వర్క్స్ పనుల కారణంగా తొమ్మిది కిలోమీటర్ల దూరం చేరుకునేందుకు తొమ్మిది గంటలు పడుతుండటంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. అధికారుల అనాలోచిత నిర్ణయాలు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే ఇందుకు కారణం. కూకట్‌పల్లి ఐడియల్ రోడ్డు సమీపంలోని ఇరుకైన రోడ్డుపై వాటర్ వర్క్స్ అధికారులు తవ్విన గోతులను పూడ్చివేయడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయత్రం వరకు వాహనాలు కనీసం గంటకు కిలోమీటర్ కూడా ముందుకు సాగలేకపోయాయి.
జాతీయ రహదారిపై స్మశానవాటిక ప్రహరీ కారణంగా రోడ్డు కుంచించుకుపోయింది. బుధవారం అదే ప్రాంతంలో వాటర్ వర్క్స్ అధికారులు పైపులైను కోసం తవ్వకాలు చేపట్టడంతో కేబుల్స్ తెగిపోయాయి. దీంతో ఆయా సంస్థల సిబ్బంది వాటికి మరమ్మతులకు పూనుకున్నారు. దీంతో నిమిషానికి 500 వాహనాలు నడిచే ఈ రహదారిపై 10 అడుగులు మాత్రమే మిగలడంతో వాహనాలు ఒక్కొక్కటిగా ముందుకు సాగాల్సి వచ్చింది. దీంతో కూకట్‌పల్లి నుంచి మియాపూర్ వరకు ట్రాఫిక్ స్తంభించింది.
Comments
Please login to add a commentAdd a comment