అహ్మదాబాద్: ఇటీవల ఓ వ్యక్తి వ్యాక్సిన్ వేసుకోకుండానే మొదటి డోసు తీసుకున్నట్లు మెసేజ్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. కొవిన్ పోర్టల్‌లో ఆ లోటుపాట్లను సరిదిద్దడం పక్కన పెడితే ఇలాంటి ఘటనలే మళ్లీ జరుగుతునే ఉన్నాయి. తాజాగా రెండు నెలల కిందట మరణించిన ఓ వ్యక్తికి కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఇచ్చినట్టు వాక్సిన్ పోర్టల్ నుంచి మెసేజ్ రావడంతో ఆ కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. హర్జీ లక్ష్మణ్ పర్మార్ కరోనాతో ఏప్రిల్ 23న బనస్కాంతలో తరాడ్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, అతని కుమారుడు వెర్షిభాయ్ పర్మార్ అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే, ఆశ్చర్యకరంగా, జూలై 14 న వర్షిభాయ్‌కు కోవిన్ వ్యాక్సిన్ పోర్టల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అందులో తన తండ్రికి కరోనా వ్యాక్సిన్ రెండో డోసు టీకా వేసినట్లు, అందుకు ధన్యవాదాలు తెలుపుతూ అందులో ఉంది. దీంతో తండ్రి చనిపోయి బాధలో ఉన్న వెర్షిభాయ్‌కు ఇలాంటి మెసేజ్‌లు తమ గాయాలపై ఉప్పు వేసినట్టు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిన్ వ్యాక్సిన్ పోర్టల్ నుంచి గతంలోనూ ఇలానే వ్యాక్సినేషన్‌కు సంబంధించి పలు తప్పుడు మెసేజ్‌లు వచ్చాయి.
వెర్షిభాయ్ మాట్లాడుతూ.. మా నాన్న ఎప్పుడూ టీకా కోసం వెళ్ళలేదు. అసలు మొదటి డోసు కూడా తీసుకోలేదు. సమయానికి ఆక్సిజన్, బెడ్ దొరికి ఉండుంటే తన తండ్రి ఇంకా బతికే ఉండేవాడని వాపోయాడు. సకాలంలో చికిత్స అందించేందుకు అవసరమైన బెడ్ లభించక ఓ వ్యక్తి మరణిస్తే విచిత్రంగా ఆయనకు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు చూపుతున్నారని, సంబంధిత అధికారాలు ఇకనైనా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అతను కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment